logo

హవ్వ.. ఇది పోలింగ్‌ కేంద్రమా!

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వసతి కల్పించాల్సిన అధికారులు కనీసం నలుగురు వ్యక్తులు కూర్చునేందుకు సదుపాయం కల్పించాల్సి ఉంది.

Published : 29 Feb 2024 03:04 IST

సుత్తిగుడలో ఈ వంటషెడ్డేె పోలింగ్‌ కేంద్రం

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వసతి కల్పించాల్సిన అధికారులు కనీసం నలుగురు వ్యక్తులు కూర్చునేందుకు సదుపాయం కల్పించాల్సి ఉంది. ముంచంగిపుట్టు మండలంలోని 23 పంచాయతీల్లో ఉన్న 37వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో లక్ష్మీపురం పంచాయతీలోని సుత్తిగుడ గ్రామంలో ఒక పోలింగ్‌ కేంద్రం ఉంది. సుత్తిగుడ గ్రామంలో ఉన్న పాఠశాల వంటషెడ్డును పోలింగ్‌ కేంద్రంగా ఎంపిక చేశారు. లక్ష్మీపురం పంచాయతీలోని సుత్తిగుడ, మెట్టగుడ, కోడాపుట్టు, కెందుగుడ, మొవుల్‌పుట్టు, బిర్రిగుడ, సంగంవలస, గవిల్‌గుడ, అర్లోయిపుట్టు, బొక్కొయిగుడ, మొంజగుడ, ఉబ్బెంగుల, జబడ, దొరగుడ గ్రామాలకు చెందిన 800 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. కనీసం నలుగురు పోలింగ్‌ సిబ్బంది కూర్చునేందుకు సరిపోని వంటషెడ్డును పోలింగ్‌ కేంద్రంగా గుర్తించారని ఆ గ్రామాల ఓటర్లు చెబుతున్నారు. విద్యుత్తు, తాగునీరు, దివ్యాంగులు ఓటు వేసేందుకు ర్యాంపు తదితర సదుపాయాలు లేవని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రంగబయలు పంచాయతీలోని లంగ్బాపొదోర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోనూ వసతులు కరవయ్యాయి. ఇక్కడ 18 గ్రామాల గిరిజనులు తమ ఓటు వేయాల్సి ఉంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని