logo

సాగుచేస్తే అప్పులే.. అమ్మినా అరువే!

అందరికీ తీపిని పంచే చెరకు.. పండించే రైతులకు చేదే మిగుల్చుతోంది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. దిగుబడులు తగ్గిపోతున్నాయి..

Updated : 23 Feb 2024 06:11 IST

చెరకు రైతులకు చేదు ఫలితాలు
చెల్లింపులకు ఆరునెలలు ఆగాల్సిందేనా!

కర్మాగారం యార్డులో గానుగాటకు తెచ్చిన చెరకు

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, చోడవరం: అందరికీ తీపిని పంచే చెరకు.. పండించే రైతులకు చేదే మిగుల్చుతోంది. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. దిగుబడులు తగ్గిపోతున్నాయి.. ధరలు గిట్టుబాటు కావడం లేదు.. అమ్మినా సొమ్ములు చేతికి సకాలంలో చేరడం లేదు.. అరువుకు పంటను అప్పగించి నెట్టుకొస్తున్న రైతులు కొందరైతే.. కాడిని వదిలేస్తున్న వారే చాలామంది ఉన్నారు. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. గోవాడ కర్మాగారంలో క్రషింగ్‌ ఏటా తగ్గిపోతోంది. దీంతోపాటు చెరకు తోలి నెలల తరబడి సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

చెరకు సాగుపై రైతుకు ఎకరా సాగుకు రూ.60 వేలు ఖర్చవుతుంటే ఆదాయం రూ.45 వేలు నుంచి రూ.48 వేల వరకే వస్తోంది. నష్టమే రావడంతో చాలామంది ఇతర పంటలకు మళ్లిపోయారు. 2019లో అనకాపల్లి జిల్లాలో 76 వేల ఎకరాల్లో చెరకు సాగుచేస్తే 2023 నాటికి ఆ విస్తీర్ణం 21 వేలకు పడిపోయింది. అంటే నాలుగేళ్లలో 55 వేల ఎకరాలు చెరకు సాగు తగ్గిపోయింది. దీనికి పెట్టుబడులు పెరగడం, ప్రభుత్వమిచ్చే గిట్టుబాటు ధర చాలకపోవడంతో పాటు కర్మాగారానికి అమ్మినా సొమ్ములు అవసరానికి అందకపోవడం కూడా కారణాలే. గోవాడ చక్కెర కర్మాగారంలో 2022-23 బకాయిలు సుమారు రూ.12 కోట్లు చెరకు తోలిన ఆరు నెలలుకు గాని రైతుల ఖాతాలకు చేరలేదు. అది కూడా సాధారణ ఎన్నికలుండటంతో ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి ఇప్పించారు.

తక్కువైనా ప్రైవేటుకే అమ్మేస్తున్నారు..

సహకార చక్కెర కర్మాగారానికి చెరకు తోలితే 15 రోజుల్లో చెల్లించాలి. గోవాడలో నెలల తరబడి నగదు చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారు. 2023-24 గానుగాట డిసెంబర్‌ 29న మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 1.02 లక్షల టన్నులు చెరకు క్రషింగ్‌ చేశారు. ఈ ఏడాది టన్నుకు రూ.2,919.19 చొప్పున చెల్లించాలి. ఇప్పటి వరకు గానుగాడిన లక్ష టన్నులకు రూ.29.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. తక్కువ రేటే ఇస్తున్నా చాలామంది ప్రైవేటు కంపెనీలకు అమ్మేసుకుంటున్నారు. పంట తూకం వేసిన వెంటనే రైతు చేతిలో సొమ్ముపెట్టి చెరకు వారే తరలించుకుపోతున్నారు. దీంతో గోవాడకు వచ్చే చెరకు తగ్గిపోతుంది. గతంలో 5 లక్షల టన్నులు గానుగాడిన గోవాడ కర్మాగారంలో నేడు రెండు టన్నులు ఆడడం గగనమైపోతోంది.


వడ్టీలు కట్టుకోలేక..

గతేడాది గోవాడకు చెరకు తోలిన ఆరు నెలలకు డబ్బులు ఖాతాలో పడ్డాయి. అప్పటికే సాగు కోసం రూ.లక్షల్లో అప్పులు చేశాను. వాటికి నెలవారీ వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడ్డాం. ఏటా ఇదే పరిస్థితి అందుకే గతంలో 90 టన్నులు చెరకు తోలేవాళ్లం.. ఇప్పుడు 30 టన్నులకు తగ్గించేశాం. చెరకు తోలిన వెంటనే సొమ్ములు పడితే సాగుచేయడానికి కష్టమనించదు. పెట్టుబడులు పెరిగిపోయి.. అమ్మిన డబ్బులు అందకపోవడంతో చెరకు సాగు సగానికి తగ్గించుకున్నాం.

ఏడువాక అప్పలనాయుడు, చెరకు రైతు, గోవాడ


సొమ్ములకు గ్యారంటీ లేదు..

చెరకు తోలినా సకాలంలో డబ్బులివ్వడం లేదు. ఉద్యోగుస్తులకు జీతాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా.. మా పంటకు డబ్బులివ్వకుండా పంచదార అమ్మి డబ్బులు ఇస్తామంటున్నారు. పంచదార ఎప్పుడు అమ్ముతారు.. మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు. నెల రోజులైంది. నేటికి ఒక్క పైసా చెల్లించలేదు. ఇదివరకు 40 టన్నులు సరఫరా చేసేవాళ్లం.. ఇప్పుడు 13 టన్నులకు తగ్గించేశాం. గతేడాది పంటపై పెట్టిన పెట్టుబడికి రూ.19 వేల వరకు వడ్డీ చెల్లించాం.

నారాయణమూర్తి, చెరకు రైతు, లక్ష్మీపురం గ్రామం


ఉత్పత్తులు అమ్మకం పెట్టాం..చెల్లించేస్తాం!

ఈ గానుగాటలో నేటి వరకు నగదు చెల్లింపులు జరపని మాట వాస్తవమే.  కర్మాగారంలో చక్కెర, మొలాసిస్‌ను అమ్మకానికి ఉంచాం. ఈ రెండు అమ్మగా వచ్చిన నగదుతో చెరకు రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తాం. గానుగాట ప్రారంభించి 18 రోజుల వరకు చెరకు సరఫరా చేసిన రైతులందరికి సొమ్ములందుతాయి. ఆందోళన అవసరం లేదు.

వి.సన్యాసినాయుడు, ఎండీ, చక్కెర కర్మాగారం, గోవాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు