logo

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం..

Published : 07 Dec 2023 02:12 IST

కశింకోట, న్యూస్‌టుడే: జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కూండ్రం గ్రామానికి చెందిన సేనాపతి శిరీషాజ్యోతి (26) తన స్వగ్రామం నుంచి బైక్‌పై పాఠశాలకు వస్తూ కశింకోటలో మరో ఉపాధ్యాయిని కర్రి భాగ్యశ్రీతో బైక్‌పై తీసుకుని వెళ్తోంది. పాఠశాలకు కొద్ది దూరంలోనే వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో తూలిపడి లారీ చక్రం తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్రంగా గాయపడిన భాగ్యశ్రీని అనకాపల్లి ప్రాంతీయాసుపత్రికి అక్కడి నుంచి విశాఖకు తరలించారు. రెండేళ్లగా పాఠశాలలో పనిచేస్తున్న శిరీషాజ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సీఐ ఎ.రవికుమార్‌, ఎస్సై జె.నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. 


కశింకోట: జాతీయరహదారి బయ్యవరం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. జమాదులపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి శ్రీను (43) బయ్యవరం సిమెంటు కర్మాగారంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై  స్వగ్రామం వెళుతుండగా ఇక్కడ పెట్రోలు బంకు సమీపంలో ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. 


విద్యుదాఘాతంతో ఆర్టీసీ కండక్టర్‌..

అనకాపల్లి పట్టణం, రావికమతం, న్యూస్‌టుడే: కేఎన్‌ఆర్‌ పేటలో విద్యుదాఘాతంతో ఆర్టీసీ కండక్టర్‌ మృతిచెందారు. గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై సీహెచ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరావు (53) బుధవారం ఉదయం మోటారు వద్ద వర్షం నీరు చేరడంతో దీన్ని బయటకు పంపే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రావికమతం మండలం కొత్తకోటకు చెందిన కోట శ్రీనివాసరావు కేఎన్‌ఆర్‌ పేటలో ఉంటూ గాజువాక డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు.


చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు..

రాంబిల్లి, న్యూస్‌టుడే: దిమిలిలో చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు మృతి చెందింది. దీనిపై ఎస్సై డి.దీనబంధు కథనం ప్రకారం.. నగిరెడ్డి పైడితల్లి (77) మంగళవారం రాత్రి కట్టెల పొయ్యిపై చలిమంట  కాగుతుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని