logo

కొండకర్ల రిసార్ట్స్‌లో రేవ్‌ పార్టీ!

అచ్యుతాపురం మండలం కొండకర్లలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి రిసార్ట్స్‌లో రేవ్‌ పార్టీలో యువతీ యువకుల ఘర్షణ పోలీస్‌ స్టేషన్‌ వరకు దారితీసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 24 Feb 2024 01:53 IST

మద్యం మత్తుతో యువతీ, యువకుల ఘర్షణ
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

చ్యుతాపురం మండలం కొండకర్లలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి రిసార్ట్స్‌లో రేవ్‌ పార్టీలో యువతీ యువకుల ఘర్షణ పోలీస్‌ స్టేషన్‌ వరకు దారితీసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మ్మడి విశాఖ జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది యువకులు, నలుగురు యువతులను తీసుకొని బుధవారం రాత్రి కొండకర్ల రిసార్ట్స్‌కు వచ్చారు. అధికార పార్టీకి చెందిన నేత రిసార్ట్స్‌లో సాయంత్రం నుంచి మత్తు పదార్థాలు తాగి తెల్లవారుజాము వరకు గడిపారు. మద్యం మత్తు ఎక్కువ కావడంతో వెంట తీసుకొచ్చిన యువతులను దుస్తులు లేకుండా డ్యాన్స్‌ చేయమని ఒత్తిడి చేశారు. దీంతో రక్షించాలని వారు 100 నంబరుకు ఫోన్‌ చేసి కోరారు. పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నుంచి అచ్యుతాపురం పోలీసులకు సమాచారం అందడంతో ఇద్దరు పోలీసులు రిసార్ట్స్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు యువకులు, యువతులు కనిపించారు. పోలీసులు రావడంతో మద్యం మత్తులో ఉన్నవారు జారుకున్నారో? జారవిడిచారో? తెలియదుకానీ అంతా కనిపించకుండా పోయారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్‌ కాదని.. కష్టంలో ఉన్న యువతులు సాధారణంగా ప్రజలందరూ ఉపయోగించే 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. యువతులు పోలీసులకు సమాచారం అందించినా ఒత్తిడో, కాసుల కక్కుర్తో తెలియదుకానీ కేసు నమోదు కాలేదు. తరలించిన యువతీ, యువకులను మందలించి వదిలేసినట్లు తెలిసింది. దీనిపై అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజును వివరణ కోరగా మద్యం మత్తులో చిన్నపాటి ఘర్షణ జరిగినట్లు 100కు సమాచారం రావడంతో స్పందించి పరిశీలించామని, ఎటువంటి ఇబ్బందిలేదని తెలిసిందన్నారు. యువతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, అందుకే కేసు నమోదు చేయలేదన్నారు.

అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా..  ప్రకృతి ప్రేమికుల మదిని దోచే కొండకర్ల ఆవ అందాలను చూడడానికి వచ్చే పర్యటకుల కోసం ఆవను  ఆనుకొని ఐదు రిసార్ట్స్‌ నిర్మించారు. వీటిలో కొన్ని డ్రగ్స్‌, జూదాలకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ ఉన్న రిసార్ట్స్‌కు వచ్చిన కొందరు స్నేహితుడిని మద్యం మత్తులో స్విమ్మింగ్‌ పూల్లోకి నెట్టివేయడంతో చనిపోయాడు. గాజువాకకు చెందిన ఒక బాలుడు స్విమ్మింగ్‌ఫూల్‌ వద్ద స్నానం చేస్తూ మృతిచెందాడు. ఓ రిసార్ట్‌లో గోవా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌తో యువకులు పట్టుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని