logo

మిగ్‌జాం బీభత్సం.. రైతన్న కలవరం

తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నెల్లిపాక గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నీటి మునిగిన వరి, మిర్చి, పత్తి పొలాలను పరిశీలించారు.

Published : 07 Dec 2023 02:20 IST

ఎటపాక, న్యూస్‌టుడే: తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నెల్లిపాక గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నీటి మునిగిన వరి, మిర్చి, పత్తి పొలాలను పరిశీలించారు. తెదేపా నేతుల పుట్టి రమేష్‌బాబు,  కానూరి బుల్లెయ్య,  మాచినేని రాజేష్‌, బొల్లా రమేష్‌, గుర్రం సాయి, కర్రి బుజ్జి, చిలుకూరి శ్రీనివాసరావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


వరరామచంద్రాపురం, కూనవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం కుంటిసాకులు చెప్పకుండా, తుపానుకు నష్టపోయిన ప్రతీ రైతుని ఆదుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ డిమాండ్‌ చేశారు. వర్షాలతో మునిగిపోయిన వరి, మిర్చి, పొగాకు, అపరాల పంటలను వారు బుధవారం పరిశీలించారు. కూనవరం మండలంలో పాడైన పంటలను సీపీఎం, భాజపా, తెదేపా నాయకులు పరిశీలించారు. మేకల నాగేశ్వరరావు, సీతారామయ్య, నాగమణి, నోముల రామారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.


రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని మండల తెదేపా అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బొదిరెడ్డి త్రిమూర్తులు డిమాండ్‌ చేశారు.  రాజవొమ్మంగి, దూసరపాము, బడదనాంపల్లి, తంటికొండలో పర్యటించారు.


రంపచోడవరం, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత శీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో   మాట్లాడారు. రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.


కొయ్యూరు, న్యూస్‌టుడే: నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జీసీసీ మాజీ ఛైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్‌ కోరారు. కొయ్యూరులో నీటి మునిగిన వరి పనలను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బాధితులకు వైకాపా ప్రభుత్వం కనీసం భోజనం పెట్టలేకపోయిందని విమర్శించారు. అంతాడ పంచాయతీలో సీపీఐ మండల కార్యదర్శి దేముడు, రావణాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు.


అరకులోయ పట్టణం: బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్‌ చేశారు. యండపల్లివలస, బస్కి పంచాయతీ గ్రామాల్లో సీపీఎం నాయకులు పర్యటించి పాడైన పంటలను పరిశీలించారు.


ప్రమాదకరంగా ఘాట్‌రోడ్లు

చింతపల్లి గ్రామీణం,పాడేరు: లంబసింగి సమీపంలోని చెరువులవెనం వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో, పాడేరు ఘాట్‌రోడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెరువులవెనం వ్యూపాయింట్‌కు వెళ్లేందుకు గ్రావెల్‌ రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు, జీపులు నడుస్తున్నాయి. తుపాను కారణంగా కొండపై నుంచి వర్షపు నీరు దిగువకు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే వరకు పర్యటకులకు కాలినడక తప్పదు.


మత్య్సగెడ్డలో పడి గిరిజనుడి మృతి

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: మత్య్సగెడ్డలో పడి గిరిజనుడు మృతి చెందాడు. ఎస్సై మనోజ్‌కుమార్‌, స్థానికుల వివరాల ప్రకారం.. పెదకోడాపల్లి పంచాయతీ పరదానిపుట్టు సమీప మత్స్యగెడ్డ ఒడ్డున గ్రామానికి చెందిన బుధవారం కిల్లో రామకృష్ణ (40) మరొకరితో కలిసి పశువులు కాస్తున్నాడు. భారీ వర్షాలకు గెడ్డ ఒక్కసారిగా ఉద్ధృతిగా మారడంతో ఒడ్డు కూలిపోయి రామకృష్ణ గెడ్డలో జారిపడి గల్లంతయ్యాడు. కొంత సమయానికి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు

పాడేరు, న్యూస్‌టుడే: మత్స్యగెడ్డలో వరద ఉద్ధృతికి ముగ్గురు పశువుల కాపరులు చిక్కుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇరాడపల్లి పంచాయతీ డి.సంపాలు సమీపంలో పశువులు గెడ్డలో దిగిపోయాయి. దీంతో కాపరులు వాటిని దారి మళ్లించేందుకు గెడ్డలో దిగి చిక్కుకున్నారు. వాలంటీరు నాగేశ్వరరావు ఈత కొట్టుకొంటూ వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు.


వెలవెలబోయిన సంత

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: కించుమండ సంతబయలులో బుధవారం వారపు సంత వెలవెల బోయింది. తుపాను ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. గిరిజనులు, వ్యాపారులు లేక నిర్మానుష్యంగా మారింది.


గూడెంకొత్తవీధి, సీలేరు, న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చెట్టు కొమ్మ విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దేవరాపల్లి పంచాయతీ మల్లిఖార్జున గ్రామంలో ముర్ల చితుకులయ్య, పారత్వమ్మల ఇల్లు ధ్వంసమైంది. ధారకొండ, గుమ్మిరేవులలోని వరిచేలు నీటమునిగాయి.


జి.మాడుగుల, న్యూస్‌టుడే: కుంబిడిసింగి, గద్దెరాయి, సంఘం వంతెనల మీదుగా నీరు ప్రవహించింది. జి.మాడుగుల పాత రెవెన్యూ కాలనీలో రహదారికి అడ్డంగా చెట్టు పడింది. చేపల్లిలో ఇంటిపై చెట్టు పడింది. తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జడ్పీటీసీ సభ్యురాలు ఎం.వెంకటలక్ష్మి అన్నారు. బుధవారం కుంబిడిసింగి, సంఘం, గద్దెరాయి వంతెనలను ఆమె పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని