logo

కట్టడం మాని.. కట్టుకథలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంచాయతీ కేంద్రంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రంతోపాటు హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజల చెంతకే వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. గొలుగొండ మండలంలో విలేజి క్లినిక్‌ల ఏర్పాటు ఊకదంపుడు ప్రచారంగానే మిగిలిపోయింది.

Published : 24 Feb 2024 01:38 IST

గొలుగొండ, న్యూస్‌టుడే

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంచాయతీ కేంద్రంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రంతోపాటు హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజల చెంతకే వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. గొలుగొండ మండలంలో విలేజి క్లినిక్‌ల ఏర్పాటు ఊకదంపుడు ప్రచారంగానే మిగిలిపోయింది. విలేజి క్లినిక్‌ల ఏర్పాటుకు మొదటి విడతగా గొలుగొండ మండలంలో 15 గ్రామాలను ఎంపిక చేసి భవనాలు మంజూరు చేశారు. వీటి నిర్మాణ పనులు అధికార పార్టీ నేతలకు అప్పగించారు. ఒక్కో భవనానికి రూ. 20.08 లక్షలు అంచనా వ్యయంతో నిధులు కేటాయించారు. వైకాపాలో డబ్బులు దండిగా ఉండి, అప్పులు చేయగలిగిన సత్తా ఉన్న కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకొచ్చి పనులు చేపట్టారు. కొన్ని చోట్ల స్లాబ్‌లు పూర్తిచేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కరోనా వచ్చింది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తరువాత 80 శాతం పనులు పూర్తిచేసిన గుత్తేదారులు సొమ్ములు కోసం ఎదురుచూపులు చూశారు. వారికి రోజులు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో మిగతావారు పనులు పూర్తి చేసేందుకు వెనక్కి జంకారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో 2022 నవంబరులో మాట్లాడుతూ వెంటనే భవనాల నిర్మాణం పూర్తిచేసి తీరాలని, జిల్లా కలెక్టర్లను ఆదేశించి చేసిన పని వివరాలు అందిస్తే ప్రతినెలా 20వ తేదీకి సొమ్ము అందేలా చూస్తామని, గుత్తేదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. కాగా కృష్ణబాబు చెప్పిన గడువు ముగిసి ఇప్పటికి 15 నెలలు అవుతోంది. అందని బిల్లులతోపాటు చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక పోతున్నాంటూ అధికార పార్టీ కార్యకర్తలు, చిన్న నేతలు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం పాతమల్లంపేట, లింగంపేటలో భవనాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా... మిగతా 14 అసంపూర్ణంగా ఉన్నాయి. గ్రామస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఎదురుచూసిన ప్రజలు అసంపూర్తి భవనాలు చూసి నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుంటే పనులు ఎలా పూర్తిచేయగలమని నిర్మాణదారుల ప్రశ్నకు సమాధానం కరవవుతోంది.


త్వరలో పూర్తవుతాయి

- అరుణ, పంచాయతీరాజ్‌ ఏఈఈ

కొన్ని సాంకేతిక కారణాల వల్ల గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతూ వస్తోంది. దీనివల్ల వారు పనులు మధ్యలో నిలిపేశారు. హెల్త్‌ క్లినిక్‌లకు సంబంధించి సొమ్ములు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరగా మండలానికి కేటాయించిన అన్ని భవనాలు పూర్తి చేయిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని