logo

అస్మదీయులకే అందలం..!

ఎన్నికల్లో పొదుపు సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి చోట తమకు అనుకూలమైన అధికారి ఉంటేనే మేలు జరుగుతుందని ఆమెను నియమించుకున్నట్లు  తెలిసింది. అప్పటివరకు డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన లక్ష్మీపతిని అకారణంగానే తొలగించేశారు.

Updated : 03 Apr 2024 06:08 IST

మంత్రుల దగ్గర పనిచేసిన అధికారులకే కీలక స్థానాలు
కోడ్‌ ముందు పోలీసుల బదిలీల్లోనూ సిఫార్సుకే ప్రాధాన్యం

ఎన్నికల్లో పొదుపు సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి చోట తమకు అనుకూలమైన అధికారి ఉంటేనే మేలు జరుగుతుందని ఆమెను నియమించుకున్నట్లు తెలిసింది. అప్పటివరకు డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన లక్ష్మీపతిని అకారణంగానే తొలగించేశారు. ఆయనకి మూడు నెలల పాటు పోస్టింగ్‌ ఇవ్వకుండా గాలిలోపెట్టారు. ఇటీవలే భీమిలి డీఎల్‌డీవోగా విధుల్లో చేరారు.

వడ్డించేవాడు మనవాడైతే కడ బంతిన కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్న చందంగా కొంతమంది అధికారులను సీనియార్టీతో సంబంధం లేకుండా కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలున్న వారినే అందలం ఎక్కిస్తున్నారు. మిగతావారికి అవకాశాలు చూపకుండా తొక్కేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని నేతలు ఆరు నెలల ముందే తమ అనుకూల అధికారులను తెచ్చి పెట్టుకున్నారు. ఎన్నికల ముంగిట జరిగిన పోలీసుల బదిలీల్లో కూడా సిఫార్సులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలోని మంత్రులిద్దరూ తమ దగ్గర పనిచేసిన అధికారులకు వారి శాఖల పరిధిలో కీలక పగ్గాలు అప్పగించడం ఆయా వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అచ్యుతాపురం: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)పై స్థానిక ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు), పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెట్టకుండా ఉన్న కంపెనీల నుంచి కాసుల వసూళ్లకు పోటీపడుతున్నారు. అక్కడ ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ (జడ్‌ఎం) పోస్టు కీలకమైంది. దీంట్లో ఎంపీడీవో నుంచి పదోన్నతిపై వచ్చిన త్రినాథరావును మంత్రి ఇదివరకు నియమించారు. దీనిపై అప్పట్లో ఎమ్మెల్యే కన్నబాబురాజు సాంకేతిక అవగాహనలేని వ్యక్తులను సొంత ప్రయోజనాలకు నియమించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ జోనల్‌ మేనేజర్‌ హయాంలోనే సెజ్‌ ముఖద్వారాన్ని ఆనుకొని ఉన్న 40 సెంట్ల విలువైన స్థలాన్ని హోటల్‌ నిర్మించుకోవడానికి మంత్రి ప్రధాన అనుచరుని భార్యకు అధికారికంగా కట్టబెట్టారు. మరికొన్ని పనుల్లో అమాత్యునికి సహకారం అందించినట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికల ముంగిట ఆయన్ని తప్పించి మంత్రి అమర్‌ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన హరిప్రసాద్‌ను నియమించి సెజ్‌పై పట్టుజారిపోకుండా చూసుకున్నారు.

సీనియర్లు ఉన్నా...

తన అనుకూల అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ముందు వరుసలో ఉన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందరే తన దగ్గర ఓఎస్‌డీగా పనిచేసిన పోలినాయుడిని జిల్లా పరిషత్తు సీఈవోగా నియమించుకున్నారు. వాస్తవానికి ఆయన కంటే డీఎల్‌డీవోగా పదోన్నతి పొందిన సీనియర్లు ఎక్కువ మందే ఉన్నారు. వారిని కాదని తనకు అన్నింటా అధికారికంగా సాయపడిన పోలినాయుడ్నే ఏరికోరి సీఈవోగా తెచ్చుకోవడం వెనుక ఎన్నికల మర్మమే దాగిఉందని అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అలాగే తన నియోజకవర్గంలోని కె.కోటపాడులో ఎంపీడీవోగా పనిచేసిన శచీదేవికి పదోన్నతి వచ్చిన వెంటనే అనకాపల్లి డీఆర్‌డీఏ పీడీగా తీసుకొచ్చేశారు. వాస్తవానికి ఈమెను శ్రీకాకుళం జిల్లా డ్వామాలో పర్యవేక్షణాధికారి పోస్టులో నియమించారు. అయితే బూడి ఇలాకాలో గతంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఈమెను డిప్యుటేషన్‌పై నాలుగు నెలల క్రితం అనకాపల్లి జిల్లాకు మార్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని