logo

తప్పుకోవడానికి సిద్ధం

‘సాగునీటి చెరువుల పునరుద్ధరణకు సంబంధించి టెండరులో పేర్కొన్నట్లు మేం కొంతమేర పనులు చేశాం. వాటిలో కొన్ని పనులకు బిల్లులు ఇప్పటికీ అందలేదు. సకాలంలో సొమ్ములు ఇవ్వక మిగతా పనులు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated : 29 Feb 2024 05:54 IST

చెరువుల పనులు చేయలేమంటున్న గుత్తేదారులు
14 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ ఒట్టిమాటే
ఈనాడు అనకాపల్లి, పాడేరు

ఎస్‌.రాయవరం మండలం వేమగిరిలో పూడికతో నిండిన చెరువు

‘సాగునీటి చెరువుల పునరుద్ధరణకు సంబంధించి టెండరులో పేర్కొన్నట్లు మేం కొంతమేర పనులు చేశాం. వాటిలో కొన్ని పనులకు బిల్లులు ఇప్పటికీ అందలేదు. సకాలంలో సొమ్ములు ఇవ్వక మిగతా పనులు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా కాలంగా బిల్లుల కోసం ఎదురుచూసి ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక మీరు సొమ్ములిచ్చినా, ఇవ్వకున్నా పనులైతే చేయడానికి ఆసక్తిగా లేం.. మా టెండరు ఒప్పందాన్ని మధ్యలోనే ముగించేయండి (ప్రి క్లోజర్‌)’ అంటూ పలువురు గుత్తేదారులు జలవనరుల శాఖ అధికారులను అభ్యర్థిస్తున్నారు.  
ప్రపంచ బ్యాంకు నిధులతో నాలుగేళ్ల క్రితమే ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) ద్వారా 64 గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. దీనివల్ల 14,123 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అంచనా వేశారు. రూ.28.99 కోట్లతో 37 పనులకు మూడేళ్ల క్రితమే టెండర్లు పిలిచి 21 పనులను  గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. వారు కొంత మేర పనులు చేసినా బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చూసి వెనకడుగు వేస్తున్నారు. పునరుద్ధరణ పనులను మధ్యలోనే వదిలేసి మా సంగతి తేల్చేయండి వెళ్లిపోతామంటూ సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దీంతో రూ.కోట్ల పనులు మంజూరు దశ నుంచి ముందడుగు వేయలేకపోతున్నాయి.

చేతులెత్తేసిన గుత్తేదారులు.. ఉమ్మడి జిల్లాలో 37 ప్యాకేజీల్లో 64 చెరువులను పునరుద్ధరించాలనుకున్నారు. అందులో 10 ప్యాకేజీలకు టెండర్లు ఎవరూ వేయలేదు. మరో ఆరు పనులు ఇంకా టెండరు ఒప్పంద దశలోనే మగ్గుతున్నాయి. 21 పనులు మొదలుపెట్టి మూడున్నరేళ్లు దాటుతున్నాయి. ఒక్క పనీ పూర్తిచేయకుండానే చేతులెత్తేస్తున్నారు. తమ టెండర్లు ముగించి సెటిల్‌ చేయాలని కోరడంతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆయా పనులు వివరాలు, గుత్తేదారులు ఎంత మేర చేశారు..? వారికి ఎప్పుడెప్పుడు ఎంతమేర బిల్లులిచ్చారో తెలపాలంటూ జిల్లా అధికారులను ఆదేశించారు.

లుబ్బర్తి జలాశయం వద్ద ఇలా..

ఇదీ పనుల తీరు..

  • రాంబిల్లి మండలం దిమిలి వద్దనున్న తామరచర్ల కాలువ ద్వారా 1045 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందాలి. దీని అభివృద్ధికి రూ.97.37 లక్షల అంచనా విలువతో 2019లోనే గుత్తేదారుకు అప్పగించారు. చేయాల్సిన కాలపరిమితిని రెండుసార్లు పొడిగించినా ఈ పని ఇంకా మొదలుకాలేదు. కాంట్రాక్టర్‌ తన టెండరు ఒప్పందాన్ని రద్దు చేయాలని అధికారులను కోరుతున్నారు.
  • ఎస్‌.రాయవరం మండలం వేమగిరిలో ఉమ్మడి చెరువుతో పాటు 12 అనుసంధాన చెరువులు, కాలువలను బాగుచేయడానికి రూ.7.47 కోట్లతో పనులు గుత్తేదారుకు 2020లో అప్పగించారు. 2022 నవంబర్‌ నాటికే పనులు పూర్తిచేయాలి. కేవలం 15 శాతం మాత్రమే చేసి వదిలేశారు.
  • అనకాపల్లి మండలంలో ఎరకన్నదొర చెరువును రూ.1.87 కోట్లతో అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్‌కు పని అప్పగించారు. కేవలం అయిదు శాతం పనులే చేసి నిలిపేశారు. దీంతో ఆయకట్టుదారులకు సాగునీటి సమస్య తీరకుండా పోయింది.
  • చింతపల్లి మండలం తాజంగి జలాశాయం అభివృద్ధికి రూ.92.21 లక్షలు కేటాయించారు. బిల్లుల చెల్లింపులపై అనుమానంతో గుత్తేదారు ఆరుశాతం పనులే చేసి నిలిపేశారు.  
  • కొయ్యూరు మండలంలో లుబ్బర్తి జలాశయం అభివృద్ధికి రూ.44.19 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారు 75 శాతం పనులు చేశారు. వాటికి సకాలంలో బిల్లులు అందకపోవడంతో మిగతా పనులు నిలిపేశారు. ఈ పనుల నుంచి గుత్తేదారులు తప్పుకోవడానికి సిద్ధమంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని