logo

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి

వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు.

Published : 19 Apr 2024 05:21 IST

ఈనాడు డిజిటల్‌, మచిలీపట్నం: వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో తెదేపా, జనసేన క్లస్టర్‌ ఇన్‌ఛార్జి, సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలతో స్థానిక ఆర్కే ప్యారడైజ్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంత వరకూ ప్రజల్లో ఉంటూ కూటమి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాలన్నారు. ఓటు గుర్తులను ఓటర్లే గుర్తించే విధంగా ప్రచారం నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. వైకాపా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో బుధవారం జరిగిన ప్రజాగళం సభ తేటతెల్లం చేసిందన్నారు. అందుకే ప్రజలందరూ తెదేపా, జనసేన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నాయకుడు బండి రామకృష్ణ పాల్గొన్నారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభ కేడర్‌లో ఫుల్‌ జోష్‌ నింపిందనీ.. ఇదే ఉత్సాహాన్ని ఎన్నికల వరకూ కొనసాగించాలన్నారు. అందరమూ పోటీపడి ప్రచారం చేసి.. జూన్‌ 4న తెదేపా, జనసేన, భాజపా జెండాలను ఎగరేయాలని తెలిపారు. మనస్పర్థలు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి విజయంలో భాగస్వాములు కావాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని