logo

ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?

సీఎం జగన్‌ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్‌ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు.

Published : 19 Apr 2024 05:19 IST

కృష్ణాపై బ్యారేజీల నిర్మాణం గాలికి..
ఏడాదిలో కడతానని.. మాట తప్పిన సీఎం
ఈనాడు, అమరావతి

2020లో సీఎం జగన్‌ ఏం చెప్పారంటే...
‘కృష్ణా నదిపై రెండు బ్యారేజీల నిర్మాణానికి త్వరలో టెండర్లను పిలుస్తున్నాం. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేస్తాం. రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’
మరి మాట నిలబెట్టుకున్నారా?
సీఎం జగన్‌ జిల్లా ప్రజలకిచ్చిన హామీని కృష్ణా నదిలో కలిపేశారు. బ్యారేజీల నిర్మాణం అతీగతీ లేదు. ప్రస్తుతం వాటి అంచనా వ్యయాలు దాదాపుగా రెట్టింపయ్యాయి.  

సీఎం జగన్‌ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్‌ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. జనం ఘోషను చెవికెక్కించుకోలేదు.

గతేడాది కృష్ణా జిల్లాలో రెండో పంటకు సాగునీరందించలేదు. ఈ ఏడాదైతే రెండో పంటకు ప్రభుత్వం క్రాప్‌ హాలీడే ప్రకటించింది. అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లో వరికి సాగునీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం సాగునీటికే కాదు..తాగునీటికి సైతం కటకట ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చనుంది. కృష్ణా నది నుంచి ఏటా వరద జలాలు భారీస్థాయిలో సముద్రంపాలవుతున్నాయి. మరోవైపు సాగర జలాలు ఎగదన్నడంతో పంట పొలాలు ఉప్పు కయ్యలుగా మారిపోతున్నాయి. అయినా సర్కారు మొద్దునిద్రలోనే జోగుతోంది.


ఈ బ్యారేజీల నిర్మాణం ఎందుకంటే..

 • ఏటా కృష్ణా వరద జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయి.
 • సముద్రం నుంచి ఎగపోటు ద్వారా వచ్చే ఉప్పునీటి కారణంగా భూగర్భ జలాలు కఠినంగా మారిపోతున్నాయి. దీనివల్ల పంటభూములు చౌడుబారే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి దివిసీమ ప్రాంతం ఉప్పుమయంగా మారిపోతోంది.
 • సముద్రపు నీరు కృష్ణా నదిలోకి కూడా ఎగదన్నడంతో ఈ నదీ జలాలతోపాటు తీరప్రాంతంలో ఉప్పుశాతం పెరిగిపోతోంది.
 • ఈ సమస్యల పరిష్కారం కోసమే గత తెదేపా ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు, ఎగువన ఒక బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది.
 • నదిలో చెక్‌డ్యామ్‌ తరహాలో నీటిని నిల్వ చేసి అడ్డుకట్టలు వేయాలని గత తెదేపా ప్రభుత్వం ప్రతిపాదించింది.
 • ఈ నిర్మాణాలు పూర్తయితే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. పొలాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని కూడా అందించవచ్చు.
 • భూగర్భజలాలు వృద్ధి చెందడమే కాకుండా ఉప్పునీటి శాతం తగ్గుతుంది.
 • కరకట్టల కోతలను కొంతవరకు అడ్డుకోవచ్చు.
 • గుంటూరు, కృష్ణాల మధ్య కనకదుర్గ వారధి తర్వాత దిగువన వంతెనల్లేవు. ఈ బ్యారేజీలతో రోడ్డు మార్గాలు ఏర్పాటవుతాయి.

ప్రతిపాదనలు ఇలా..

 • కృష్ణా జలాలను సాగు, తాగునీటి అవసరాల కోసం వినియోగించేందుకని గత తెదేపా ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీల నిర్మాణాన్ని ప్రతిపాదించింది.
 • రూ. 200 కోట్లతో సవివర పథక నివేదికలను సిద్ధం చేసింది.
 • రెండు బ్యారేజీల నిర్మాణానికి 2020-21 ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం వేసిన అంచనా వ్యయం సుమారు రూ. 2,565 కోట్లు.
 • 2022-23 ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం చూస్తే అంచనా వ్యయం రూ. 4761.42 కోట్లు. అంటే దాదాపుగా రెట్టింపైంది.
 • జగన్‌ సర్కారు హయాంలో ఇంతవరకు టెండర్లకు మోక్షం లభించలేదు.
 • ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద మూడో బ్యారేజీ నిర్మించాలని కూడా గత తెదేపా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని డీపీఆర్‌కు టెండర్‌ పిలవలేదు.

‘ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో కేవలం 3.5 టీఎంసీల నీరే అందుబాటులో ఉంది. ప్రకాశం బ్యారేజీ డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. తాగునీటి జలాలను పులిచింతల నుంచి తీసుకుంటున్నాం. కాల్వలకు వారం రోజులు విడుదల చేస్తాం. తాగునీటి చెరువులను నింపి కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించేలా చూడాలి’

-ఇటీవల సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి


వైకాపా ప్రభుత్వం ఏం చేసిందంటే..

 • వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేసింది.బీ ప్రకాశం బ్యారేజీ దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీలకు 2020 సెప్టెంబరులో స్టేజి 1 ఖర్చుల (సర్వే ఇతర అవసరాలకు) కింద రూ. 204.37 కోట్లు విడుదల చేస్తూ జీవో 482 జారీ చేసింది.
 • రెండు బ్యారేజీలపై సవివర నివేదికను ఆర్వీ అసోసియేట్‌ 2022 ఏప్రిల్‌లో జలవనరుల శాఖకు అందజేసింది.
 • కృష్ణా సెంట్రల్‌ డివిజను నుంచి ప్రభుత్వానికి డీపీఆర్‌ వెళ్లింది. దీన్ని ఆమోదిస్తూ పరిపాలన అనుమతి రావాల్సి ఉంది.
 • అంచనా వ్యయం ఇతర అంశాలపై సర్వే చేసిన ఆర్వీ సంస్థ జియో టెక్నికల్‌ పరిశీలన, పరిశోధన కూడా జరిపి సాంకేతిక అంశాలపై కూడా నివేదిక ఇచ్చింది. చోడవరం దగ్గర బ్యారేజీకి రూ. 2235.42 కోట్లు, మోపిదేవి దగ్గర బ్యారేజీకి రూ. 2526 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేసింది.

సర్కారు చేతిలో డబ్బుల్లేవా..

‘నిధుల కొరత పీడిస్తోంది. అందుకే బ్యారేజీల నిర్మాణానికి టెండర్లను పిలవలేదు. నిధుల్లేకే వేదాద్రి పనులు నిలిచిపోయాయి.’
- ‘ఈనాడు’తో ఓ ఇంజినీరు చెప్పిన మాటలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని