logo

జగన్‌కు సింహాసనం.. జనానికి మరణశాసనం

మద్యం ప్రధాన ఆదాయ  వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే.

Updated : 24 Apr 2024 07:22 IST

 మద్యం నిషేధం హామీ కొండెక్కింది
 ఏరులై పారుతూ ఖజానా నింపుతోంది
 ఇది కదా రక్తమాంసాలతో వ్యాపారం
 ‘నాసిరకం’ తాగి కేజీహెచ్‌కు వరుస కడుతున్న బాధితులు

మద్యం ప్రధాన ఆదాయ  వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే.

మద్యపానం వల్ల నాశనమవుతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. బతుకులను బుగ్గిపాలు చేసి, మహిళ కంట నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవ్వరికీ మేలు జరగదు సరికదా సమాజాన్ని నష్టపరుస్తుంది. ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతారు

  మద్య నిషేధం ఎంతో అవసరం అంటూ పాదయాత్రలో జగన్‌ ఊదరగొట్టిన ఉపన్యాసం

అధికారంలోకి రాగానే దశల  వారీగా మద్యపాన నిషేధం అన్న మాటను జగన్‌  పక్కన పెట్టేశారు. ప్రభుత్వమే మద్యం విక్రయించేలా అడుగులు వేశారు. విశాఖ జిల్లాలో రెండు డిపోల పరిధిలో మద్యం ఏరులై పారుతోంది. బార్‌లు ఉదయం ఆరు గంటలకు అనధికారికంగా  ప్రారంభించేస్తున్నారు. భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, విశాఖ నగరం, గాజువాక వంటి చోట్ల గొలుసు దుకాణాలు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. కొన్ని మద్యం దుకాణాల నుంచే వీటికి అనధికారికంగా సరకు వెళుతోంది. ముఖ్యంగా రకరకాల బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం రాజ్యమేలుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మద్యం బారిన పడి కార్మికులు, మత్స్యకారులు మృతి చెందుతున్నారని ఆందోళనలూ కొనసాగాయి.

ఇంటికెళ్లి...మళ్లీ ఆసుపత్రికి

ఆసుపత్రికి వస్తున్న బాధితులు కల్తీ మద్యం తాగడం వల్లే  ఈ స్థితికి వచ్చారని వైద్యులు చెప్పడానికి వెనకాడుతున్నారు. కొవిడ్‌ సమయంలో మాస్క్‌ల్లేవని ప్రశ్నించిన వైద్యుడు సుధాకర్‌ పరిస్థితే తమకూ ఎదురవుతుందని భయపడుతున్నట్లు చర్చ సాగుతోంది. కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు, ఉభయగోదావరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రోగులు వస్తున్నారు. ఇక్కడ ఇన్‌పేషెంట్లకు ఉన్న 52 పడకల విభాగం నిత్యం రోగులతో కిక్కిరిసి పోతోంది. చికిత్స పొంది ఇళ్లకు వెళుతున్న రోగులు తిరిగి రోజులు వ్యవధిలోనే మళ్లీ ఆసుపత్రి గడపతొక్కుతున్నారు. ఆల్కహాల్‌ ప్రభావంతోనే రోగాల బారిన పడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. అయితే ఎలాంటి మద్యం తాగడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందో చెప్పలేమంటున్నారు.

మరణ మృదంగం

మద్యం బారిన పడి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల గడపతొక్కే రోగుల సంఖ్య భారీగా పెరిగి పోయింది. కొన్ని నెలలుగా మద్యం ప్రభావం వల్ల కాలేయం, ప్రాంక్రియాస్‌ దెబ్బతిని కేజీహెచ్‌కు ఎంతో మంది వస్తున్నారు. ఈ విభాగంలో సోమ, బుధ, శనివారం... ఈ మూడు రోజుల్లో ఓపీ చూస్తుండగా, సుమారు 600 మంది రోగులు వస్తున్నారు. ఆల్కహాల్‌ సంబంధిత సమస్యలతో నెలకు 150-200 మంది ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 20-40 ఏళ్ల వయసు వాళ్లున్నారు. కాలేయం, ప్రాంక్రియాస్‌ సమస్యలతో చనిపోతున్నవారు వారానికి ఇద్దరు-ముగ్గురు ఉంటున్నారని స్టాఫ్‌ చెబుతుండగా, వైద్యులు మాత్రం నెలకు 5-6 మరణాలుంటాయని అంటున్నారు. చికిత్స పొంది ఇళ్లకు వెళ్లిన రోజుల వ్యవధిలోనే మృత్యువాతపడుతున్న కేసులూ ఉన్నాయి. ఆల్కహాల్‌ ప్రభావంతో కాలేయ సమస్యలతోపాటు, నరాలు(న్యూరో), కిడ్నీలు, గుండె, కంటి చూపు మందగించడం వంటి సమస్యల బారినపడి ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులు సైతం ఉన్నారు.

దాస్తే దాగుతాయా?

మద్యం బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులను కొన్ని నెలల క్రితం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేజీహెచ్‌లో పరామర్శించారు. ఆ సమయంలో రాజు అనే రోగి గతేడాది నాలుగు సార్లు ఆసుపత్రిలో చేరినట్లు వివరించారు. కల్తీమద్యం మరణాలపై వైద్యులు సైతం గోప్యతపాటిస్తున్నారు. ఎప్పటిలాగే కేజీహెచ్‌కు 20 శాతం మద్యం ప్రభావ కేసులు వస్తున్నాయంటూ మాటదాటేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని