logo

పట్టించుకోని ప్రభుత్వం..ప్రవాసుల సాయం

ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలలకు భవనాలు అంతంత మాత్రం. దీంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 23 Feb 2024 01:42 IST

విద్యార్థుల భవితకు చేయూత

ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో రూ.మూడు లక్షలతో ఏర్పాటు చేసిన భోజనశాల  

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలలకు భవనాలు అంతంత మాత్రం. దీంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మన్యంలో గిరిజనులు ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1986లో గురుకులాలు స్థాపించారు. అప్పట్లో రంపచోడవరంలోనూ ఒకటి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో అయిదు నుంచి పదో తరగతి వరకు 470మంది విద్యార్ధులు చదువుతున్నారు. పదేళ్ల క్రితం పాఠశాల భవనం స్లాబ్‌, గోడలు బీటలు వారాయి. ఫలితంగా ప్రమాదభరితంగా మారింది. దీంతో ఉన్న విద్యార్థులంతా రాత్రి వేళల్లో నిద్రించే భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు.

రంపచోడవరంలో సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాల భవనం

గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై స్థానిక ప్రిన్సిపల్‌ అహ్మద్‌ ఆలీషా స్పందించి ఆరు తరగతి గదులను సొంత నిధులతో మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన పది ఐఎఫ్‌పీ (టీవీలను) తరగతి గదుల్లో అమర్చి విద్యార్ధులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులను తొలగించారు. అయితే చాలీచాలని భోజనశాల ఉండటంతో ప్రిన్సిపల్‌ అహ్మద్‌ ఆలీషా ఆమెరికాలో ఉంటున్న తన మిత్రుడు ఆనంద్‌కు ఇక్కడి పరిస్థితిని వివరించారు. అక్కడి ఎంఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆనంద్‌ రూ.మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తంతో 200 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా భోజనశాలను ఏర్పాటు చేశారు. సాయం చేసిన దాతను, చొరవ చూపిన ప్రిన్సిపల్‌ను ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని