logo

ఇసుకా.. మస్కా..!

అనకాపల్లి జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణ గాడి తప్పింది. అల్లూరి జిల్లాలో ఉచిత ఇసుక హామీ అమలుకు దూరమైంది. లక్షల్లో ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న సర్కారు వాటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను మాత్రం అందుబాటులో ఉంచడం లేదు.

Updated : 24 Feb 2024 03:57 IST

నియోజకవర్గానికో నిల్వ కేంద్రమన్నారు.. మూడు మూసేశారు
అల్లూరి జిల్లాలో ఇళ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుకే లేదు..
ఈనాడు - పాడేరు, న్యూస్‌టుడే - నర్సీపట్నం గ్రామీణం

నకాపల్లి జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణ గాడి తప్పింది. అల్లూరి జిల్లాలో ఉచిత ఇసుక హామీ అమలుకు దూరమైంది. లక్షల్లో ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న సర్కారు వాటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. ముఖ్యంగా ఇసుక నిల్వ కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం.. ప్రభుత్వ అధికారుల నియంత్రణ లేకపోవడం ఇసుక సరఫరాలో జవాబుదారీతనం కొరవడింది. దీంతో గుత్తేదారుకు నచ్చినప్పుడు డిపోల్లో అరకొరగా నిల్వలు పెడుతున్నారు.. మరికొన్ని డిపోలు ఏకంగా మూసేశారు. వీరి చర్యల కారణంగా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నెమ్మదించాయి. ఆయా పనులపై ఆధారపడిన కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి వస్తోంది.

నియోజకవర్గానికి ఒక ఇసుక డిపో అనిచెప్పి అయిదు చోట్ల మాత్రమే నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏడాది తిరగకుండానే వాటిలో మూడు డిపోలను మూసేశారు. ఉన్న రెండు నిల్వ కేంద్రాల్లోనైనా ఇసుక నిల్వలను సక్రమంగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు. డిపోల్లో ఎప్పుడు ఉంటుందో తెలీని పరిస్థితి. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి డిపోలో మాత్రమే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. నర్సీపట్నం డిపో కొంతకాలంగా మూతపడి ఇటీవలే మరలా నిల్వలు తెచ్చిపెడుతున్నారు.  అచ్యుతాపురం, చోడవరం, అనకాపల్లి డిపోలు మూతపడి ఏడాదిపైనే అవుతోంది. అల్లూరి జిల్లాలో ఒక్క డిపో కూడా లేదు.. కానీ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ‘ఇసుక ఈ ధరకు మించి కొనకండి.. అంతకంటే ఎక్కువ అడిగితే ఫిర్యాదు చేయండ’ని ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. సర్కారు ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో సరఫరాకు భిన్నమైన పరిస్థితులున్నాయి.


దూరం.. భారం..: అచ్యుతాపురం, అనకాపల్లి, చోడవరం డిపోలు మూతపడడంతో వాటి పరిధిలో జగనన్న కాలనీలు, ప్రభుత్వ భవనాల నిర్మించే గుత్తేదారులు ఇసుక కోసం ఇక్కట్లు పడుతున్నారు. విశాఖలోని అగనంపూడి, నక్కపల్లి, నర్సీపట్నం డిపోలకు వెళ్లి ఇసుక తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇదివరకు దగ్గరలో డిపో ఉండడంతో ఇసుక రేటు పోను రవాణాగా రూ.వెయ్యి తీసుకునేవారు. ఇప్పుడు అదనపు భారం పడుతోంది. జగనన్న కాలనీలకు కూపన్లు ఇస్తున్నా దూరా భారం కావడంతో అదనంగా సొమ్ములు చెల్లించి స్థానికంగా టైరు బళ్లతో తెప్పించుకుంటున్నారు..


దళారుల దందా..  ఇళ్ల నిర్మాణాలకు లక్ష్యాలను విధిస్తున్నారు.. మరోవైపు ప్రభుత్వ ప్రాధాన్య పనులను పూర్తిచేయాలని ఒత్తిళ్లు తెస్తున్నారు.. అయితే వీటి నిర్మాణంలో కీలకమైన ఇసుకను అందుబాటులో ఉంచడం లేదు. దీంతో అక్రమార్కులు నిర్మాణదారుల నుంచి దొరికినకాడికి దోచుకుంటున్నారు. వారు చెప్పిన రేటుకే కొనాల్సి వస్తోంది. డిపోలకు వెళ్లే లారీలను సైతం పక్కదారి పట్టించి అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి.

నర్సీపట్నంలో డిపోలో ఇసుక నిల్వలున్నా పైనుంచి ఇంకా ఆదేశాలు రాలేదని అమ్మకాలు చేయకుండా చూస్తున్నారు. దీంతో కొంతమంది రాజమహేంద్రవరం నుంచి లారీలతో ఇసుక తెచ్చి ఇక్కడ ట్రాక్టర్లకు అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఏకంగా శారదా నదిని గుల్లచేసి ఇసుక తోడేస్తున్నారు. పక్క జిల్లాలకు అమ్మేస్తున్నారు.


ఉచిత ఇసుక మాకేది మహాప్రభో.. ‘అనకాపల్లి జిల్లాలో ఇళ్లు కట్టుకుంటే 20 టన్నుల ఉచితంగా ఇసుక ఇస్తున్నారు. అల్లూరి జిల్లాలో ఎందుకివ్వడం లేదు. మైదాన ప్రాంతంలో కంటే ఏజెన్సీలో ఇంటి నిర్మాణానికి రెట్టింపు వ్యయం అవుతుంది. ఉచిత ఇసుక ఎలాగూ ఇవ్వడం లేదు..ఆ మేరకు యూనిట్‌ విలువైనా పెంచండి లేకుంటే ఇసుకైనా ఇవ్వండ’ంటూ జడ్పీ సర్వసభ్య సమావేశంలో కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అల్లూరి జిల్లాలో పీఎంఏవై గ్రామీణ్‌ పథకంలో 12,997 ఇళ్లు మంజూరు చేశారు. పది వేల ఇళ్ల పనులు మొదలుపెట్టినట్లు అధికారులు చెబుతున్నా ఒక్క ఇంటికీ ఉచిత ఇసుక అందజేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని