logo

కట్టబెట్టలే.. కష్టబెట్టుడే!

విజయవాడ తూర్పు పరిధిలో ఎనిమిదో వార్డువాసి నారు రామారావుకు గత ప్రభుత్వం టిడ్కో గృహం కేటాయించింది. భార్య విజయ పేరు మీద లబ్ధిదారు వాటా కింద రూ.50 వేలు కట్టారు. 2021 డిసెంబరు 30న సప్తగిరి గ్రామీణ బ్యాంకు రూ.3.65 లక్షలు రుణం ఇచ్చింది.

Updated : 28 Feb 2024 05:25 IST

టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల తాఖీదులు
ఈనాడు, అమరావతి


జక్కంపూడిలో అసంపూర్తిగానే గృహాలు

విజయవాడ తూర్పు పరిధిలో ఎనిమిదో వార్డువాసి నారు రామారావుకు గత ప్రభుత్వం టిడ్కో గృహం కేటాయించింది. భార్య విజయ పేరు మీద లబ్ధిదారు వాటా కింద రూ.50 వేలు కట్టారు. 2021 డిసెంబరు 30న సప్తగిరి గ్రామీణ బ్యాంకు రూ.3.65 లక్షలు రుణం ఇచ్చింది. నాటి నుంచి రెండేళ్లు మారటోరియం ఉంటుంది. తర్వాత నుంచి వాయిదాలు చెల్లించాలి. ఆ ప్రకారం 2023 డిసెంబరు 29తో రెండేళ్ల గడువు ముగిసినా ఇల్లు ఇవ్వనేలేదు. కానీ బ్యాంకు మాత్రం నెలవారీ వాయిదాలు వడ్డీ కలిపి రూ.39 వేలు చెల్లించాలని.. నోటీసులు ఇచ్చింది. అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు.

ఇదీ విజయవాడ లబ్ధిదారుల బాధే కాదు.. ఉమ్మడి జిల్లాలో అన్ని పట్టణాల్లో టిడ్కో గృహాల లబ్ధిదారుల ఆవేదన. ఇళ్లే ఇవ్వలేదు... రుణాలు చెల్లించాలని తాఖీదులు అందుతున్నాయి. మరికొందరికి రుణాలూ ఇవ్వలేదు కానీ.. వాయిదాలు చెల్లించాలట. ఒక్క గుడివాడలో మినహా ఎక్కడా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదు. విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు నీలిరంగులు వేశారే తప్ప.. పూర్తయిన ఇళ్లకు వసతులు కల్పించి లబ్ధిదారులకు కేటాయించాలనే స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. విజయవాడ నగర పేదలకు 40 వేల టిడ్కో గృహాలను కట్టాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిని వైకాపా ప్రభుత్వం 6,576కు కుదించింది. పునాదులు నిర్మించిన వాటిని పక్కన పెట్టేశారు. నాలుగేళ్లలో వీఎంసీ పరిధిలో 3,800 మందికి డాక్యుమెంటేషన్‌ పూర్తి చేసి బ్యాంకులు, యూఎల్‌బీలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. కేవలం రూ.85 కోట్లు రుణం అందించాయి. వీరికి రెండేళ్ల గడువు ముగియగా వారికి వాయిదాలు చెల్లించాలని నోటీసులు అందుతున్నాయి.

నిధులు లేక ఆగిన నిర్మాణం...

జిల్లాలో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. మొదటి రకానికి లబ్ధిదారు వాటా రూ.1. కేంద్రం, రాష్ట్రం రూ.3 లక్షల సబ్సిడీ ఇస్తోంది. రెండోది రూ.25 వేలు, మూడోది రూ.50 వేలు లబ్ధిదారు వాటాగా నిర్ణయించారు. బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు, రూ.3.65 లక్షలు ఇస్తారు. కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అందుతుంది. రాష్ట్రం నుంచీ అంతే మొత్తం ఇవ్వాలి. జిల్లాలో బ్యాంకులు రూ.679.70 కోట్లు రుణం ఇస్తేనే బ్లాకులు పూర్తవుతాయి. ఇప్పటికి రూ.370 కోట్లు మంజూరు చేయగా ఇవి టిడ్కోకు నేరుగా అందుతున్నాయి. వీటి నుంచి గుత్తసంస్థలకు బిల్లులు చెల్లిస్తున్నారు. లబ్ధిదారులతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు చేసినట్లే. నాటి నుంచి రెండేళ్లు వాయిదాలు చెల్లించాల్సిన పని లేదు. కానీ ఆ గడువు కొన్నింటికి పూర్తవడంతో నోటీసులు వస్తున్నాయి. ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే.. డిఫాల్టరుగా మారతారని హెచ్చరిస్తున్నారు.


బిల్లులు రానిదే కట్టమంతే..

  • ఎన్టీఆర్‌ జిల్లాకు రూ.262 కోట్లకు గాను.. రూ.95 కోట్లే విడుదల చేశాయి. ఇంకా రూ.165.50 కోట్లు అందాలి.
  • బిల్లులు రానిదే నిర్మాణాలు ప్రారంభించబోమని మిగిలిన పట్టణాల్లో గుత్తసంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
  • జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, ఉయ్యూరు పట్టణాలకు మంజూరైన టిడ్కో గృహాలు తెదేపా ప్రభుత్వం మారాక ఒక్క ఇటుక వేయలేదు.
  • విజయవాడలో మొత్తం ఇళ్లలో 2490 ఇళ్లను 90శాతం పూర్తి చేశారు. బీ తిరువూరులో 384 గృహాలే ఉన్నా.. నెల వాయిదా కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.

ప్రభుత్వమే చెల్లించాలి.. లబ్ధిదారులకు నోటీసులు అందడంపై టిడ్కో ఈఈ చిన్నోడును ‘ఈనాడు’ వివరణ కోరగా బ్యాంకులు రుణం మంజూరు చేసిన నాటి నుంచి రెండేళ్ల వరకు మారిటోరియం ఉంటుందని, తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి కాని పక్షంలో సంబంధిత మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుని సొమ్ములు చెల్లించాలన్నారు. ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని