logo

ఇవేనా ఊళ్లు.. నమ్మేనా జనం కళ్లు!

జగనన్న కాలనీల పేరుతో వైకాపా  ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎంతో మేలు చేస్తున్నాం అన్నట్లు లబ్ధిదారులను ఎంపిక చేసి... స్థలాలు చూపినా ప్రతి దశలో ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది.

Updated : 12 Apr 2024 07:33 IST

నగరానికి దూరంగా కొండల పక్కన స్థలాలు
ఇళ్లు నిర్మించేస్తామని చెప్పి.. చేతులెత్తేసిన జగన్‌ ప్రభుత్వం
పునాదుల స్థాయి దాటని జగనన్న కాలనీలు

సబ్బవరం మండలం పైడివాడలో పునాదుల దశలో జగనన్న ఇళ్లు

జగనన్న కాలనీల పేరుతో వైకాపా  ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎంతో మేలు చేస్తున్నాం అన్నట్లు లబ్ధిదారులను ఎంపిక చేసి... స్థలాలు చూపినా ప్రతి దశలో ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అంతా ఓట్ల ధ్యాస తప్ప... ఆ ‘ఒక సెంటు’ స్థలాల్లో గృహాల నిర్మాణం పూర్తి చేసే ఆలోచనే కనిపించలేదు. పైగా నగర శివారు ప్రాంతాల్లో ఆ స్థలాలు కేటాయించారు.

ప్రస్తుతం నిర్మాణాల తీరు పరిశీలిస్తే ఒక్క వర్షానికే కూలిపోతాయేమో అనే భయం కలుగుతోంది. కొండలపైనుంచి రాళ్లు... వరదనీరు దూసుకువచ్చే పరిస్థితులు భయపెడుతున్నాయి. పునాదులు శిథిలమైపోతున్నా ఇళ్లు(ఊళ్లు) నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వైకాపా నేతలు...ఏళ్లుగా ఎందుకు పూర్తిచేయలేదని జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారో!!

నగరంలో పేదల కోసం 72 లేఅవుట్లలో 1.25 లక్షల మందికి ఇళ్లను కేటాయించారు. ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, పరవాడ మండలాల్లోని శివారు గ్రామాల్లో భూములు సమీకరించి లేఅవుట్లు వేసి ఒక సెంటు ప్లాట్లను అభివృద్ధి చేశారు. వాటిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. నగరంలోని పేదలు చాలామంది విశాఖలోనే కూలి పనులు, చిరువ్యాపారాలు చేసుకొని  జీవిస్తుంటారు. స్థలాలు కేటాయించిన చోట ఇళ్లు నిర్మించినా పనుల కోసం మళ్లీ నగరానికే వారు రావాలి. నగర పరిధిలో స్థల సమస్య అధిగమించేందుకు ‘టిడ్కో’ ఇళ్ల తరహా నిర్మాణాలు ఉపయుక్తం. కేవలం వైకాపా నేతల స్వార్థ ప్రయోజనాల కోసం కొండల వద్ద నిర్మాణాలు చేపట్టి నిధులు తినేశారే తప్ప పేదలకు సరైన గూడు కల్పించలేదు. అందుకే చాలా మంది నిర్మాణాలపై ఆసక్తి చూపలేదు.

దూరం... దూరం

నగరంలోని సీతంపేట ప్రాంతంలోని వారికి ముదపాక; ఆరిలోవలో ఉంటున్న వారికి ఆనందపురం మండలంలోని గిడిజాల, తంగుడుబిల్లిలో ఇళ్లు కేటాయించారు. గాజువాకలో పేదలకు అనకాపల్లిలో; గోపాలపట్నం, శ్రీహరిపురంలోని నివాసితులకు సబ్బవరం, పరవాడ మండలాల్లో కేటాయించారు. అక్కడికి వెళ్లి వచ్చేందుకు వాహన సౌకర్యం లేకపోగా ఛార్జీలకు అదనపు భారం అవుతుంది. విశాఖ నుంచి స్థలాల వద్దకు వెళ్లాలంటే రానుపోను దాదాపు 30 నుంచి 40 కి.మీ. పైగా దూరం ఉంటుంది. నేరుగా వెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా ఉండదు. బస్సులు, ఆటోలు మారి వెళ్లాలి.

అక్రమాలెన్నో..

పేదల కోసం ఇళ్లంటున్నా...అందుకు అవసరమైన స్థలాల కొనుగోలులో ఎన్నో అక్రమాలు జరిగాయి. ప్రస్తుతం మంజూరైన ఇళ్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఇవే దాదాపు రూ. 10 వేల కోట్లకు పైగా ఉంటాయి. వాటి కోసమే వైకాపా కీలక నేతలు తమ అనుయాయులను గుత్తేదారులుగా దింపి పనులు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఆ నిర్మాణాలు కూడా నాణ్యతగా లేవు. చాలా చోట్ల పునాదుల దశను దాటలేదు.

ఇదీ సంగతి (ఎకరాల్లో)

భూసమీకరణకు గుర్తించిన మొత్తం భూమి: 6,116
లేఅవుట్లు అభివృద్ధి చేసినది: 3,466

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని