logo

కత్తి దూసిన అనుమానం

తనతో ప్రేమగా ఉంటూ... సహజీవనం చేస్తున్న మహిళ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడ నగర శివారు నున్న-ముస్తాబాద మధ్యలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 11 Jul 2023 08:46 IST

సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాహత్నం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : తనతో ప్రేమగా ఉంటూ... సహజీవనం చేస్తున్న మహిళ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడ నగర శివారు నున్న-ముస్తాబాద మధ్యలో సోమవారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం సీఐ కనకారావు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ.. తన భర్త పిల్లలతో కలిసి ఉంటోంది. బర్రె కిరణ్‌ తన భార్యతో కలిసి నగరంలోనే నివసిస్తున్నాడు. అతడు కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వీరిద్దరి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె.. మరొకరితో వాట్సప్‌లో ఛాటింగ్‌ చేస్తుందని, ఫోన్లో మాట్లాడుతుందని కిరణ్‌ అనుమానం పెంచుకున్నాడు. తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందని కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో శిశు సంక్షేమశాఖ నగదును బ్యాంకు నుంచి తీసుకోవాలని చెప్పి ఆమెను వెంట తీసుకువెళ్లాడు. తన కారులో ఎక్కించుకుని విజయవాడ నగర శివారు నున్న వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో కారును కృష్ణా జిల్లా గన్నవరం స్టేషన్‌ పరిధిలోని ముస్తాబాద, లంబాడీ పేట వైపు మళ్లించాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపాడు. ఎవరితో మాట్లాడుతున్నావంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ముందస్తుగా వెంట తెచ్చుకున్న.. కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వీపుపై, చేతిపై గాయాలయ్యాయి. దీంతో సదరు మహిళ కేకలు వేయగా.. అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్‌ అప్రమత్తమై, స్థానికులతో కలిసి నిందితుడిని అడ్డుకున్నాడు. డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే నున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అది గన్నవరం స్టేషన్‌ పరిధి కావడంతో.. నిందితుడు కిరణ్‌ను గన్నవరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కనకారావు తెలిపారు.

నిందితుడు వినియోగించిన కత్తి

పక్కా పథకంతో..

నిందితుడు కిరణ్‌.. మహిళను అంతమొందించాలని పక్కా పథకంతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చంపడానికి కత్తి, రాడ్డు, గొంతు నులమడానికి వైరు, శవాన్ని చుట్టడానికి పట్టా, తగలబెట్టడానికి పెట్రోల్‌ డబ్బాలను కారులో తీసుకొచ్చాడు. అతడికి పిల్లలు లేరు. భార్యకు తెలియకుండానే నగరానికి చెందిన మహిళతో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడని సీఐ తెలిపారు. బాధితురాలి భర్త కూడా ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని వివరించారు.

కారు డిక్కీలో పెట్రోలు, రాడ్డు, వైరు, పట్టా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు