logo

కోలుకోలేని దెబ్బ

మిగ్‌జాం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పాడేరు- అరకు మార్గంలో బర్మన్‌గుడ గ్రామానికి చెందిన ఒలిబిరి భీమన్న అనే గిరిజన రైతు ఎకరం వరి పంట చేతికి వచ్చే సమయంలో వరి పనలు పూర్తిగా నీటమునగడంతో నష్టపోయానని వాపోయారు.

Published : 06 Dec 2023 03:48 IST

వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి, చెరకు పైర్లు
అన్నదాతలను వణికించిన మిగ్‌జాం తుపాను

వర్షానికి తడిసిన వరి పనలు

పాడేరు, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పాడేరు- అరకు మార్గంలో బర్మన్‌గుడ గ్రామానికి చెందిన ఒలిబిరి భీమన్న అనే గిరిజన రైతు ఎకరం వరి పంట చేతికి వచ్చే సమయంలో వరి పనలు పూర్తిగా నీటమునగడంతో నష్టపోయానని వాపోయారు. 30 వేలు వరకు ఖర్చు చేశానని తెలిపారు. పాడేరు మండలంలో చాలా మంది గిరిజనులు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా అప్రమత్తమయ్యారు. మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఒక్కరోజు ముందుగానే వరి కోతలు ప్రారంభించడంతో వరి పనలు తడిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించింది.

చింతపల్లి, లంబసింగి ఘాట్‌రోడ్డులో నిలిచిన వాహనాలు

జిల్లాలో 21.61 మి.మీ వర్షపాతం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం సరాసరి 21.61 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలో అత్యధికంగా అనంతగిరిలో 52.4 వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా దేవీపట్నం మండలంలో 3.4, డుంబ్రిగుడ 45.6, గంగవరం 36.8, పాడేరు 33.8,ఎటపాక 30.2, కూనవరం 24.2, హుకుంపేట 23.8, జి.మాడుగుల 26.2, రంపచోడవారం 20.4, జీ.కే.వీధి 20.8 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు.

అనంతగిరి, న్యూస్‌టుడే: మండలంలో ఎడతెరిపి లేని వర్షంతో జన జీవనం స్తంభించింది. గుమ్మ పంచాయతీ వంజలవలస గ్రామానికి చెందిన బిడ్డ పైడిరాజు పెంకుటిల్లు నేల మట్టం అయింది. ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఎక్కడికక్కడ రహదారులన్నీ చిత్తడిగా తయారయ్యాయి. శారద, గోస్తనీ నదులు ఉప్పొంగి ప్రవహించాయి.

సంపంగిగెడ్డలో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డుంబ్రిగుడ, హుకుంపేట, అరకులోయ మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కించుమండ సంపంగిగెడ్డలో వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. సంపరగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాపరాయి, గోరాపూర్‌, కురిడి గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాపరాయిలో పర్యటకుల సందర్శనను నిలుపు చేశారు. జాతీయ రహదారి చిత్తడిగా మారడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. వరి కోతలు నిలిచిపోయాయి. కల్లాల్లో టార్పాలిన్లు వేసి గిరిజన రైతులు వరి పంటను కాపాడుకొంటున్నారు.

పాడేరు- అరకు మార్గంలోని బర్మన్‌గుడ వద్ద తడిసిన పనలను చూపిస్తున్న  రైతు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాను కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మన్యంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం చింతపల్లి, లంబసింగి ఘాట్‌రోడ్డు వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయాయి. పక్కనే ఉన్న గ్రామానికి చెందిన గిరిజనులు, తోటి ప్రయాణికులు సహాయంతో చెట్టు కొమ్మలు నరికి, రహదారికి అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు. రహదారిని క్లీయర్‌ చేయగా ఇరువైపులా నిలిచిన వాహనాలు ముందుకు కదిలాయి.

వి.కోడాపల్లి సమీపంలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు కొమ్మల తొలగింపు


భారీ వర్షాలకు కూలిన ఇల్లు, పడిన చెట్లు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో జి.మాడుగుల మండలంలోని భారీ వర్షం కురిసింది. భీరం పంచాయతీ వి.కోడాపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పోలీసులు, స్థానిక నాయకులు, ప్రజలు సహకారంతో చెట్టును తొలగించి రాకపోకలు యథావిథిగా సాగించారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. జి.మాడుగుల పంచాయతీ చుట్టుమెట్ట గ్రామానికి చెందిన కిల్లో మహేష్‌కి చెందిన ఇల్లు సాయంత్రం 3 గంటల సమయంలో కూలిపోయింది. ఆ సమయంలో తల్లి కిల్లో లలిత, కుమారుడు ఇంట్లో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇల్లు పడిపోతున్నట్టు గమనించిన తల్లి, కుమారుడు బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రమాదం తప్పింది. సొలభం పంచాయతీ ఏనుగుగొంది గ్రామానికి చెందిన మాతే దేవన్నదొర, లింగమ్మలకు చెందిన నాలుగు ఎకరాల కోసిన వరి పంట వరదకు కొంత కొట్టుకుపోయింది. బొయితిలి పంచాయతీ వై.మండిభ గ్రామంలో రాజ్‌మా విత్తనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు.

చుట్టుమెట్ట గ్రామంలో కూలిన కిల్లో మహేష్‌ ఇల్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని