logo

వైకాపా సిద్ధం.. జనానికి నరకం

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినా ఆర్టీసీ అధికారుల తీరు మారడం లేదు. తమకు ప్రయాణికుల కంటే అధికార పార్టీ ఆదేశాలే శిరోధార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 13 Apr 2024 04:27 IST

సిటీ బస్సులు గుంటూరు సభకు తరలింపు
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ బస్టేషన్‌

బస్సులు లేక ఖాళీగా ఉన్న ప్లాట్‌ఫామ్‌లు

న్నికల షెడ్యూల్‌ వచ్చినా ఆర్టీసీ అధికారుల తీరు మారడం లేదు. తమకు ప్రయాణికుల కంటే అధికార పార్టీ ఆదేశాలే శిరోధార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలే మండే ఎండలు.. దీనికితోడు గమ్యస్థానం ఎక్కాల్సిన బస్సుల రాక కళ్లు కాయలు కాసేలా నిరీక్షించినా ఫలితం కనిపించలేదు. అధికార వైకాపా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ సభల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగినన్ని బస్సులు లేక ఎదురుచూపులు తప్పడం లేదు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌ సభకు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి వంద చొప్పున మొత్తం 200 బస్సులు గుంటూరుకు వెళ్లాయి.

వెళ్లినవన్నీ సిటీ బస్సులే.. గుంటూరు సభకు ఎన్టీఆర్‌ జిల్లా నుంచి వెళ్లినవన్నీ సిటీ బస్సులే కావడం గమనార్హం. నగర పరిధిలోని నాలుగు డిపోల నుంచి వీటిని సర్దుబాటు చేశారు. ఇబ్రహీంపట్నం డిపో నుంచి 10, విద్యాధరపురం, గవర్నర్‌పేట-1, గవర్నర్‌పేట-2 డిపోల నుంచి 30 చొప్పున మొతం వంద వెళ్లాయి. నగరవాసులు ప్రధానంగా ప్రజారవాణా కోసం సిటీ బస్సులపైనే ఆధారపడతారు. అలాంటిది ఒకేసారి అన్ని బస్సులు పంపించడం వల్ల నరకయాతన అనుభవించారు. నగరంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోనే అత్యధికంగా కళాశాలలు, ఆసుపత్రులు, వివిధ కార్యాలయాలు ఉండడంతో బస్సులకోసం గంటలకొద్దీ ఎదురుచూసినా రాకపోవడంతో కష్టాలు తప్పలేదు. సిటీ బస్‌ పోర్టులో ప్లాట్‌ఫాంలపైనే పడిగాపులు పడ్డారు.

రేపు మళ్లీ అవస్థలే..

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించనున్న ‘మేమంతా సిద్ధం’ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ 1,200 బస్సులను కేటాయించింది. ఇందు కోసం ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని డిపోల నుంచి వీటిని సర్దుబాటు చేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో బస్సులు వైకాపా సభకు పంపుతుండడంతో ఈ జిల్లాల పరిధిలో ప్రయాణికులకు అవస్థలు తప్పేలా లేవు. ఈ బస్సులు ఆదివారం ఉదయానికే వాటికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లనున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం, పెడన, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, తిరువూరు, ఏలూరు జిల్లా దెందులూరు ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు ఆర్టీసీ బస్సులను అధికార పార్టీ వినియోగించనుంది. ప్రయాణికుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్టీసీ యాజమాన్యం అధికార పార్టీకి అడిగినన్ని బస్సులు కేటాయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు