logo

దండుకోవడానికే ఓటీఎస్‌.. ప్రయోజనం లేని గృహ హక్కు పత్రాలు

ఏకకాల పరిష్కారం(ఓటీఎస్‌) సొమ్ము చెల్లించి లబ్ధిదారులు పొందిన ‘గృహహక్కు’ ధ్రుపపత్రాలు(పట్టాలు) ఎందుకూ పనికి రావని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Updated : 12 Apr 2024 07:17 IST

సొమ్ము చెల్లించినా 30 శాతం మందికే జారీ
కంకిపాడు, న్యూస్‌టుడే

కకాల పరిష్కారం(ఓటీఎస్‌) సొమ్ము చెల్లించి లబ్ధిదారులు పొందిన ‘గృహహక్కు’ ధ్రుపపత్రాలు(పట్టాలు) ఎందుకూ పనికి రావని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2021 డిసెంబరు నుంచి రెండు నెలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యాలు పెట్టి మరీ సొమ్ము వసూలు చేయడం విదితమే. 52 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతూ దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రచారం చేసింది. దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు’ పథకంగా పేరు పెట్టంది. 2011లోపు వివిధ పథకాల ద్వారా గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను ‘రుణ విముక్తి’ చేయడమే లక్ష్యంగా పేర్కొంది. 15 ఏళ్ల కిందట ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికీ తాఖీదులు అందాయి. గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌ పరిధిలో రూ.20 వేల చొప్పున ఒక్కో లబ్ధిదారు నుంచి వసూలు చేశారు.

చెప్పింది ఇదీ!

  • లబ్ధిదారుకు ఇంటిపై సర్వహక్కులూ కల్పిస్తారు.
  • స్థలానికి గృహాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు..అమ్ముకోవచ్చు..బహుమతిగా ఇవ్వవచ్చు.
  • ప్రధానంగా బ్యాంకుల్లో తనఖాపెట్టి రుణాన్ని పొందవచ్చు.
  • ఎటువంటి సేవా రుసుములు లేకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

జరిగింది ఇదీ..

  • ఓటీఎస్‌ కింద సొమ్ము చెల్లించిన 30 శాతం మందికే ‘పట్టాలు’ ఇచ్చారు
  • గృహ నిర్మాణానికి రుణాన్ని పొందిన వ్యక్తి మరణించిన సందర్భాలు, అప్పటికే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థలాలు, వారసులు ఒక్కరి కంటే అధికంగా ఉండడం, అప్పటికే ఆరేడు చేతులు మారడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని రోజులు అవగాహన కల్పించి కొందరికి ‘పట్టాలు’ ఇచ్చి ‘మమ’ అనిపించారు
  • గతంలో మహిళల పేరుతోనే గృహ రుణాలు మంజూరు చేశారు. 90శాతం పురుషుల పేరుతోనే స్థలాలు ఉన్నాయి. నిబంధనల మేరకు లబ్ధిదారు పేరుతోనే రుణ విముక్తి ధ్రువపత్రాలు ఇచ్చారు. స్థలం కుటుంబ సభ్యులో మరొకరి పేరుతో ఉండడంతో ‘పట్టాలు’ జారీ చేయలేదు. దీనిపై తరచూ మార్గదర్శకాలను మార్చడంతో పట్టాల మంజూరు గందరగోళంగా మారింది.

కొండెక్కిన పట్టాలు

నిర్ధరించిన సొమ్ము వసూళ్లు పూర్తి కాగానే, పథకం అమలును అనధికారికంగా ఆపేశారు. సర్వర్లు పనిచేయలేదని, ‘యాప్‌’ మూసేశారని, అప్పటికే సమయం మించిపోయిందనే సాకులతో స్వస్తి చెప్పారు. రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇంతవరకు అందని ఓటీ¨ఎస్‌ చెల్లింపుదార్లు  70 శాతం ఉండడానికి ఇవే కారణం.

కంకిపాడు మండలం గొడవర్రు వంతన సమీపంలో నివసించే ఎనిమిది మంది ఓటీఎస్‌ సొమ్ము చెల్లించి పొందిన పట్టాలను కంకిపాడులోని ఆరు ప్రభుత్వ, ప్రైవేటు సహకార బ్యాంకులకు తీసుకువెళ్లి రుణాన్ని అడిగారు. తనఖా పెట్టుకోడానికి ఇవి పనికిరావని తేల్చి చెప్పారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు మేనేజర్‌ ‘ఇవి నాలుక గీసుకోవడానికీ పనికిరావన్నారు’. ఇదే విషయాన్ని గడప గడపకూ మన ప్రభుత్వంతో మహిళలు ప్రస్తావించారు. బ్యాంకర్లతో మాట్లాడతామని దాట వేశారు. ఇంతవరకు వారికి రుణం మంజూరు కాలేదు. ఇవి తనఖా పెట్టి రుణాన్ని పొందిన దాఖలాలులేవు. దీంతో వారు అంతా మోసం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


ఒకే స్థలానికి మూడు రిజిస్ట్రేషన్లు?

బ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఓటీఎస్‌, ప్రస్తుత భూసంరక్షణ పథకం..ఇలా ఒకే స్థలానికి మూడు రిజిస్ట్రేషన్లు..అవీనీ వివిధ పేర్లతో జారీ అయ్యాయి. ఏది ప్రామాణికమో చెప్పలేని దయనీయ స్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని