logo

వారంతా ఒక్కటిగా.. పేద విద్యార్థులకు తోడుగా..

గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఫోర్‌జీఆర్‌ ట్రస్టు అండగా నిలుస్తోంది. చదువుపై ఆసక్తి ఉన్నా.. పేదరికం కారణంగా ఎంతోమంది మధ్యలోనే విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారందరికి ఈ ట్రస్టు సభ్యులు భరోసా ఇస్తున్నారు.

Published : 24 Feb 2024 01:40 IST

ప్రతిభావంతులకు ప్రోత్సాహం
చోడవరం పట్టణం, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఫోర్‌జీఆర్‌ ట్రస్టు అండగా నిలుస్తోంది. చదువుపై ఆసక్తి ఉన్నా.. పేదరికం కారణంగా ఎంతోమంది మధ్యలోనే విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారందరికి ఈ ట్రస్టు సభ్యులు భరోసా ఇస్తున్నారు. ఓ ఉపాధ్యాయిని ప్రోత్సాహంతో పూర్వ విద్యార్థులంతా ఒక్కటై.. పేద విద్యార్థులకు తోడుగా నిలుస్తున్నారు.

చోడవరం పట్టణానికి చెందిన ఈగల వెంకట అన్నపూర్ణ 15 ఏళ్ల కిందట ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేశారు. అప్పట్లో ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులంతా పైసా పైసా పోగేసి ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు. చదువు పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో స్థిరపడిన వారంతా ఉపాధ్యాయిని అన్నపూర్ణను కలిసి అందరం కలిసి ఏదైనా చేద్దామని ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ క్రమంలో 2020 ఆగస్టు 15న ఫర్‌ ద గుడ్‌ రీజన్‌ (4జీఆర్‌) పేరుతో సేవా సంస్థ ఏర్పాటైంది.

  • ట్రస్టు ద్వారా ఏటా చోడవరంతోపాటు ఖండివరం, చీడికాడ, చుక్కపల్లి, మంచాల ఆదర్శ పాఠశాల, మేడివాడ, జి.అగ్రహారం, గాదిరాయి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు, దివ్యాంగులకు రూ. 25 వేల విలువ చేసే స్టడీ మెటీరియల్‌తోపాటు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. నూజివీడు ఐఐఐటీలో చదువుతున్న విద్యార్థిని ఆర్‌.వర్షితకు రూ.పది వేలు ఆర్థికసాయంగా అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు అవసరమైన విద్యా సంబంధ సామగ్రిని సమకూరుస్తున్నారు.
  • చోడవరం ప్రేమ సమాజంలో చదువుకుంటున్న విద్యార్థులకు క్రీడా సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. విద్యార్థులకు చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అనాథలకు, వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
  • హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రేమ సమాజం, పోలీస్‌స్టేషన్‌, భవిత కేంద్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. చోడవరం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రాజు కుమారుడు విద్యుదాఘాతానికి గురవగా.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు అందించారు.

చదువుకు దూరం కాకూడదనే..

- అన్నపూర్ణ, ట్రస్టు వ్యవస్థాపకురాలు

పేదరికం, ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే 4జీఆర్‌ ట్రస్టును పూర్వ విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేశాం. విద్యాపరంగా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని