logo

జనమంటే పగ.. జగనంటే దగా

నాడు ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యలు విని.. కని చలించిపోయారు.  తెదేపా ప్రభుత్వం ఏం   చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం నేను పుట్టాను.. ఇంకో ఏడాది ఓపిక పట్టండి... ఒక్క ఛాన్సు ఇవ్వండి. మీ బిడ్డ ప్రభుత్వం వస్తోంది.. అన్ని సమస్యలూ తీరుస్తా’ అన్నారు.

Updated : 13 Apr 2024 04:53 IST

అమలు కాని ప్రతిపక్ష, సీఎం హోదాలో జగన్‌ హామీలు

నాడు ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యలు విని.. కని చలించిపోయారు.  తెదేపా ప్రభుత్వం ఏం   చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం నేను పుట్టాను.. ఇంకో ఏడాది ఓపిక పట్టండి... ఒక్క ఛాన్సు ఇవ్వండి. మీ బిడ్డ ప్రభుత్వం వస్తోంది.. అన్ని సమస్యలూ తీరుస్తా’ అన్నారు. గద్దెనెక్కాక జనమంటేనే పగ అన్నట్లు కర్కశంగా మారిన వేళ.. జగనంటే దగా అని ప్రజలు ఈసడించుకుంటున్నారు.

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ కార్పొరేషన్‌, విద్యాధరపురం

గన్‌ చేసిన బాసలు నమ్మిన జనం ఒక్క ఛాన్సు ఇచ్చారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బటన్‌ నొక్కుడే తప్ప అడుగు కదల్లేదు. హామీలు గుర్తు చేద్దామని ప్రయత్నించినా.. కలిసే భాగ్యం ప్రజలకు కలగలేదు. అక్కడి నుంచే నా పెళ్లి కానుక.. అని శిలాఫలకం వేశారు. నా పుట్టిన రోజు బహుమతి అంటూ హామీలు గుప్పించారు. ఒక్కటీ నెరవేరలేదు. తాగునీరు లేక గొంతెండుతున్నా.. సాగునీరు లేక పొలాలు బీడు వారినా.. అన్నదాతలను దళారులు దోపిడీ చేస్తున్నా.. కనీసం చలించలేదు. ఉలకలేదు... పలకలేదు. నాటి అధికార పక్షం మట్టి తింటోందని మొత్తుకున్న జగన్‌.. నేడు అదే మట్టిని అక్రమంగా తన అనుచరులు తవ్వేస్తున్నా.. రూ.కోట్లు పోగేస్తున్నా.. అధికారులను అటువైపు కన్నెత్తి చూడనీయలేదు. ప్రతిపక్ష నేత హోదాలో, ముఖ్యమంత్రిగా చేసిన బాసలు మర్చిపోయిన వైఎస్‌ జగన్‌ మరోసారి అవకాశం ఇవ్వాలని జిల్లాకు వస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని జనం నిలదీస్తున్నారు.


కట్లేరుపై వంతెన కట్టలే

హామీ: గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్‌ 2023 మార్చి 19న తిరువూరు సభలో ప్రకటించారు. ప్రతిపక్ష నేత హోదాలోనూ హామీ ఇచ్చారు.
తాజా పరిస్థితి:  ప్రస్తుత ఎన్నికలకు ముందు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు జీవో విడుదల చేశారు. సాంకేతిక మంజూరు, పరిపాలన ఆమోదం లేకుండానే అధికారులు ఎంపీ నాని, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుతో హడావుడిగా శంకుస్థాపన చేయించారు. మార్చి నెలాఖరుకు పనులు ప్రారంభిస్తామని ఎంపీ ప్రకటించారు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకు మార్గం ఎంతో ముఖ్యం. వంతెనపై నుంచి గంపలగూడెం మండలం పరిధిలోని 24 గ్రామాల ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు వినగడప, చీమలపాడు మీదుగా నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ ప్రాంతాలకు ప్రయాణించాలి. వంతెన కార్యరూపం దాల్చకపోవడంతో తాత్కాలిక రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.


దుర్గమ్మకూ ద్రోహమే

గతంలో ఇంద్రకీలాద్రిపై జారిపడిన కొండరాళ్లు

హామీ: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు, మల్లేశ్వరాలయ పునర్నిర్మాణం, కొండరాళ్లు జారి పడకుండా మెష్‌ ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
తాజా పరిస్థితి:  దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మధ్య సమన్వయం లేక దుర్గగుడి అభివృద్ధి పనులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. కేశఖండన శాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయలేదు. నీటిపారుదల, దేవాదాయ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో కేశఖండనశాల నిర్మాణం పట్టాలెక్కలేదు.


హామీ: మామిడి అనుబంధ పరిశ్రమలు స్థాపిస్తాం

తాజా పరిస్థితి: అధికారôలోకి వచ్చాక కనీసం ఆ ఆలోచన లేదు. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు గిరాకీ ఉండేది. రైతులకు గిట్టుబాటు అయ్యేది. మైలవరం నియోజకవర్గంలో సుమారు 25 వేల ఎకరాల వరకు మామిడి సాగు చేస్తుండగా, సగానికిపైగా రెడ్డిగూడెం మండలంలోనే ఉంది. రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. ధర వారి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండడంతో రైతులు నష్టపోతున్నారు.


ప్రజలకు ‘కొండ’ంత కష్టాలు

హామీ: విజయవాడలోని కొండ ప్రాంత ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రతిపక్షనేతగా, నిధులు విడుదల చేస్తానని సీఎంగా హామీ ఇచ్చారు.
తాజా పరిస్థితి: హామీ అమలు కాలేదు. నగరంలో 160 ఎకరాల్లో కొండ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. 67 వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విదల్చలేదు.


సుబాబుల్‌ రైతుకు ‘మొండి’చెయ్యి

హామీ: అధికారంలోకి రాగానే సుబాబుల్‌ టన్నుకు రూ.ఐదు వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని 2019లో నందిగామలో ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రకటించారు.
తాజా పరిస్థితి: సీఎం అయ్యాక మర్చిపోయారు. ప్రస్తుత నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు సుబాబుల్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. వైకాపా పాలనలో నాలుగేళ్ల వరకు టన్నుకి రూ.1500 నుంచి రూ.2200 వరకే రైతుకు దక్కింది. మంత్రివర్గ ఉప సంఘం పేరుతో కాలయాపన చేశారే తప్ప ఊరట కల్పించలేదు. ఫలితంగా చాలామంది రైతులు సాగుకు స్వస్తి పలికారు.


సాంకేతిక విద్య.. మిథ్య

హామీ: తిరువూరులో ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలతో కూడిన సమీకృత నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు సీఎం హోదాలో 2023 మార్చి 19న తిరువూరు సభలో జగన్‌ ప్రకటించారు.
తాజా పరిస్థితి: ఏడాది గడిచినా ఏర్పాటు చేయలేదు. కనీసం అనుమతులు కూడా మంజూరు చేయలేదు. జిల్లాలోనే వెనుకబడిన తిరువూరు నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు సాంకేతిక విద్య మిథ్యగా మారింది. రూ.వేలు ఫీజులు చెల్లించి ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో సాంకేతిక విద్యనభ్యసించాల్సి వస్తోంది. ఫీజులు చెల్లించలేని వారు, దూరప్రాంతాలకు పిల్లలను పంపడానికి ఇష్టం లేని తల్లిదండ్రులు మధ్యలోనే చదువు మాన్పిస్తున్నారు.


‘ట్రామా’ అంతా డ్రామా

హామీ: జాతీయ రహదారికి అనుసంధానంగా జగ్గయ్యపేట ఉన్నందున ప్రమాద బాధితుల కోసం ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, రూ.3 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు.
తాజా పరిస్థితి: హామీ అమలులో విఫలమయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి కొన ఊపిరితో ఉన్న వారికి వరంలా పరిణమించాల్సిన ట్రామా కేర్‌ సెంటర్‌ సాకారం కాలేదు. కేంద్రం నిర్మాణానికి ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థకు అనుమతులు ఇవ్వకుండా కొర్రీలు వేశారు. జాతీయ రహదారి పక్కన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్న హామీ శిలాఫలకానికే పరిమితమైంది.


పుట్టినరోజు కానుక.. దరి చేరక

హామీ: ముఖ్యమంత్రి హోదాలో భూముల సర్వే ప్రారంభోత్సవం సందర్భంగా 2020 డిసెంబరు 21న తన పుట్టినరోజు నాడు జగ్గయ్యపేటలో నిర్వహించిన సభలో  ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తామన్నారు.
ప్రస్తుత పరిస్థితి : గతంలో ఉన్న పరిశ్రమలే తప్ప... పారిశ్రామికాభివృద్ధి సంస్థ ద్వారా కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు. ఉద్యోగాలు లేవు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు.


హామీ: జగ్గయ్యపేటలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీని  ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి : అద్దె భవనంలో కేవలం డిస్పెన్సరీ మాత్రమే నడుస్తోంది. అరకొర సౌకర్యాలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు.


నెరవేరని స్టేడియం కల..

హామీ: విజయవాడ గట్టు వెనుక ప్రాంతంలో అవుట్‌ డోర్‌ స్టేడియం నిర్మిస్తామని, ముఖ్యమంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి ప్రకటించారు.
తాజా పరిస్థితి : వైకాపా ప్రభుత్వ పదవీ కాలం పూర్తయినప్పటికీ స్టేడియం నిర్మాణం పూర్తి కాలేదు. రెండు లక్షల జనాభా ఉన్న గట్టువెనుక ప్రాంతవాసులకు స్టేడియం అందని ద్రాక్షగా మారింది. తెదేపా ప్రభుత్వం స్టేడియం స్థలాన్ని రూ.50 లక్షలు వెచ్చించి మెరక చేసింది. 2018లో చంద్రబాబు సీఎం హోదాలో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వేసిన శిలఫలకాన్ని సైతం అధికార పార్టీ నాయకులు తొలగించడం గమనార్హం.


హామీ:  ఎ.కొండూరు కిడ్నీ బాధితుల కోసం మినరల్‌ వాటర్‌ సౌకర్యం కల్పిస్తాం.
తాజా పరిస్థితి : సీఎం అయ్యాక కిడ్నీ బాధితుల సమస్యను విస్మరించారు. సీఎం హోదాలో తిరువూరు వచ్చినప్పుడు అదే మాట వల్లె వేశారు తప్ప హామీ నెరవేర్చలేదు.


మాట తప్పినవి ఎన్నో..

 

  • వీటీపీఎస్‌ కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్‌ను సీపీఎస్‌ తరహాలోనే మాటమార్చారు.
  • వెలగలేరు ప్రాంతంలో మట్టి తవ్వకాలు, నీరు- చెట్టు పనుల అవినీతి అక్రమాలపై సీఎం జగన్‌ స్పందించారు. నేడు అదే ప్రాంతంలో మంత్రుల అనుచరులు రూ.వందల కోట్ల మట్టి అక్రమంగా తరలించినా కనీస చర్యలు లేవు.
  • జగ్గయ్యపేట పరిసరాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతం, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు ఉన్న నేపథ్యంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ముక్త్యాల ఉత్తర వాహిని, వేదాద్రి, తిరుమలగిరి క్షేత్రాలను కలుపుతూ టెంపుల్‌ టూరిజానికి ప్రాధాన్యం ఇస్తామన్న హామీ గాలిలో కలిసిపోయింది.
  • జగ్గయ్యపేట మధ్యలో నుంచి ప్రవహిస్తున్న ఎర్ర కాల్వ, వేపల వాగుల ఆధునికీకరణ కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇచ్చిన మాట అటకెక్కింది.
  • జగ్గయ్యపేటకు పాసింజర్‌ రైలు నడిపేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తానన్న ముఖ్యమంత్రి హామీ పట్టాలెక్కలేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని