logo

నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి

నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్‌జంక్షన్‌, బిళ్లనపల్లిలో పర్యటించారు.

Updated : 28 Mar 2024 06:16 IST

బిళ్లనపల్లిలో ప్రసంగిస్తున్న భువనేశ్వరి, పక్కన యార్లగడ్డ వెంకట్రావ్‌

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్‌జంక్షన్‌, బిళ్లనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నుంచి వచ్చిన ఆమెకు హనుమాన్‌జంక్షన్‌ వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అభ్యర్థన మేరకు భువనేశ్వరి అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యార్లగడ్డ దంపతులు భువనేశ్వరికి హారతులిచ్చారు. చంద్రబాబు సతీమణికి సంఘీభావం తెలిపేందుకు భారీగా శ్రేణులు, అభిమానులు, మహిళలు తరలివచ్చారు. దీంతో జంక్షన్‌ కూడలి స్తంభించింది. తొలుత 5 నిమిషాలే భువనేశ్వరి జంక్షన్‌లో ఆగుతారని నాయకులు చెప్పగా, ఇక్కడకు తరలివచ్చిన అభిమాన సందోహాన్ని చూసిన ఆమె, దాదాపు అరగంటకు పైగా ఉత్సాహంగా ప్రసంగించారు. నిజం గెలిచేలా.. రాష్ట్రం ప్రగతితో కళకళలాడేలా తీర్పు ఇవ్వాలని కోరారు. తర్వాత భారీ ర్యాలీగా బిళ్లనపల్లి తరలివెళ్లారు. అక్కడ మహిళల్ని చూసి కాసేపు ప్రసంగించి, చంద్రబాబుకు, లోకేశ్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మండల బాధ్యులు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చిరుమామిళ్ల సూర్యం, బచ్చుల బోసుబాబు, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి, రాష్ట్ర నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, వేగిరెడ్డి పాపారావు, వేములపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమాప్రసాద్‌, యనమదల వెంకయ్యారావు, వడ్డిల్లి లక్ష్మీ, మొవ్వా వెంకటేశ్వరరావు, అట్లూరి శ్రీను, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని