logo

నిఘా కన్ను.. శాంతికి దన్ను!

సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం.

Updated : 19 Apr 2024 04:53 IST

గ్రామాలన్నింటిపై ప్రత్యేక నిఘా
సారా, మద్యం నిల్వలపై దృష్టి
ఆకస్మిక తనిఖీలు ముమ్మరం

నర్సీపట్నం అర్బన్‌, కృష్ణదేవిపేట, రావికమతం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో అన్ని పార్టీల నాయకులు దూకుడు పెంచారు. విమర్శలు, ప్రతి విమర్శలు, ఫిర్యాదులు ఊపందుకున్న నేప£థ్యంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. షెడ్యూల్‌ విడుదల నాటి నుంచి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్‌పీఎఫ్‌ బలగాలతో నర్సీపట్నంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కవాతు నిర్వహించి ఓటర్లకు తామున్నామని, ధైర్యంగా ఓటేయాలని సూచించారు. కొద్దిరోజుల్లో సీఆర్పీఎఫ్‌ బలగాలు రానున్నాయి. వీరంతా విడిది చేసేందుకు నర్సీపట్నం డిగ్రీ కళాశాల ఆవరణలోని నైపుణాభివృద్ధి శిక్షణ కేంద్రం భవనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. గతంలో సమస్యాత్మక గ్రామాలపైనే ప్రత్యేకంగా నిఘా పెట్టేవారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 20 వరకు అత్యంత సమస్యాత్మక గ్రామాలుండేవి. ఈసారి సమస్యాత్మక ప్రాంతాలే కాకుండా అన్ని గ్రామాలపైనా ప్రత్యేకంగా దృష్టిసారించారు.

రత్నంపేటలో బెల్లం పులుపును పారబోస్తున్న ఎస్సై ఉపేంద్ర

  • సారా తయారీ, రవాణా, విక్రయాలతోపాటు గంజాయి రవాణాను అరికట్టేందుకు దాడులు ముమ్మరం చేశారు. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని పెదబొడ్డేపల్లిలోనే పోలీసులు, ఎస్‌ఈబీ సిబ్బంది సారా తయారీకి భారీగా సిద్ధం చేసిన బెల్లం పులుపును గుర్తించి ధ్వంసం చేశారు. నర్సీపట్నానికి సమీపంలోని గురంధరపాలెంలో బెల్లం పులుపును డీఎస్పీ మోహన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ధ్వంసం చేయడం తెలిసిందే. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ సారా, బెల్లం పులుపులు బయటపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పల్లెలను మత్తులో ముంచేందుకు ఎంతగా ప్రయత్నాలు జరుగుతున్నాయో చెప్పేందుకు ఇవే నిదర్శనం.
  • గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీసు స్టేషన్ల పరిధిలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్సైలు కృష్ణారావు, ఉపేంద్ర సిబ్బందితో దాడులను, కృష్ణదేవిపేట, యర్రవరం చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. వారం రోజుల వ్యవధిలో 10 వేల లీటర్లకుపైగా బెల్లం పులుపును పారబోశారు. పాత కృష్ణదేవిపేట, రత్నంపేట, బంగారంపేట, అనంతసాగరం, సీతకండి, పొగచెట్లపాలెం, సుద్దలపాలెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నాటుసారా తయారీ స్థావరాలున్నాయి. రావికమతం పోలీసులు మేడివాడ శివారు దిడ్డి ప్రాంతంలో గురువారం దాడులు చేసి వెయ్యి లీటర్ల బెల్లం ఊట, సారా తయారీ సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఎస్సై ధనుంజయనాయుడు పేర్కొన్నారు.
  • అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు పోలీసుల తనిఖీల్లో నిత్యం పట్టుబడుతున్నాయి. కొన్ని మద్యం దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించి సంచులకొద్దీ సీసాలను బయటకు పంపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మద్యం దుకాణాల వద్దా నిఘా ఉంచాలని తెదేపా నాయకులు రిటర్నింగ్‌ అధికారిని కోరారు. ప్రతి గ్రామంలో ఇద్దరు, ముగ్గురు గుట్టుగా క్వార్టర్‌ సీసాకు రూ.50 వరకు అదనంగా తీసుకుని విక్రయిస్తున్నారు. పల్లెల్లో చాలామందికి మద్యం విక్రయాలు ఆదాయ వనరుగా మారాయి. మద్యం దుకాణాల్లో పనిచేసే కొందరు క్వార్టర్‌ సీసాకు రూ.10 అదనంగా తీసుకుని అనధికారికంగా ఎక్కువ మొత్తంలో విక్రయిస్తున్నట్లు సమాచారం.
  • గంజాయి రవాణాలో ఇప్పుడు యువకులు ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఇద్దరు, ముగ్గురు యువకులు కలిసి రెండేసి కేజీల చొప్పున తీసుకువెళ్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఎక్కడో గంజాయి భారీగా నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి తక్కువ పరిమాణంలో గుట్టుగా తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నిల్వలు ఎక్కడన్నది కనిపెట్టే దిశగా దృష్టిసారించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒకచోట నిత్యం గంజాయి దొరుకుతూనే ఉంది.
  • పోలీసులు నిత్యం పల్లెటూరుకో, పట్టణంలోని ఏదో ఒక వార్డుకో వెళ్లి స్థానికులతో మాట్లాడుతున్నారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఘర్షణలకు దిగుతారన్న అనుమానం ఉన్న వారందరినీ బైండోవర్‌ చేయించారు. నిత్యం వాహన తనిఖీలు జరుగుతున్నాయి.

కారులో బ్యాగులు తనిఖీ చేస్తున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని