logo

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ లోక్‌ సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

Published : 17 Apr 2024 04:25 IST

25 వరకు గడువు
26న పరిశీలన
29 వరకు ఉపసంహరణలు

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ డిల్లీరావు

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ లోక్‌ సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది. 29 వరకు ఉప సంహరణలకు అవకాశం ఉందని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల దాఖలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లోక్‌ సభ స్థానానికి ఫారం-2ఏ నామినేషన్‌ పత్రం, శాసన సభ స్థానాలకు ఫారం-2బీ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. వీటిలో ప్రతి భాగం గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. పేర్లు రాయడం, ఫొటోల సమర్పణ తదితరాలపై సూచనలు చేశారు.

మధ్యాహ్నం  3 గంటల వరకు..

ప్రభుత్వ సెలవు రోజుల్లో మినహా మిగతా పని రోజుల్లో, నిర్దేశిత గడువులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్‌ అధికారుల (ఆర్వోల) కార్యాలయాల్లో, లోక్‌ సభకు సంబంధించి విజయవాడలోని కలెక్టరేట్‌లోనూ నామినేషన్లను స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థి సహా మొత్తం అయిదుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయాల్లోకి అనుమతి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఫారం-7ఎ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమంలో పరిగణనలోకి తీసుకుని, బ్యాలెట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. లోక్‌ సభ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి రూ.25,000, అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.10,000 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు.

అఫిడవిట్‌  చాలా కీలకం

నామినేషన్‌ పత్రాలతో పాటు ఫారం-26 అఫిడవిట్‌ దాఖలు చేయడం చాలా కీలకమని కలెక్టర్‌ చెప్పారు. పాన్‌ కార్డు వివరాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు స్థితి, పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసులు, నేరారోపణ కేసులు, చర, స్థిరాస్తులు తదితరాలు పొందుపరచాలి. లోక్‌ సభకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.95 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే వారికి రూ.40 లక్షల వరకు ఎన్నికల వ్యయం చేసేందుకు అనుమతి ఉంది. నామినేషన్‌ దగ్గరి నుంచి వ్యయం నమోదు జరుగుతుందన్నారు. అభ్యర్థి నిర్వహించాల్సిన రోజు వారీ ఖాతాలు, నగదు రిజిస్టరు, బ్యాంకు లావాదేవీల రిజిస్టరులను నామినేషన్‌ తరుణంలో అభ్యర్థికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల 30 నుంచి మే 11వ తేదీ వరకు మూడు సందర్భాల్లో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రముఖ వార్తా పత్రికలు, ఛానళ్లలో క్రిమినల్‌ యాంటిసిడెంట్స్‌ను ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.కిరణ్‌ (కాంగ్రెస్‌), కె.పరమేశ్వరరావు (ఆప్‌), డి.వి.కృష్ణ (సీపీఎం), పి.వి.శ్రీహరి (భాజపా), కె.వెంకటేశ్‌ (బీఎస్పీ), వై.రామయ్య (తెదేపా), షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌ (వైకాపా), ఎన్నికల వ్యయ నోడల్‌ అధికారి శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ ఎం.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని