logo

రూకలివ్వలేదు.. రూపు మారలేదు!

విజయవాడ రూపురేఖలు మేమే మార్చాం. అభివృద్ధి మా ప్రభుత్వమే చేసింది’ అని సీఎం జగన్‌ విజయవాడ పర్యటనకు వచ్చినపుడు పదే పదే చెప్పే అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు.

Updated : 17 Apr 2024 05:46 IST

ఐటీఎంఎస్‌ ప్రాజెక్టుకు జగన్‌ పాతర
తీవ్ర ట్రాఫిక్‌తో నగరవాసికి నరకం
కేంద్రం నిధులూ వాడలేని దౌర్భాగ్యం
ఈనాడు, అమరావతి

బందరు రోడ్డులో నిత్యం ఇలానే..

విజయవాడ రూపురేఖలు మేమే మార్చాం. అభివృద్ధి మా ప్రభుత్వమే చేసింది’ అని సీఎం జగన్‌ విజయవాడ పర్యటనకు వచ్చినపుడు పదే పదే చెప్పే అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. మాటలు కోటలు దాటుతున్నా.. ఐదేళ్లలో బెజవాడ వాసుల ట్రాఫిక్‌ కష్టాలపై దృష్టి పెట్టలేదు. నగరంలో ట్రాఫిక్‌ నానాటికీ పెరుగుతోంది. రద్దీ వేళల్లో.. వీవీఐపీల రాకపోకల సమయంలో అధిక సమయం వాహనాలు నిలిపేస్తున్నారు. సమస్య పరిష్కారానికి పైసా విదల్చలేదు. కనీసం కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వాసులు ట్రాఫిక్‌తో నరకం చూస్తున్నారు.

ర్వేల్లో విజయవాడకు ఐటీఎంఎస్‌ మేలని తేలింది. 2019లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే రూ.14.50 కోట్లతో పోలీసులు పంపిన సవివర నివేదికకు ఆమోదం లభించింది. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో దీనిని చేర్చారు. అంచనా వ్యయంలో 33 శాతం అంటే.. రూ. 4,83,28,500 గత ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తం ఖర్చు చేస్తే మిగిలింది దశల వారీగా విడుదల చేయనున్నట్లు చెప్పింది. టెండర్లు పిలిచి పనిని అప్పగించేందుకు పోలీసు శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం దానిని విస్మరించింది. ఫలితంగా నిధులు వెనక్కి వెళ్లాయి.

కష్టాలు కనిపించలేదా జగన్‌?

సీఎం జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో దాదాపు 25 కి.మీ ప్రయాణం చేస్తుంటారు. ఎక్కువ భాగం విజయవాడ మీదుగానే వెళ్తారు. ఆయన రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్‌ నిలిపివేస్తున్నారు. ఆ సమయాల్లో నగరవాసులు ట్రాఫిక్‌లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఐదేళ్లుగా ప్రయాణిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి తమ అవస్థలు కనిపించలేదా? అని నగరవాసులు నిలదీస్తున్నారు.

బెంజి సర్కిల్‌ కూడలి వద్ద మొండి స్తంభానికే పరిమితమైన సిగ్నల్‌ లైట్‌


కేంద్ర నిధులతో ప్రారంభమైనా..

రూ.15 కోట్ల వరకు వ్యయం అయ్యే ప్రాజెక్టును నిధుల కొరత దృష్ట్యా దశల వారీగా చేపట్టాలని నగరపాలిక, పోలీసు శాఖలు నిర్ణయించాయి. ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం’ (ఎన్‌సీఏపీ) కింద నగరపాలికకు మంజూరైన కేంద్ర నిధులతో తొలి దశలో రూ.5 కోట్లను వీఎంసీ కేటాయించింది. 17 కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌పీటీ నెట్‌వర్క్స్‌ సంస్థ రూ.3.94 కోట్లకు పనులు దక్కించుకుంది. గత ఏడాది మార్చిలో ఒప్పందం జరిగింది. 45 రోజుల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. 14 కూడళ్లలో భూగర్భ కేబుల్‌ చేసి, స్తంభాలు పాతారు. పనులను కార్పొరేషన్‌ అధికారులు పరిశీలించి నాణ్యత లేదని తేల్చారు. సూచించిన మార్పులు చాన్నాళ్లకు కానీ గుత్తేదారు చేయలేదు. ఆ తర్వాత మళ్లీ పనులు ఆగిపోయాయి. పనుల పట్ల గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. పోలీసు, వీఎంసీ మధ్య సమన్వయం కొరవడింది. ఆ ప్రభావం పనులపై పడింది. మొదటి దశ పనులే ఇలా ఉంటే.. మిగిలినవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో? అర్థం కాని పరిస్థితి.


ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం

ట్రాఫిక్‌ కష్టాల పట్ల నగర వైకాపా ప్రజాప్రతినిధులు కనీస బాధ్యతతో వ్యవహరించలేదు. పెద్ద సమస్య కాదన్నట్లుగా చూశారు. తమకు కాసులు కురిపించే సివిల్‌ పనులపైనే దృష్టి పెట్టారు. ఫలితంగా వైకాపా అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. సమస్య కొలిక్కి రాలేదు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ కొన్నాళ్లు మంత్రిగా పనిచేశారు. సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొన్ని పదవులు చేపట్టారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. పైగా కేంద్ర నిధులతో పనులు ప్రారంభమైనా.. పూర్తి చేయించలేకపోయారు.

రాత్రి వేళల్లో రద్దీ


ఏమిటీ వ్యవస్థ

  • ఐటీఎంఎస్‌ (ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)లో ఇప్పుడున్న పాత సిగ్నలింగ్‌ బదులు ఆధునిక వ్యవస్థ రానుంది. కేంద్రీకృత నియంత్రిత విధానం ద్వారా అది పని చేస్తుంది. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ట్రాఫిక్‌ పర్యవేక్షిస్తారు.
  • సిగ్నళ్ల స్తంభాలకు బిగించిన కెమెరాలు వాహనాలను గుర్తిస్తాయి. రద్దీ లేని మార్గంలో ఎరుపు సిగ్నల్‌ పడుతుంది. ఎక్కువ వాహనాలు ఉంటే.. అధిక సమయం ఆకుపచ్చ లైట్‌ వెలుగుతుంది.
  • ఈ వ్యవస్థలో ఒకే మార్గంలోని సిగ్నళ్లు సమన్వయంతో పనిచేస్తాయి. ఫలితంగా నిరీక్షణ సమయం తగ్గుతుంది.

ఆశాజనక ఫలితాలు

  • ఐటీఎంఎస్‌ విధానాన్ని ఐదేళ్ల నుంచి దశలవారీగా దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేశారు. చాలా చోట్ల సత్ఫలితాలను ఇస్తోంది.
  • పుణెలో 68 కూడళ్లు, జైపుర్‌లో 25, కోల్‌కతాలో 95, అహ్మదాబాద్‌లో 93 కూడళ్లల్లో ఏర్పాటు చేశారు. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సగటు ప్రయాణ వేగం 10 శాతం పెరిగింది. ప్రయాణ జాప్యం 15 శాతం తగ్గింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని