logo

పోరాడితేనే రెన్యువల్‌ చేస్తారా?

ఆదివాసీ మాతృభాషా వాలంటీర్లను తక్షణమే రెన్యువల్‌ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్సయ్య డిమాండ్‌ చేశారు.

Published : 24 Feb 2024 01:51 IST

పాడేరు, న్యూస్‌టుడే: ఆదివాసీ మాతృభాషా వాలంటీర్లను తక్షణమే రెన్యువల్‌ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్సయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట భాషా వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెన్యువల్‌ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు వారు యత్నించగా ఎస్సై లక్ష్మణ్‌రావు, సిబ్బంది అడ్డుకున్నారు. తమ సమస్యలపై జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు పట్టుబట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న అప్పలనర్సయ్య మాట్లాడుతూ.. ప్రాథమిక అక్షరాస్యత పెంచడం, నైపుణ్యం సాధించడంలో భాషా వాలంటీర్లు పాత్ర కీలకమని పేర్కొన్నారు. పోరాటం చేస్తేనే వీరిని రెన్యువల్‌ చేస్తామనే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. అనంతరం వాలంటీర్లు, అప్పలనర్సయ్య జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలకు వినతిపత్రం అందజేశారు. గిరిజన సంక్షేమశాఖ, ఎస్‌ఎస్‌ఏ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్‌ విజయ సునీత హామీ ఇచ్చారు. ఐటీడీఏ పీవో అభిషేక్‌ మాట్లాడుతూ.. ఈ సమస్యపై ఇప్పటికే ఉన్నతాధికారులకు లేఖరాసినట్లు పేర్కొన్నారు. భాషా వాలంటీర్ల సంఘం రాష్ట్ర నాయకులు సర్బునాయుడు, చంద్రయ్య, వీరయ్య, గణేష్‌, కుమారి, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని