logo

సమస్యలు చెబుదామని వస్తే... భయపెట్టి పంపించారు

తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన విద్యార్థినులను భయపెట్టి పంపించిన సంఘటన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Updated : 03 Apr 2024 04:27 IST

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల వసతిగృహ విద్యార్థినుల ఆవేదన

కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థినుల నిరసన

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన విద్యార్థినులను భయపెట్టి పంపించిన సంఘటన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థినులు తాము ఉంటున్న వసతి గృహంలో అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారని.. లేని సౌర విద్యుత్తుకు డబ్బులు వసూలు చేస్తున్నారని.. భోజనంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదని.. ఇలా తాము పడుతున్న ఇబ్బందులు  పరిష్కరించాలంటూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సుమారు వంద మంది ఏయూ చీఫ్‌ సెక్యూరిటీ కార్యాలయం సమీపంలో బైఠాయించి నిరసన తెలియజేశారు. వీసీ వస్తే ఆయనతోనే తమ సమస్యలు చెప్పి పరిష్కారం కోరతామని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య జి.శశిభూషణరావు, ఓఎస్‌డీ ఆచార్య వి.కృష్ణమోహన్‌, ఆచార్య పాల్‌ డగ్లస్‌ వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. సమస్యలు తెలిపేందుకు గదిలోకి నలుగురు విద్యార్థినులు రావాలని సూచించారు. అందుకు విద్యార్థినులు ససేమిరా అనడంతో పదిమందిని అనుమతించారు.

విద్యార్థినులు చీఫ్‌ సెక్యూరిటీ అధికారి కార్యాలయంలోకి వెళ్లగానే సెక్యూరిటీ అధికారులు తలుపులు మూసివేశారని.. ఫోన్‌ నెంబర్లు, విభాగం అడిగి తీసుకున్నారని.. చరవాణీలో వీడియో తీశారని.. తాము ఏ సమస్య చెప్పినా ఇది ‘సిల్లీ పాయింట్‌’ అంటూ తేలిక చేసి మాట్లాడారని విద్యార్థినులు వాపోయారు. విద్యార్థులు మాట్లాడేందుకు వెళ్లిన గది బయట ఎవరూ రాకుండా భద్రత సిబ్బందిని ఉంచటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు