logo

సంప్రదాయ చేతివృత్తులకు కేంద్రం చేయూత

సంప్రదాయ చేతి వృత్తులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ పిలుపునిచ్చారు. 

Published : 29 Feb 2024 03:10 IST

మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ అభిషేక్‌, ఎంఎస్‌ఎంఐ ప్రతినిధి నాగకుమార్‌, జిల్లా పరిశ్రమ కేంద్రం జీఎం శ్రీవాణిధర్‌ రామన్‌, ఏడీఎం నవీన్‌ కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ మురళీ, డీఎల్‌పీఓ కుమార్‌

పాడేరు, న్యూస్‌టుడే: సంప్రదాయ చేతి వృత్తులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై బుధవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి ఎంటర్‌ప్రైజస్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీఓ మాట్లాడుతూ చేతివృత్తులవారు పారిశ్రామికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సరైన శిక్షణ లేని కారణంగా కళాకారులు వారి వృత్తుల్లో వెనుకబడి పోతున్నారని తెలిపారు. తయారీ వస్తువులకు మరింత విలువ పెంచి, మార్కెట్‌ సౌకర్యం కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా తీర్చిదిద్దడమే పీఎం విశ్వకర్మ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు.  గుర్తించిన వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మంగలి, స్వర్ణకారులు, తాపీ పనివారు, చాకలి, టైలరింగ్‌ తదితర 18 వృత్తుల్లో నిమగ్నమైన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సూచించారు. ఆయా చేతివృత్తుల వారికి సరైన శిక్షణ ఇచ్చి మొదటి దశలో రూ. లక్ష, రెండో దశలో రూ. రెండు లక్షలు స్వల్ప వడ్డీకి రుణాలు అందిస్తారని వెల్లడించారు. శిక్షణ కాలంలో గౌరవ వేతనంతోపాటు టూల్‌ కిట్లు అందిస్తారన్నారు. 18 ఏళ్లు వయస్సు నిండి ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 9,300 మంది మాత్రమే ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని, పాడేరు డివిజన్‌ పరిధిలో 5,500 మంది నమోదు చేసుకున్నారని వివరించారు. రుణాలు తీసుకుని వేరే పనులకు వినియోగించరాదని సూచించారు. నమోదు చేసుకున్న వారికి పంచాయతీల పరిధిలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎంఎస్‌ఎంఈ సహాయ సంచాలకులు డీవీఎస్‌ఆర్‌ యూర్తి మాట్లాడుతూ విశ్వకర్మ పథకంలో ఎలా లబ్ధి పొందాలో అవగాహన కల్పించారు. సదస్సులో ఎంఎస్‌ఎంఐ ప్రతినిధి పి.నాగకుమార్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం శ్రీవాణిధర్‌ రామన్‌, ఏడీఎం నవీన్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ మురళి, డివిజన్‌ పంచాయతీ అధికారి పి.ఎస్‌.కుమార్‌, పలువురు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన మహిళలు, యువత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని