logo

తెదేపా బలోపేతానికి కృషి

అరకులోయ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర అన్నారు.

Published : 06 Dec 2023 03:35 IST

అరకులోయ ఇన్‌ఛార్జి దొన్నుదొర

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర అన్నారు. పార్టీ ఇన్‌ఛార్జీగా అధిష్ఠానం తనని నియమించడంపై అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధినేత అంచనాలు నిజం చేసేలా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు. తెదేపా శ్రేణులను సమన్వయం చేసుకుని పనిచేస్తానన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు.  నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ పర్యటించి తెదేపా బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు.

కిడారి, దొన్నుదొరల నియామకంపై హర్షం

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: అరకు పార్లమెంట్‌, అరకులోయ అసెంబ్లీ తెదేపా ఇన్‌ఛార్జిలుగా శ్రావణ్‌కుమార్‌, దొన్నుదొరలను నియమించడంపై ఆ పార్టీ శాఖ అధ్యక్షుడు తుడుము సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వారి వెంటే ఉండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జెండాను ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అరకు పార్లమెంట్‌ ఎస్టీసెల్‌ ఉపాధ్యక్షుడు కమ్మిడి సుబ్బారావు, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి స్వామి, మాజీ ఎంపీపీ దన్నేరావు, మాజీ సర్పంచి సుబ్బారావు, ఎస్టీసెల్‌ ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అర్జున్‌, నాయకులు రాంబాబు, బాబూరావు, చంటి తదితరులు పాల్గొన్నారు.


అసంతృప్తి కలిగించింది..: అబ్రహం

మద్దతుదారుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పూర్వ సభ్యుడు సివేరి అబ్రహం

అరకులోయ, న్యూస్‌టుడే: తెదేపా ఇన్‌ఛార్జి పదవిని ఏకపక్షంగా ప్రకటించటం పార్టీకి చేటుగా పరిణమిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పూర్వ సభ్యుడు సివేరి అబ్రహం అన్నారు. అరకులోయలో తన మద్దతుదారులు, పార్టీ అభిమానులతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. అధిష్ఠానం నియోజకవర్గంలోని పార్టీలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా ఇన్‌ఛార్జిగా దొన్నుదొరని ప్రకటించటం అసంతృప్తికి గురి చేసిందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులను కలిసి తన ఆవేదన తెలియజేస్తానన్నారు.  మాజీ సర్పంచులు త్రినాథ్‌, వెంకటరావు, కామేష్‌, తెదేపా మాజీ మండల అధ్యక్షుడు కమిడి సుబ్బారావు, తెదేపా నాయకులు మండ్యాగురు స్వామి, శాస్త్రిబాబు, ధను, దొన్ను, రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.


నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: శ్రావణ్‌

అధినేత చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌

అరకులోయ, న్యూస్‌టుడే: తెదేపా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తనని నియమించడంపై మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అధినేత చంద్రబాబునాయుడుని కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి...పార్టీ పటిష్ఠతకి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని