logo

‘మామ’వా.. మా పాలిట శకునివా!

‘‘గ్రామీణ విద్యార్థులకు వారి పాఠశాలల్లోనే ఇంటర్‌ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి.. అక్కడే నాణ్యమైన విద్యను చదువుకునే అవకాశం కల్పిస్తామని గొప్పగా చెప్పిన జగన్‌ సర్కారు మాటలకు.. చేతలకు.. అసలు ఎక్కడా పొంతన లేకుండా పోయింది.

Updated : 13 Apr 2024 07:36 IST

బడి కళాశాలల్లో.. దారుణ ఫలితాలు
విద్యార్థుల కొంప ముంచిన జగన్‌ సర్కారు
13 హైస్కూల్‌ ప్లస్‌ కళాశాలల్లో జీరో ఉత్తీర్ణత
తీవ్రంగా నష్టపోయిన గ్రామీణ విద్యార్థులు
ఈనాడు, అమరావతి

‘‘గ్రామీణ విద్యార్థులకు వారి పాఠశాలల్లోనే ఇంటర్‌ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి.. అక్కడే నాణ్యమైన విద్యను చదువుకునే అవకాశం కల్పిస్తామని గొప్పగా చెప్పిన జగన్‌ సర్కారు మాటలకు.. చేతలకు.. అసలు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 38 హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేస్తూ కళాశాలలుగా మార్చారు. కానీ.. ఈ కళాశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు, అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేయకపోవడంతో.. విద్యార్థులు బలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

తాజాగా ఇంటర్‌ మొదటి, ద్వితీయ ఏడాది ఫలితాల్లో ఈ హైస్కూల్‌ ప్లస్‌ కళాశాలల్లో చేరిన వారిలో కనీసం 30 శాతం మంది కూడా ఉత్తీర్ణులు కాలేదు. రెండు జిల్లాల్లో కలిపి మొదటి ఏడాదిలో 616 మంది విద్యార్థులు ఈ కళాశాలల్లో చేరగా.. వారిలో 589 మంది పరీక్ష రాశారు. వీరిలో కేవలం 166 (28 శాతం) మంది మాత్రమే నామమాత్ర మార్కులతో గట్టెక్కారు. మిగతా.. 423 మంది ఫెయిలయ్యారు. రెండో ఏడాదిలో 211 మంది పరీక్ష రాయగా.. వారిలో 63 (30 శాతం) మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

తొలిఏడాది దారుణ ఫలితం..

మొదటి ఏడాదిలో.. ఘంటశాల (4), పమిడిముక్కల (3), మల్లవోలు (20), పెడన పరిధిలోని చెన్నూరు(6), కంచికచర్ల(2), వత్సవాయి మండలం భీమవరం(7) హైస్కూల్‌ ప్లస్‌ కళాశాలల్లో మొత్తం కలిపి 42 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు.

  • నందిగామ మండలం లింగాలపాడు బడి కళాశాలలో 27 మంది విద్యార్థులు చేరగా.. వీరిలో 25మంది పరీక్ష రాశారు. కేవలం ఒకే ఒక్కరు ఉత్తీర్ణులయ్యారు.
  • జగ్గయ్యపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల కళాశాలలోనూ 20 మంది పరీక్ష రాస్తే ఇద్దరు పాసయ్యారు.
  • పెనుగంచిప్రోలు పరిధిలో హైస్కూల్‌ ప్లస్‌లోనూ 11 మంది పరీక్ష రాస్తే ఇద్దరు గట్టెక్కారు. 
  • గన్నవరం బాలికల హైస్కూల్‌ కళాశాలలో 43మంది రాస్తే.. కేవలం 14మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ పాపం.. వైకాపా సర్కారుదే. ముమ్మాటికీ జగన్‌దే. ఈ కళాశాలల్లో బోధించేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను ఏర్పాటు చేయకుండా.. ఉన్నోళ్లతోనే నెట్టుకొచ్చారు. దాని ఫలితంగానే.. ప్రస్తుత ఫలితాల్లో దారుణంగా విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది.

‘‘రెండు జిల్లాల్లో ఈ బడి కళాశాలల్లో కనీసం ఖాతా కూడా తెరవనివి 13 ఉండడం బాధాకరం. ఈ పదమూడు పాఠశాలల్లో 84 మంది మొదటి, రెండో ఏడాది పరీక్షలు రాయగా.. అందరూ ఫెయిలయ్యారు.’’

ద్వితీయంలో ఏడు చోట్ల జీరో..

హైస్కూల్‌ ప్లస్‌ కళాశాలల్లో రెండో ఏడాది ఫలితాలు మరీ దారుణంగా వచ్చాయి. ఏకంగా ఏడు చోట్ల జీరో ఫలితాలు నమోదయ్యాయి. పెనుగంచిప్రోలు (3), లింగాలపాడు (19), జగ్గయ్యపేట బాలికలు(4), పెనమలూరు(6), పమిడిముక్కల(6), ఘంటశాల ఒకరు చొప్పున పరీక్ష రాస్తే.. అందరూ తప్పారు. ఈ బడులన్నింటిలో ఇలాంటి ఫలితాలు రావడానికి ప్రధాన కారణం.. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఉపాధ్యాయులంతా ఏకకంఠంతో చెబుతున్నారు.

ముమ్మాటికీ జగన్‌ వైఫల్యమే..

హైస్కూళ్లలో కళాశాలలు పెట్టేశాం.. విద్యావ్యవస్థ మొత్తాన్ని ఉద్ధరించేశాం.. సంస్కరించేశామని డప్పు కొట్టి జగన్‌ ప్రభుత్వం చాటింపు వేసుకుంది. కానీ.. వాస్తవంగా అక్కడ బోధన సిబ్బంది, సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే.. కనీస ఆలోచన కూడా విద్యాశాఖకు లేకుండాపోయింది. పాఠశాలల్లో ఉన్న కొన్ని గదులను ఖాళీ చేయించి.. వాటికి కళాశాల అని ఓ బోర్డు తగిలించేసి.. ప్రవేశాలు కల్పించేశారు. తమకు దగ్గరిలోనే ఇంటర్‌ కళాశాల ఉంది కదా.. అని చేరిపోయిన విద్యార్థులకు ఆ తర్వాత కానీ.. అసలు వాస్తవం అర్థం కాలేదు. విద్యా సంవత్సరం మధ్యలో బయటకు రాలేక, ఉండలేక.. తీవ్ర ఇబ్బంది పడ్డారు. పాలకులు చేసిన నిర్వాకం వల్ల.. విద్యార్థుల జీవితాల్లో కీలకమైన ఇంటర్‌ విద్యలో 70శాతం మంది ఫెయిలవ్వక తప్పలేదు.

కృష్ణాలో ప్రభుత్వ జూనియర్‌లో..

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ ఫలితాలు అటూఇటుగానే వచ్చాయి. మొదటి ఏడాది 534 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. 273 (51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం ఫలితాలు కొద్దిగా మెరుగ్గా వచ్చాయి. తొలి ఏడాది 246 మంది పరీక్ష రాస్తే 192 (78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బీ ప్రభుత్వ కళాశాలల్లో రెండో ఏడాదిలో 490 మంది రాస్తే.. 357 (73 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాది వృత్తివిద్యా కోర్సుల్లోనూ 233 మంది రాస్తే 202 (87 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో...

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తొలి ఏడాది 782 మంది రాస్తే.. 302 (39 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. తొలి ఏడాది వృత్తివిద్యా కోర్సుల్లో 288 మంది రాస్తే.. 156 (68 శాతం) మంది పాసయ్యారు. బీ రెండో ఏడాదిలో 586 మంది రాస్తే.. 351 (60 శాతం) మంది పాసయ్యారు. రెండో ఏడాది వృత్తి విద్యలో 174 మంది రాస్తే.. 137 (79 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు