logo

అప్పుల బతుకు..!

రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌గా మారడంతో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. పీఆర్సీ, కరవు భత్యం, సరెండర్‌ లీవులు తదితరాల కింద రూ.25,000 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది.

Published : 17 Apr 2024 04:31 IST

పెళ్లిళ్లు, చదువులకు తప్పని తిప్పలు
బకాయిల కోసం ఉద్యోగుల ఎదురు చూపులు
ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, మైలవరం, న్యూస్‌టుడే

రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌గా మారడంతో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. పీఆర్సీ, కరవు భత్యం, సరెండర్‌ లీవులు తదితరాల కింద రూ.25,000 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని భవిష్యత్తులో ఎలా పొందగలమనేనిది ప్రశ్నార్థకంగా మారిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీవనం అగమ్యగోచరం..

ప్రభుత్వ ఉద్యోగం అనగానే సమాజంలో ప్రజలు గొప్పగానే భావిస్తారు. తమకు ఎలాంటి సమస్యలు లేవని అనుకుంటారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలితో తాము పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావంటూ వాపోతున్నారు. విజయవాడకు చెందిన ఓ ఉద్యోగి.. గన్నవరంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆయన కుమారుడికి వివాహం చేయడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉన్నా.. అది ఎప్పటికి చేతికి అందుతుందో తెలియని పరిస్థితిలో అప్పు చేయక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు శాఖల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఇద్దరు/ముగ్గురు చేయాల్సిన పనులు ఒక్కరిపైనే పడుతుండడంతో ఒత్తిడికి గురికావాల్సి వస్తోందని మరి కొందరు బాధ పడుతున్నారు. పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తున్నామని మరి కొందరు ఆవేదన చెందుతున్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడం, వివిధ రూపేణా రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము దాచుకున్న డబ్బులు కూడా తమకు ఇవ్వకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. శాఖ ఏదైనా.. ఉద్యోగులు ఏ ప్రాంతం వారైనా వారి వేళ్లు మాత్రం ప్రభుత్వ తీరు వైపే చూపుతున్నాయి.


పెరిగిన ఆర్థికభారం..
- కె.కోటేశ్వరరావు, ఉపాధ్యాయుడు, మైలవరం

ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగికి డీఏ బకాయిలే కనీసం రూ.2 లక్షల వరకు పేరుకున్నాయి. 2018 నుంచి రావాల్సిన డీఏ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. జీతంపైనే ఆధారపడి జీవిస్తున్న ఉపాధ్యాయులకు ఆర్థికభారం పెరిగిపోయింది. కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా అప్పులు చేయాల్సి వస్తోంది. మొదటి వారంలో జీతం వస్తే చాలన్న తరహాలో మా జీవితాలు మారాయి.


వాటా చెల్లింపుల్లో జాప్యం..
 - కె.గంగరాజు, యూటీఎఫ్‌ నాయకుడు, మైలవరం

ఉద్యోగులకు డీఏ బకాయిలతో పాటు సరెండర్‌ లీవులకు చెల్లించాల్సిన మొత్తం ఏళ్లుగా ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా నెట్టుకురావాలి. ప్రభుత్వ ఉద్యోగులకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని చెప్పి, ఆర్థికంగా నానా ఇబ్బందులు పెడుతున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు 10 శాతం వాటా చెల్లింపుల్లో జాప్యంతో తీవ్రంగా నష్టపోతున్నారు.


నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం
- జి.రఘుపతి, ర.భ. ఉద్యోగి, మైలవరం

గత ఐదేళ్లుగా నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దాచుకున్న డబ్బులు తీసుకోవటానికి తిప్పలు పెడుతున్నారు. ఉపాధ్యాయులకు ఈ సమస్యలు మరింత అధికంగా ఉన్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు అప్పులు చేయాల్సి వస్తోంది. డబ్బులందక మా స్నేహితుడి కుమార్తె వివాహం ఏడాది పాటు వాయిదా వేసుకున్నారు. సకాలంలో వేతనాలు అందక, రుణ వాయిదాలు చెల్లించలేక సిబిల్‌ స్కోరు దారుణంగా ఉంటోంది. 


జీపీఎఫ్‌ డబ్బుల కోసం అవస్థలు
- బి.వసరాం నాయక్‌, మైలవరం

చరిత్రలో మొదటిసారి పీఆర్‌సీ నివేదిక కాకుండా, ఆఫీసర్స్‌ కమిటీ నివేదికను ఆమోదించి ప్రభుత్వం కొత్త పోకడ సృష్టించింది. ఎన్నికల హామీగా ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతి కంటే తక్కువ ఫిట్‌మెంటు 23 శాతం ఇచ్చింది. ఉద్యోగుల అత్యవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్‌ డబ్బుల కోసం నెలల తరబడి తిరిగేలా చేస్తున్నారు. సరెండర్‌ లీవులను మూడేళ్లుగా ఇవ్వకుండా తొక్కిపట్టిన ప్రభుత్వమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని