logo

పట్టం కడితే.. పట్టాలిస్తాం

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ రాజకీయ లబ్ధికి వినియోగించనుంది.

Published : 13 Apr 2024 04:28 IST

తెరవెనక అధికార పార్టీ మంతనాలు
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే

కోన ప్రాంతంలో చెరువులుగా మారిన అసైన్డ్‌భూములు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ రాజకీయ లబ్ధికి వినియోగించనుంది. ముఖ్యమంత్రి జగన్‌ హామీ మాటున స్థానిక పెద్దలు తీర ప్రాంత భూములను గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగా ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. రాబోయే ఎన్నికల్లో సహకరించే ప్రతి ఒక్కరికీ ఎన్నికల అనంతరం పట్టాలు ఇప్పిస్తామంటూ పలువురు అధికార పార్టీ నాయకులు ఓటర్లతో మంతనాలు సాగిస్తున్నారు. తటస్థంగా ఉండే వారిని పిలిపించి వారి పేర్లు నమోదు చేసుకుంటూ పట్టాలు ఇచ్చేసినంత హంగామా చేస్తున్నారు.

మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటితో పాటు వందల ఎకరాల విస్తీర్ణంలో సీఆర్‌జడ్‌ పరిధిలోని భూములూ ఉన్నాయి. ఎప్పటినుంచో అప్పటి ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల జిల్లా పర్యటనల సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు వందల ఎకరాల ప్రభుత్వ భూములను డి.పట్టాల పేరుతో పంపిణీ చేశారు. ఆ భూముల పంపిణీ కేవలం ప్రచారానికి మాత్రమే పనికివచ్చేది. పట్టాలు పొందిన లబ్ధిదారులు సైతం తమ భూమి ఎక్కడ ఉందనే దానిపై ఆసక్తి చూపేవారు కాదు. ఆక్వా పరిశ్రమ వృద్ధి చెందుతున్న సందర్భంలో ఈ భూములపై పలువురి దృష్టి పడడంతో నిబంధనలకు విరుద్ధంగా అవి చేతులు మారిపోయాయి. ముందు చూపుతో కొందరు రాజకీయ అండతో అనుభవదారులుగా తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లోనూ చేర్పించేశారు. భీమవరానికి చెందిన కొందరు ఇక్కడి భూముల సర్వే నంబర్లతో కొన్ని బ్యాంకుల్లో అక్రమంగా కోట్లాది రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టేయడంతో సదరు బ్యాంకులు ఈ ప్రాంత వాసులకు నోటీసులు పంపడం, వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను బట్టి సీబీఐకి అప్పగించారు. మొత్తం మీద ప్రభుత్వ పరంగా పంపిణీ చేసిన వేలాది ఎకరాల భూములు గడచిన కొన్ని సంవత్సరాలుగా అసలైన లబ్ధిదారుల చేతిలో లేకుండా పరాధీనంలోకి వెళ్లిపోయాయి. బినామీ పేర్లతో కొందరు రాజకీయ నాయకులు, బడాబాబులు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువులు తవ్వేశారు.

సీఎం హామీతో కదలిక

స్థానిక నాయకులు మచిలీపట్నంలో ఉన్న దాదాపు 12,000 ఎకరాల అసైన్డ్‌భూములను అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరడంతో అంగీకరించిన సీఎం తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆగమేఘాల మీద మండల పరిధిలోని గ్రామాల్లో సర్వే చేశారు. అసైన్డ్‌ భూములు అర్హులైన లబ్ధిదారుల చేతుల్లో ఎన్ని ఉన్నాయి. ఇతరుల చేతుల్లో ఎన్ని ఉన్నాయన్న లెక్కలు తీసి ప్రస్తుతం అనుభవదారులుగా ఉన్న వారికి తమ హక్కులకు సంబంధించిన పత్రాలు చూపించాలంటూ నోటీసులు ఇచ్చారు. దాదాపు 3,000 ఎకరాల్లో అసలైన లబ్ధిదారులు ఉన్నారని మిగిలిన 9,000 ఎకరాలు ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు.

విలువ పెరగడంతో పెద్దల కన్ను

ఆక్వా సాగు పెరగడంతో అసైన్డ్‌ భూముల విలువ అపారంగా పెరిగింది. దీంతో స్థానికంగా పట్టున్న నాయకుల కన్ను ఆ భూములపై పడింది. నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారిన భూములను తమ గుప్పెట్లోకి తీసుకుని ఆర్థిక లబ్ధిపొందేదిశగా చర్యలు ప్రారంభించారు. ఏ అండా లేని వారికి అరకొరగా ముట్టచెప్పి బలవంతంగా భూములు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ భూముల ద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందాలన్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. అందుకు పోర్టు పనుల ప్రారంభోత్సవం కోసం మచిలీపట్నం వచ్చిన సీఎం కార్యక్రమాన్ని వేదికగా ఎంచుకున్నారు.

పారని పాచిక

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందే తమ అనుయాయులు, బినామీ దార్లకు సదరు భూములకు పట్టాలు ఇప్పించేయాలనుకున్న అధికార పార్టీ నాయకుల పాచిక పారలేదు. పాములపుట్టలా ఉన్న భూముల వ్యవహారంలో తలదూర్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్న భయంతో రెవెన్యూ సిబ్బంది తగు సహకారం అందించలేదు. ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేయడంతో పట్టాల పంపిణీ ప్రక్రియ పక్కకు వెళ్లిపోయింది. దీంతో తాజాగా ఎన్నికల్లో తమకు సహకరించిన వారికి గెలిచిన తరువాత పట్టాలు అందజేస్తామంటూ ప్రసన్నం చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని