logo

జనగళమే.. జయ కెరటమై..

పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్‌షోకు జనం పోటెత్తారు.

Updated : 18 Apr 2024 07:55 IST

మన జట్టు.. సూపర్‌ హిట్టు
పోటెత్తిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు
చంద్రబాబు, పవన్‌ రాకతో ఉప్పొంగిన ఉత్సాహం
ప్రజాగళం సభ, రోడ్డు షోకు అపూర్వ స్పందన

ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం, న్యూస్‌టుడే బృందం: పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్‌షోకు జనం పోటెత్తారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి.. చంద్రబాబు, పవన్‌కు స్వాగతం పలికారు. పెడన బస్టాండ్‌ కూడలి, మచిలీపట్నం కోనేరు సెంటరు.. జనసంద్రంగా మారాయి. చంద్రబాబు మాట్లాడుతూ.. కృష్ణా డెల్టాకు పట్టిసీమతో రెండు పంటలు పండించుకునే అవకాశం తెదేపా హయాంలో తెచ్చామన్నారు. తాను ఈ ఐదేళ్లు ఉండి ఉంటే.. 2020కే పోలవరం పూర్తిచేసి.. మూడో పంట పండించే అవకాశం కూడా కల్పించే వాళ్లమని తెలిపారు. కానీ.. పోలవరాన్ని జగన్‌ పూర్తిగా ముంచేశారన్నారు. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి తెదేపా హయాంలోనే తెచ్చామనీ, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు కలిగాయో అందరూ చూస్తున్నారన్నారు.

జోగి నోరే ఓ డ్రెయినేజీ...

పెడనలో జోగి రమేష్‌ గత ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అక్రమాలు శ్రుతిమించాయని పవన్‌ అన్నారు. ‘కొత్త పాస్‌బుక్‌ కావాలంటే రూ.10 వేలు, చేపలచెరువు తవ్వాలంటే రూ.1.50 లక్షలు ఇవ్వాలి. చేపల దాణా దుకాణం పెట్టాలంటే రూ.3 లక్షలివ్వాలి, మోటారు కూడా ఆయన చెప్పిన దుకాణంలోనే కొనాలి. కనీసం పెడనకు డ్రెయినేజీ కూడా కట్టకుండా.. తన నోటినే డ్రెయినేజీగా చేసుకుని బతికారు. ఇతని ఇంటి ముందునుంచి ఎవరైనా వెళితే.. నమస్కారాలు పెట్టాలి. లేదంటే జనసైనికుల మీద కేసులు పెట్టాడు. మట్టిమాఫియాపై ఫిర్యాదు చేస్తే వాళ్లను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఓ న్యాయమూర్తి తల్లి ఆస్తిని కూడా కబ్జా చేశారు. చివరికి మున్సిపల్‌ కార్మికులనూ ఇబ్బందిపెట్టిన ఘనుడీ ఎమ్మెల్యే.’ అని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతని పేరు కూడా తన నోటితో పలకాలని లేదని, అంత స్థాయి అతనికి లేదన్నారు.

40 లక్షల ఇళ్లకు మంచినీళ్లు లేవు..

కృష్ణా జిల్లాలో 40 లక్షల ఇళ్లకు కనీసం మంచినీటి సదుపాయం లేదని పవన్‌ వెల్లడించారు. ఇక్కడి ప్రజలకు చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు పెరిగిపోయాయన్నారు. ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలు చాలా పెరిగాయని, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, ఎ.కొండూరు, కృత్తివెన్ను, మైలవరం, కంచికచర్లలో పరిస్థితి విషమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా ఇసుక దోపిడీతో 76 మంది యువత ప్రాణాలు కోల్పోయారన్నారు. జగన్‌ ఇంటి పక్కనే అడ్డగోలుగా ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోందని మండిపడ్డారు.

అభిమాన నీరాజనం..

పెడనలో హెలీప్యాడ్‌ వద్దకు వేర్వేరుగా హెలీకాఫ్టర్లలో చంద్రబాబు, పవన్‌ చేరుకున్నారు. తొలుత చంద్రబాబు చేరుకోగా, ఆ తర్వాత పవన్‌ వచ్చారు. అక్కడి నుంచి వీరిద్దరూ కలిసి.. పెడన బస్టాండ్‌ సెంటర్‌లో ప్రజాగళం సభ వద్దకు ఒకే వాహనంలో ఎక్కి రోడ్‌షోగా వచ్చారు. దారిపొడవునా.. ప్రజలు, అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి.. ఇద్దరికీ స్వాగతం పలికారు. ఒకవైపు పవన్‌, మరోవైపు చంద్రబాబు వాహనంలో నిలబడి.. ప్రజలకు అభివాదం చేస్తూ రావడంతో.. రెండు పార్టీల అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇద్దరికీ జయ జయ ధ్వానాలతో స్వాగతం పలికారు. ‘పవన్‌, తాను మూడోసారి.. వారాహి ఎక్కి వచ్చామని చంద్రబాబు తెలిపారు. ఇద్దరం కలిసి.. వారాహి ఎక్కి మూడు జిల్లాలకు వెళితే.. మూడోచోట్లా సభలు సూపర్‌డూపర్‌ హిట్టయ్యాయని’ చంద్రబాబు అన్నారు.


బాలశౌరి గెలుస్తున్నారు.. డౌటే లేదు..

‘మచిలీపట్నం ఎంపీ స్థానంలో బాలశౌరి గెలుస్తున్నారు.. డౌటే లేదు. కానీ.. బందరు చరిత్రలో ఎన్నడూ రానంత మెజార్టీని బాలశౌరికి తెప్పిస్తామని అందరూ మాట ఇవ్వండి. పెడనలో కృష్ణప్రసాద్‌ను, మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను మంచి మెజార్టీతో గెలిపించాలని’ చంద్రబాబు, పవన్‌ విజ్ఞప్తి చేశారు. బందరులో పోర్టు పూర్తయితే ఎన్ని పరిశ్రమలొస్తాయో, ఎంత ఉపాధి వస్తుందో ఆలోచించమని చంద్రబాబు సూచించారు. ఒక్క పైసా లేకుండా పీపీపీ పద్ధతిలో నిర్మించే ప్రణాళిక తాను చేస్తే.. ఈ దుర్మార్గుడు.. జగన్‌ వచ్చి.. ఈపీసీ పద్ధతి అని ప్రైవేటుపరం చేసి డబ్బులు కొట్టేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే.. నేత కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. చేనేతకు 200 యూనిట్ల విద్యుత్తు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు. పెడనలో పది ఎకరాల్లో కలంకారీ కార్మికుల కోసం అవసరమైన నీటి సౌకర్యం, అక్కడే కాలుష్య నియంత్రణ ఫ్యాక్టరీని పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కలంకారీ కోసం ప్రత్యేక క్లస్టర్‌ పెడతామన్నారు.

బందరులో..

 

బందరులో ఐక్యత చాటుతున్న బాలశౌరి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కొల్లు రవీంద్ర

 

పోటెత్తిన పెడన

పెడనలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్‌లను ఆశీర్వదించమని పిలుపునిస్తున్న తెదేపా అధినేత

 

దూసుకెళ్దాం.. బ్రదర్‌

ఉత్సాహం ఉరకలేస్తూ నిలువెల్లా అభిమానం

తెలుగు మహిళల సంరంభం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని