logo

అరకొర ఆహారం.. రోగుల హాహాకారం

మునుపెన్నడూ లేని విధంగా ఆసుపత్రుల రూపు రేఖలు మార్చేశాం..అన్ని వసతులు కల్పిస్తున్నామని వైకాపా పాలకులు చెబుతున్నా.. ప్రభుత్వాసుపత్రుల్లో నేటికీ రోగుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి.

Published : 13 Apr 2024 04:25 IST

ప్రభుత్వ ఆసుపత్రులకు అందని డైట్‌ బిల్లులు
భోజనం అందించలేక అవస్థలు

భోజనం తీసుకుంటున్న రోగి బంధువులు

ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం: మునుపెన్నడూ లేని విధంగా ఆసుపత్రుల రూపు రేఖలు మార్చేశాం..అన్ని వసతులు కల్పిస్తున్నామని వైకాపా పాలకులు చెబుతున్నా.. ప్రభుత్వాసుపత్రుల్లో నేటికీ రోగుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక నాణ్యత గల ఆహారాన్ని గుత్తేదార్లు అందించలేకపోతున్నారు. ప్రభుత్వ నింబంధనల ప్రకారం రోగికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించేందుకు రూ.80.. అదే గర్భిణులకైతే రూ.100 ఖర్చు చేయాలి. ఒక్కో విభాగానికి మెనూ ఒక్కో విధంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు పడేంత వరకు గుత్తేదారులే ఈ ఖర్చు భరించాల్సి ఉంటుంది. కానీ సకాలంలో బిల్లులు పడక ఆహారం నాణ్యతకు గండి పడుతోంది. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని చేతులు దులిపేసుకుంటున్నారు. సహాయకులకి ఆసుపత్రిలో భోజనాలు పెట్టరు కాబట్టి కొందరు రోగికి కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు.

అన్నం తింటున్న రోగి

రూ.70 లక్షల వరకు పెండింగ్‌..

ఓ బడా గుత్తేదారు నుంచి సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్న స్థానికుడు సకాలంలో బిల్లులు రాక తన బంగారం తాకట్టు పెట్టి మరీ రోగులకు భోజనాలు అందిస్తున్నారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో జనరల్‌ రోగులు సుమారు 220, గర్భిణులు 100 మందికి రోజూ భోజనం పెడుతున్నారు. ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు టిఫిన్‌, మధ్యాహ్నం 11 నుంచి 1, సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు మెనూ ప్రకారం భోజనం అందిస్తారు. వీటన్నిటికీ సదరు గుత్తేదారుకు నెలకు సుమారు రూ.5 లక్షలు ఖర్చు అవుతోంది. 2022 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.70 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, సకాలంలో రోగులకు భోజనం అందించడానికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు సకాలంలో రాక సదరు చోటా గుత్తేదారు పనివారికి వేతనాలు సైతం ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ః అవనిగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చెందిన గుత్తేదారుకు 15 నెలల నుంచి బిల్లులు ఆగిపోయాయి. వంట గది సౌకర్యం లేకపోవడంతో బయట వండించి సరఫరా చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలోని బిల్లులు సైతం నేటికీ పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ః గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. నెలల తరబడి బిల్లులు పడక వైకాపా గుత్తేదారులే నోరు మెదపడంలేదు.

బయటి భోజనం కొనుక్కొని వస్తున్న రోగి బంధువులు

పెట్టిందే ఇద్దరం తింటున్నాం..

ఈమె పేరు రాజమ్మ గుడివాడకు దగ్గరలోని ముదినేపల్లి. భర్త గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రి నుంచి బందరు సర్వజనాసుపత్రికి రిఫర్‌ చేయగా కొన్ని రోజులు ఉంచారు. అక్కడ కూడా గుండెకు సంబంధించిన పరీక్షలు చేసే సామగ్రి లేవని విజయవాడకు పంపిస్తున్నారు. ఇక్కడి ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనం రోగికి మాత్రమే పెడతారు. దీంతో 65 ఏళ్లు పైబడిన ఆమె బయటికి వెళ్లి భోజనం తెచ్చుకోలేక వారు పెట్టిన కొద్దిపాటి అన్నాన్నే ఇద్దరు తింటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని