logo

తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు

గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు.

Published : 19 Apr 2024 05:05 IST

గన్నవరం, పామర్రులో జోష్‌

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రెండు సెట్లు, ఆయన సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరీ మరో సెట్‌ నామినేషన్‌ పత్రాలు ఆర్వోకు సమర్పించారు. వీటిని నాయకులు కొల్లా ఆనంద్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ పరిమి, తగరం కిరణ్‌కుమార్‌లు ప్రతిపాదించారు. ఆర్వో గీతాంజలిశర్మ నేతృత్వంలో అధికారులు అభ్యర్థులతోపాటు వెంట వచ్చిన నాయకులకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత వెంకట్రావు ఘన విజయం సాధించాలని కోరుతూ హనుమాన్‌జంక్షన్‌ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల స్వామివారి శేషవస్త్రం, అక్షింతలను సాగునీటి వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణారావు ఆయన్ను ఘనంగా సత్కరించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆర్వో జేసీ గీతాంజలిశర్మ తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఎటువంటి ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా కఠిన చర్యలు హెచ్చరించారు.


నేడు బోడే ప్రసాద్‌..

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. దీనికి తెదేపా శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అభ్యర్థి బోడే నేరుగా అన్ని గ్రామాల్లో నాయకులకు స్వయంగా ఫోన్లు చేసి కోరుతున్నారు. ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఆయన పోరంకిలోని నియోజకవర్గ తెదేపా కార్యాలయం నుంచి నామినేషన్‌ దాఖలు చేయడానికి బయలుదేరనున్నారు. కార్యకర్తలతో కలిసి బందరు రోడ్డు మీదుగా ఆయన నామినేషన్ల దాఖలు కేంద్రమైన పెనమలూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకోనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల నడుమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. పెనమలూరు కూడలిలో పార్టీ అభిమాని కిలారు వెంకటేశ్వరరావు(రావు) ఆధ్వర్యాన పార్టీ నేతలు భారీ గజమాలతో బోడేను పెనమలూరులోకి ఆహ్వానించనున్నారు.  


పామర్రులో కుమార్‌రాజా

పామర్రు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాల స్వీకరణ ప్రారంభించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.శ్రీదేవి గురువారం తెలిపారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండ పామర్రు శాసనసభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వర్ల కుమార్‌రాజా అయిదుగురు కార్యకర్తలతో కలిసి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాల్లో ఫారం-ఎ, బి సమర్పించ లేదు. జనసేన నియోజకవర్గ బాధ్యుడు తాడిశెట్టి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని