logo

ఆసరా ఎప్పుడో?

డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమల్లో భాగంగా వైకాపా ప్రభుత్వం ఆసరా పేరుతో పొదుపు మహిళలకు లబ్ధి చేకూర్చే కార్యాచరణ చేపట్టింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి లింకేజీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల్లోని సభ్యులకు దీనిని వర్తింపజేస్తున్నారు.

Published : 07 Feb 2023 03:26 IST

మూడో విడత లబ్ధికి ఆరు లక్షల మంది ఎదురు చూపులు
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

బయోమెట్రిక్‌ వేస్తున్న పొదుపు సంఘాల మహిళలు (పాత చిత్రం)

డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమల్లో భాగంగా వైకాపా ప్రభుత్వం ఆసరా పేరుతో పొదుపు మహిళలకు లబ్ధి చేకూర్చే కార్యాచరణ చేపట్టింది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి లింకేజీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల్లోని సభ్యులకు దీనిని వర్తింపజేస్తున్నారు. నాలుగు విడతలుగా రుణమాఫీ అమలు చేయనుండగా.. ఇప్పటి వరకు రెండు విడతల మొత్తాన్ని పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేశారు. మూడో వాయిదా కింద రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే ప్రక్రియ ఆరంభించారు. మూడు నెలల కిందటే ప్రతి సభ్యురాలి బయోమెట్రిక్‌ కూడా తీసుకున్నారు. సంక్రాంతి లోపుగానే లబ్ధిదార్ల ఖాతాల్లో ఆసరా మొత్తం పడుతుందని చెప్పినా నేటి వరకు జమ కాకపోవడం గమనార్హం.

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 56,869 పొదుపు సంఘాల్లోని 5,87,250 మంది సభ్యులు ఆసరా ద్వారా తొలి విడతగా లబ్ధి పొందారు. సుమారు రూ.516.71 కోట్లు వీరి ఖాతాల్లో జమయ్యాయి. ఒక్కరే రెండు, మూడు సంఘాల్లో సభ్యురాలిగా నమోదు కావడం, మరణించిన వారు ఉండటంతో వారిని ఏరివేయడంతో పాటు, సంఘ ఖాతాల్లో నగదు జమ చేస్తుంటే బ్యాంకులు రుణాల కింద జమ చేసుకోవడంతో నేరుగా సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో నగదు పడేలా, రెండో విడత ఆసరాకు ముందు బయోమెట్రిక్‌, బ్యాంకు ఖాతా వివరాల సేకరణ చేపట్టారు. మూడో విడతలోనూ ఇదే పద్ధతి అనుసరించారు. గతేడాది డిసెంబరులోనే వెలుగు ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు గ్రామాల వారీగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

ఎప్పటికప్పుడు జాప్యమే..

లబ్ధిదార్లకు ఆసరా మొత్తాన్ని విడుదల చేసే విషయంలో ఏటా జాప్యం నెలకొంటోంది. మొదటి విడత మొత్తాన్ని 2020, సెప్టెంబరు 9న, రెండో విడత మొత్తాన్ని 2021, అక్టోబరు9న జమ చేశారు. మూడో విడత మొత్తాన్ని కొంచెం ఆలస్యమైనా, 2022లోనే ఇస్తారని అంతా భావించారు. ఆ తర్వాత సంక్రాంతి లోపుగానే జమ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఫిబ్రవరి రెండో వారం వచ్చినా నేటికీ ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. సీఎం బటన్‌ నొక్కుడు కార్యక్రమంలో భాగంగా వరుసగా రైతు భరోసా, చేదోడు, తోడు, విద్యా దీవెన పథకాలకు నిధులు విడుదల చేసిన క్రమంలో ఆసరా మూడో విడత జమ చేయడంలో జాప్యం జరిగిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.


త్వరలోనే జమ చేస్తాం

పీఎస్సార్‌ ప్రసాద్‌, పీడీ, డీఆర్డీఏ

ఆసరా మూడో విడత కింద స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు నగదు జమ చేసేందుకు అవసరమైన ప్రక్రియ మొత్తం పూర్తి చేశాం. లబ్ధి పొందే సంఘాలు, సభ్యుల వివరాలు ఉన్నత స్థాయికి నివేదించాం. సాంకేతిక కారణాల వలన కొంత జాప్యం జరిగింది. ఈ నెలలోనే లబ్ధిదార్ల ఖాతాల్లోకి నగదు జమయ్యే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని