logo

జూద శిబిరంలో ఇద్దరికి కత్తిపోట్లు

గోపాలపురం శివారు ప్రాంతంలో జూదం ఆడుతూ కత్తితో దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై డీఎస్పీ సుబ్బరాజు కథనం ప్రకారం..  విశాఖపట్నానికి చెందిన ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శివ జూదం శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటాడు.

Published : 24 Feb 2024 01:35 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: గోపాలపురం శివారు ప్రాంతంలో జూదం ఆడుతూ కత్తితో దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై డీఎస్పీ సుబ్బరాజు కథనం ప్రకారం..  విశాఖపట్నానికి చెందిన ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శివ జూదం శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. ఖాళీ ప్రదేశాలు గుర్తించి రాత్రివేళల్లో సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో జూదం ఆడిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గోపాలపురం శివారు ప్రాంతంలో ఈనెల 21న రాత్రి జూదం శిబిరం పెట్టాడు. ఇక్కడికి విశాఖపట్నం, గాజువాక ప్రాంతానికి చెందిన వారు వచ్చారు. రమణ జూదం ఆడుతూ పేకముక్క వేసే సమయంలో జరిగిన వాగ్వాదంలో ధర్మిరెడ్డి అనే వ్యక్తిని కత్తితో గాయపరిచాడు. ఈ విషయాన్ని ఆర్గనైజర్‌ శివకు అక్కడి వారు చెప్పడంతో రమణను మందలించాడు. వీంతో రమణ.. శివను కత్తితో గాయపరిచాడు. దీంతో భయాందోళనకు గురైన మిగిలినవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయాలపాలైన ధర్మిరెడ్డి, శివను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధర్మిరెడ్డి ఆసుపత్రి నుంచి వెళ్లిపోగా.. శివ వడ్లపూడిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం డీఎస్పీ అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఫిర్యాదు ఇవ్వడానికి ఎవరూ రాకపోయినా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు రమణ పరారీలో ఉన్నాడని, జూదం నిర్వహణలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని