logo

స్పందన ఫిర్యాదులపై అలసత్వం వద్దు

స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ విజయ సునీత అధికారులను ఆదేశించారు.

Published : 24 Feb 2024 01:50 IST

పాడేరు, న్యూస్‌టుడే: స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం- ప్రత్యేక స్పందనలో కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌ భావన, ఐటీడీఏ పీఓ అభిషేక్‌ ప్రజల నుంచి 110 వినతులు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రహదారులు, తాగునీటి సదుపాయాల కోసం అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులు నిర్దేశించిన సమయానికి స్పందనకు హాజరుకావాలని స్పష్టంచేశారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ శరభగుడ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించాలని ఎంపీటీసీ సభ్యుడు దురియా ఆనంద్‌కుమార్‌ వినతిపత్రం సమర్పించారు. పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ శ్రీపురం కూడలి నుంచి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ చేరువీధి వరకు మట్టి రోడ్డు నిర్మించాలని కె.రాంబాబు, బి.కృష్ణపడాల్‌ తదితరులు విన్నవించారు. పెదబయలు మండలం పెదకోడాపల్లి గ్రామ సచివాలయం భవనం త్వరితగతిన పూర్తి చేయాలని పాంగి ప్రసాద్‌ కోరారు. పెదబయలు మండలం కుర్తాడ నుంచి బూరుగువీధి వరకు రోడ్డు నిర్మించాలని బొండపల్లి సర్పంచి జి.మత్స్యరాజు వినతి పత్రం అందించారు. పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ నడింవీధిలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, తక్షణమే సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు మంగమ్మ, కొండమ్మ తదితరులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో రోడ్డు నిర్మించానని, బిల్లులు మంజూరు చేయాలని గుత్తేదారు ఎం.నాగభూషణం విన్నవించారు. పీవీటీజీలకు ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని భాషా వాలంటీర్లు కోరారు. డీఆర్‌ఓ లక్ష్మణమూర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్లు వి.వి.ఎస్‌ శర్మ, భవానీ, గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, వేణుగోపాల్‌, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డీఎల్‌పీఓ పి.ఎస్‌ కుమార్‌, ఎల్‌డీఎం రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని