logo

నిజం గెలవాలి.. తెదేపా అధికారంలోకి రావాలి

‘నిజం గెలవాలి...తెదేపా అధికారంలోకి రావాలి’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో బుధవారం ఆమె పర్యటించారు.

Updated : 29 Feb 2024 05:16 IST

అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన
ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, అరకులోయ, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, జి.మాడుగుల

ముసిరిగుడలో మృతుడి భార్య కాసులమ్మకి లేఖని అందజేస్తూ..

‘నిజం గెలవాలి...తెదేపా అధికారంలోకి రావాలి’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో బుధవారం ఆమె పర్యటించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన నలుగురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.

పాడేరు మండలం చిందంగిలో కార్యకర్త ఓండ్రు నాగేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.

అరకులోయ మండలం మాదల పంచాయతీ ముసిరిగుడలో మనస్తాపానికి గురై మృతి చెందిన గ్రామానికి చెందిన సొన్నాయి బసు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బసు భార్య కాసులమ్మతో మాట్లాడారు. ఆమె బ్యాంకు ఖాతాలో తెదేపా నుంచి రూ. 3 లక్షలు జమయ్యాయా లేదా అని అడిగారు. రెండ్రోజుల కిందటే జమయ్యిందని ఆమె సమాధానమిచ్చారు. చంద్రబాబునాయుడు అరెస్టు సమయంలో ఎప్పుడు జైలు నుంచి బయటకి వస్తారని బసు తమను  అడిగేవారని అరకులోయ తెదేపా, జనసేన ఉమ్మడి అభ్యర్థి సియ్యారి దొన్నుదొర భువనేశ్వరికి వివరించారు.

జి.మాడుగుల మండలం లువ్వాసింగి పంచాయతీ చిట్టంపుట్టు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కోరాబు లక్ష్మణ్‌, జి.మాడుగులకు చెందిన అనసూరి రాజారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మణ్‌, రాజారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు రాసిన లేఖను, ఇరువురు కుటుంబ సభ్యులకు చంద్రబాబు పంపిన రూ.3 లక్షలు చొప్పున అందజేశారు.

అరకు సమీపంలో కాఫీ రుచి చూస్తూ..

ప్రకృతి రమణీయతకు పరవశం

అరకులోయ నుంచి ముసిరిగుడకి వెళ్లే మార్గంలోని బట్టివలస వద్ద గిరిజన మహిళలు భువనేశ్వరి వాహనాన్ని ఆపారు. ఆమెకు గిరి సంప్రదాయం ప్రకారం నుదుట తిలకం దిద్ది... శాలువా కప్పి ఆహ్వానించారు. దారిలో ప్రకృతి రమణీయత చూసి ఆమె పరవశించారు. వాహనం నుంచి దిగి ఫొటోలు తీసుకున్నారు. పాడేరు మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న కాఫీ దుకాణం వద్ద ఆగి అరకు కాఫీ తాగారు. చాలా రుచిగా ఉందని భువనేశ్వరి కితాబిచ్చారు.

కోరాబు లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న భువనేశ్వరి


గిడుగులో బాగున్నానా?

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా బుధవారం పాడేరు వచ్చిన భువనేశ్వరికి స్థానిక గిరిజనులు ప్రత్యేక అడ్డాకుల గిడుగు బహూకరించారు. దాన్ని ముచ్చటగా ధరించిన ఆమె ‘నేను బాగున్నానా’ అంటూ మహిళలను ప్రశ్నించారు. గిడుగును తన వెంట తీసుకువెళ్లారు. అరకులోయ గిరిజన మ్యూజియంలో చేతివృత్తులతో తయారు చేసిన జడ క్లిప్‌ ఎంతో బాగుందని తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలో ఇలాంటి చేతివృత్తుల వారు ఉండటం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి కార్మికులకు, చేతివృత్తిదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి ఆదుకుంటారని ఆమె హామీ ఇచ్చారు.


ఓటే ఆయుధం

ముఖాముఖీకి హాజరైన గిరిజన మహిళలు

పాడేరు, న్యూస్‌టుడే: ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించి, మరో పదిమందితో ఓటు వేయించే బాధ్యత తీసుకుని... ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పాడేరు మండలం అడారిమెట్ట గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన నిర్వహించిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తెదేపా నాయకులంతా ఆమెకు స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ థింసా నృత్యం చేస్తూ ముందు నడిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  అనంతరం మహిళలతో ముచ్చటించారు. ఓ గిరిజన యువతి మన్యంలో పండే కాఫీ, పసుపు, స్వచ్ఛమైన తేనె ఆమెకు అందజేశారు. గిరిజన ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, తెదేపా నాయకులు అమ్మవారి చిత్రపటాలు ఆమెకు బహూకరించారు. మాజీ మంత్రి మణికుమారి, సీనియర్‌ నాయకులు బొర్రా నాగరాజు, ఎంవీవీఎస్‌.ప్రసాద్‌, కొట్టగుళ్లి సుబ్బారావు, కాంతమ్మ, నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని