logo

గోధుమ పిండి ఆశలు గాలికి!

పౌర సరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సకాలంలో రాని సరకులతో అందరూ అవస్థలు పడుతున్నారు. నర్సీపట్నం ప్రాంతానికి గోధుమ పిండి ఇప్పటివరకు సరఫరా కాలేదు.

Updated : 03 Apr 2024 03:48 IST

పౌర సరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సకాలంలో రాని సరకులతో అందరూ అవస్థలు పడుతున్నారు. నర్సీపట్నం ప్రాంతానికి గోధుమ పిండి ఇప్పటివరకు సరఫరా కాలేదు. ఒకవేళ వచ్చినా ఇది అందరికీ అందే పరిస్థితి లేదు. 

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ప్రతినెలా నిత్యావసర సరకుల పంపిణీలో ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతోంది. ఇప్పటికే కందిపప్పు సరఫరా నిలిపేశారు. రాగి పిండిని ఉచిత బియ్యంతో ముడిపెట్టి అంటగడుతున్నారు. ఈ పరిస్థితి కార్డుదారులు, డీలర్లలోనూ తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. గోధుమ పిండికి బాగానే ఆదరణ ఉంది. బయట మార్కెట్‌లో కేజీ రూ. 60 ఉండగా, చౌక దుకాణాల్లో రూ. 16కే అందజేస్తున్నారు. దీంతో కార్డుదారులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ నెల వచ్చినా నర్సీపట్నంలో గోధుమపిండి జాడ లేదు. దీంతో ఇక సరఫరా కాదని కొందరిలో నిరాశ వ్యక్తమవుతోంది. కావల్సిన సరకు ఇవ్వకుండా... వద్దు మొర్రో అంటున్న రాగి పిండిని తీసుకోండని బలవంతం చేయడం ఎంతవరకు సబబని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని డిపోలకు గతనెల వరకు గోధుమ పిండి సకాలంలోనే సరఫరా అయింది. ముందునెలలో 18వ తేదీ నాటికే గోదాంలకు చేరేది. అక్కడి నుంచి చౌక దుకాణాలకు ఒకటో తేదీకి ముందే సరఫరా అయ్యేది. ప్రస్తుతం ఈ విధానం గాడితప్పింది. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం సహా చాలా గోదాంలకు సరకు మంగళవారం వరకు సరఫరా కాలేదని చెబుతున్నారు.

చాలా చోట్ల అమ్మకాలు పూర్తయినా:

ప్రతినెలా తొలి మూడు రోజుల్లోనే అమ్మకాలు పూర్తవుతుంటాయి.  ఒక్కో ఎండీయూ ఆపరేటర్‌ పరిధిలో 18 వరకు షాపులు ఉన్నాయి. వీటిలోని కొన్నింట్లో అమ్మకాలు పూర్తయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోధుమ పిండి గోదాంలకు ఇప్పుడు వచ్చినా దుకాణాలు మూసేసిన డీలర్లు ఆ పిండికి డీడీలు తీసి సరకును ఎలా విడిపిస్తారనే ప్రశ్న ఎదురవుతోంది.

తప్పనిసరిగా వస్తుంది: నర్సీపట్నం సహా అన్ని ప్రాంతాల్లో గోధుమ పిండిని తప్పనిసరిగా సరఫరా చేస్తాం. ఒకే గుత్తేదారు దీనిని పంపిణీ చేయాల్సి ఉన్నమేరకు జాప్యం జరిగింది. ఇప్పటికే జిల్లాలోని మూడు పాయింట్లకు సరకు వెళ్లింది. నర్సీపట్నానికీ సరఫరా అవుతుంది. ఆలస్యమైనా అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి స్థానికంగా పౌరసరఫరా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఏ ఇబ్బందులు ఉండవు.

శ్రీలత, జిల్లా మేనేజర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని