logo

నాలుగో సింహం నలిగిపోతోంది

వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు.

Published : 19 Apr 2024 05:08 IST

వారాంతపు సెలవు లేక అనారోగ్యాలతో పాట్లు
న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం, పామర్రు గ్రామీణం, మచిలీపట్నం క్రైం

వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. దీంతో ఇతర ఉద్యోగుల మాదిరిగా పోలీసులు కూడా వారాంతపు సెలవు తీసుకోవచ్చని 2019, అక్టోబరు 21న పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తొలి ఆరు నెలలు ఈ ప్రక్రియ బాగానే అమలు చేశారు. అనంతరం మళ్లీ మొదటికి వచ్చింది. వారంలో ఒక్క రోజు కూడా కుటుంబంతో గడిపే అవకాశం లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితి వస్తే సెలవులు పెట్టుకోవాల్సి వస్తోంది. అవి కూడా ఏడాదికి 15 రోజులే. దానికీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని పలువురు పోలీసులు పేర్కొంటున్నారు. కనీస విశ్రాంతి లేకుండా పని చేస్తుంటే ఒత్తిడి పెరిగి రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు.


హామీ నెరవేరలేదు

  - పోలీస్‌ సిబ్బంది, గుడివాడ సర్కిల్‌

వారాంతపు సెలవులు లేకుండా పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అధికారంలోకి రాగానే వారాంతపు సెలవులిస్తామని ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అయిదేళ్ల పాలన పూర్తవుతున్నా కార్యాచరణకు నోచుకోలేదు. సెలవులు లేక ఇవ్బంది పడాల్సి వస్తోంది.


టీఏ, డీఏ విడుదలలోనూ జాప్యం

 - పోలీస్‌ సిబ్బంది, పామర్రు సర్కిల్‌

తమకు రావాల్సిన టీఏ, డీఏలు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. సమయానికి వస్తే కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. సెలవుల హామీ అమలు కాలేదు. 


మానసిక ప్రశాంతత లోపిస్తోంది

- వీఆర్‌లో ఉన్న ఎస్సై

ప్రశాంతంగా విధులు నిర్వహించుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. గతంతో పోలిస్తే పనిఒత్తిడి, బందోబస్తులు, ఇతరత్రా విధులు పెరిగాయి. వీటిని భరిస్తున్నా మానసిక ప్రశాంతత లోపిస్తోంది. స్థిరంగా కొంతకాలం ఒకే చోట విధులు నిర్వహించగలమన్న నమ్మకం సడలిపోయింది.గత ప్రభుత్వంతో పోలిస్తే రాజకీయ పరమైన ఒత్తిళ్లు పెరిగిన కారణంగా కొన్ని సందర్భాల్లో రౌడీ షీటర్లను సైతం గౌరవించాల్సి రావడం గుండెలనుపిండేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు