logo

గురువులకే బురిడీ.. వైకాపా నేత కుమారుడి హల్‌చల్‌

ఇప్పటికే విద్యాశాఖలో ఉన్నతాధికారుల తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. వారికి తోడు ఇప్పుడు నకిలీ విద్యాశాఖ అధికారులు తెరపైకి వచ్చి తనిఖీలు చేస్తుండడంతో టీచర్లు మరింత ఆందోళన చెందుతున్నారు.

Published : 01 Mar 2024 06:07 IST


ఇంటర్‌ విద్యార్థిని మందలించి వదిలేసిన పోలీసులు
జిల్లా విద్యాశాఖలో పర్యవేక్షణా లోపం

ఓ పాఠశాలలో విద్యార్థి పుస్తకాలను తనిఖీ చేస్తున్న నకిలీ వాలంటీరు

ఈనాడు, విశాఖపట్నం, ఆనందపురం, న్యూస్‌టుడే: ఇప్పటికే విద్యాశాఖలో ఉన్నతాధికారుల తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. వారికి తోడు ఇప్పుడు నకిలీ విద్యాశాఖ అధికారులు తెరపైకి వచ్చి తనిఖీలు చేస్తుండడంతో టీచర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. ఆనందపురం మండలంలో జిల్లా విద్యాశాఖ వాలంటీరుగా అవతారం ఎత్తి గురువులను బురిడీ కొట్టించిన యువకుడు అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుని పుత్రరత్నమే. దిబ్బడపాలేనికి చెందిన  యువకుడు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన తండ్రి పంచాయతీలో వార్డు సభ్యుడు. వైకాపా సానుభూతిపరుడు. అధికార పార్టీ నేతల దందాలు, అధికారులపై చెలాయిస్తున్న పెత్తనాలు చూసి తానెందుకు చేయకూడదనుకున్నాడేమో. గతేడాదే గిడిజాల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన ఈ విద్యార్థి తనకు తానే జిల్లా విద్యాశాఖ వాలంటీరుగా ప్రకటించుకున్నాడు. తన ఫోన్‌ నెంబర్‌ ట్రూకాలర్‌లో కూడా అదే విధంగా మార్చుకున్నాడు. ఎంఈవో కార్యాలయానికి వెళ్లి పరిచయం చేసుకోగానే అక్కడి అధికారి గుడ్డిగా ఆ కుర్రాడి ఫోన్‌ నెంబర్‌ని ఉపాధ్యాయుల వాట్సప్‌ గ్రూప్‌లో చేర్చేశారు.

ఉపాధ్యాయులతో ఏకంగా టెలీ కాన్ఫెరెన్స్‌, గూగుల్‌మీట్‌ సమావేశాలు నిర్వహించేశాడు. అక్కడితో ఆగకుండా నేరుగా పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేయడం.. పిల్లల పుస్తకాలను పరిశీలించడం మొదలుపెట్టాడు. ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఆ విద్యార్థిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఎందుకిలా చేశావ్‌ అంటే... ఎంఈవో చేయమన్నారు.. అందుకే చేశానని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. శుక్రవారం నుంచి ఇంటర్‌ పరీక్షలున్నాయి విడిచిపెట్టేయండని కోరడంతో మందలించి వదిలేశారు. డీఈవో చంద్రకళ వద్ద నకిలీ వాలంటీరు గురించి ప్రస్తావించగా ‘ఆ యువకుడు ఉపాధ్యాయుల గ్రూపులోకి ఎలా వచ్చాడో తెలియదు. గుర్తించిన వెంటనే తొలగించారు. జిల్లా విద్యాశాఖ వాలంటీరు అనే పోస్టే లేదు. అయినా అతడిని వాలంటీరు అంటే ఎలా నమ్మేశారో అర్థం కావడం లేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అన్నారు. అసలు ఓ యువకుడు గూగుల్‌మీట్‌ నిర్వహించాలంటే  దానికి సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ లేకుండా సాధ్యమవదు. అవి ఎవరిచ్చారు.. ఏమి ఆశించి పిల్లాడితో పాఠశాలలను తనిఖీలు చేయించారో పూర్తిస్థాయిలో విచారణ చేస్తేనే తేలుతుందని ఉపాధ్యాయులంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని