logo

తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!

‘గత ఐదేళ్ల జగన్‌ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది.

Updated : 19 Apr 2024 05:38 IST

హెచ్‌సీఎల్‌, అశోక్‌లేల్యాండ్‌ ఇవన్నీ చంద్రబాబు ఘనతే
కొత్త పరిశ్రమలు తేకపోగా.. ఉన్నోళ్లనూ వేధించిన వైకాపా
జగనొచ్చాక పూర్తిగా ఆగిపోయిన రాయితీ, ప్రోత్సాహకాలు
ఈనాడు, అమరావతి

‘గత ఐదేళ్ల జగన్‌ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. ఒకటి కాదు రెండు కాదు.. అనేక పెద్ద, చిన్న పరిశ్రమలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా మూసేసి వెళ్లిపోయాయి. ఎంఎస్‌ఎంఈల నుంచి ఐటీ కంపెనీల వరకూ వందల కంపెనీలు 2014 నుంచి 2019 వరకూ తెదేపా హయాంలో ఇక్కడ ఏర్పాటయ్యాయి. వాటిలో ఇప్పటికే చాలావరకూ వెళ్లిపోయాయి. చివరికి తమ సొంత కాళ్లపై.. బ్యాంకు రుణాలతో చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకుని నడుపుతున్న ఎలీప్‌ వంటి మహిళా పారిశ్రామికవేత్తల ప్రాంగణాల్లోనూ అనేక యూనిట్లు మూతపడ్డాయి. ఒక్క సూరంపల్లి ఎలీప్‌ ప్రాంగణంలోనే 2019 తర్వాత ఇప్పటివరకూ దాదాపు 40కు పైగా యూనిట్లు మూతపడ్డాయంటే జగన్‌ సర్కారు దెబ్బకు పరిస్థితి ఎంతదారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.’

  • చంద్రబాబు సీఎం హోదాలో 2018 మార్చిలో మల్లవల్లిలో అశోక్‌ లేల్యాండ్‌ యూనిట్‌కు శంకుస్థాపన నిర్వహించారు. నేరుగా 150 అడుగుల రోడ్డు వేయడంతో పాటు, వివిధ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పడంతో ఏడాది వ్యవధిలోనే బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ని అందుబాటులోకి తెచ్చారు. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్‌ లేల్యాండ్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ఇక్కడ యూనిట్‌ నెలకొల్పిందన్న సంగతే పట్టించుకోలేదు. ఫలితంగా జగన్‌ ప్రమాణ స్వీకార సమయానికే ప్రారంభానికి సిద్ధమైన యూనిట్‌ ఐదేళ్లుగా అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది.

  • మొత్తం 1,360 ఎకరాల విస్తీర్ణం గల మల్లవల్లి ఏపీఐఐసీ లేఔట్లు వేసి ఎనిమిదేళ్ల కిందటే మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఫుడ్‌పార్కులతో పాటు, అశోక్‌ లేల్యాండ్‌ బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ శరవేగంగా నిర్మాణం జరిగింది. హెరిటేజ్‌ దాణా కర్మాగారం, మోహన్‌ స్పింటెక్స్‌, చాక్లెట్లు, మైదా, గోధుమ పిండి తయారీ వంటి యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేశారు. కానీ వైకాపా హయాంలో వీటిల్లో కీలక పరిశ్రమలు తరలిపోయాయి. అశోక్‌ లేల్యాండ్‌తో పాటు రైల్‌నీర్‌, పార్లే ఆగ్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు యూనిట్ల స్థాపన ప్రారంభించి నేటికీ కొలిక్కి తీసుకురాలేదు.

న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్‌, గన్నవరం గ్రామీణం


నేడు చీకట్లు..

గన్‌ ఈ ఐదేళ్లలో కనీసం పరిశ్రమలను తేలేకపోయినా.. గత ప్రభుత్వం హయాంలో నెలకొల్పిన వాటినైనా.. మూతపడకుండా ఆపగలిగితే.. ఇంత పెద్దఎత్తున ఉపాధి రంగానికి దెబ్బపడేది కాదు. చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి పారిశ్రామిక ప్రగతికి ఊపిరిలూదింది. అందుకే.. తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టింది. పారిశ్రామిక ప్రగతి అంటే.. కేవలం మల్లవల్లిలో అశోక్‌లేల్యాండ్‌ వంటి భారీ పరిశ్రమలతోనే కాకుండా.. ఎంఎస్‌ఎంఈలపై అత్యధిక దృష్టి పెట్టారు. ఇదే సమయంలో ఐటీ పరిశ్రమలు, స్టార్టప్‌ కంపెనీలకు విపరీతంగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. వీటికి అవసరమైన మౌలిక వసతులు, భవనాల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టిపెట్టారు. కానీ.. జగన్‌ గద్దెనెక్కిన నుంచి ఇవన్నీ.. ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వీరికి ఇచ్చిన ప్రోత్సాహకాలను ఆపేశారు. అంతే.. ఉద్యోగ, ఉపాధి రంగంలో వెలుగులన్నీ మాయమై.. చీకట్లు అలముకున్నాయి.


నాడు.. స్వర్ణయుగం..

చంద్రబాబు దార్శనికత ఎలా ఉంటుందనడానికి.. 2014 జూన్‌ నుంచి 2019 వరకూ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన పరిశ్రమలే నిదర్శనం. కాటన్‌, టెక్స్‌టైల్స్‌ అండ్‌ గార్మెంట్స్‌, కెమికల్స్‌, నిర్మాణరంగ అనుబంధ ఉత్పత్తుల తయారీ, ఆగ్రో అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫార్మా, సిరామిక్‌, ప్లాస్టిక్‌, గోనెసంచులు, స్టీల్‌ సామగ్రి, రక్షణ రంగ విడిభాగాలు, ఆటోమొబైల్‌ అనుబంధ పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటయ్యాయి. భారీ పరిశ్రమలు 17 ఏర్పాటై.. ఉత్పత్తిని ఆరంభించగా రూ.2,339 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6,820 మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి.


వెంటాడి మరీ పారిపోయేలా చేసి..

మ్మడి కృష్ణాలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పారిశ్రామికంగా ఏం చేశారనగానే.. హెచ్‌సీఎల్‌ నుంచి.. మేథా టవర్స్‌-1, 02, ఆటోనగర్‌లో సాఫ్ట్‌వేర్‌ టవర్స్‌ వరకూ అనేకం గుర్తొస్తాయి. మల్లవలి,్ల వీరపనేనిగూడెంల్లో.. భారీ పరిశ్రమలకు వందల ఎకరాలు కేటాయించారు. కొండలు, గుట్టలను చదునుచేసి.. పారిశ్రామికవాడలుగా మార్చారు. కానీ.. జగనొచ్చారు. అంతే.. అక్కడితో.. ఆ పారిశ్రామిక ప్రాంగణాల కళ తప్పింది. గత సర్కారు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన భూముల ధరలను అమాంతం పెంచేసి.. వారిని గుల్లచేయడం ఆరంభించారు. కొందరు న్యాయస్థానాల్లో పోరాడుతుంటే.. మరికొందరు ఈ తలనొప్పులన్నీ ఎందుకని వదిలేసి వెళ్లిపోయారు.


ఉపాధి దూరం

-రాఘవరావు, బాపులపాడు

మల్లవల్లిలో పరిశ్రమలు మొత్తం అందుబాటులోకి వస్తే కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల పరిధిలోని 40 గ్రామాల్లోని వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. ఒక్క అశోక్‌ లేల్యాండ్‌తోనే దాదాపు నాలుగు వేల మందికి అవకాశాలు వస్తాయన్నారు. వైకాపా వచ్చిన తర్వాత ఇవన్నీ కల్లలయ్యాయి.


ధర పెంచేశారు

- ప్రదీప్‌, పారిశ్రామికవేత్త

మల్లవల్లిలో చిన్నతరహా పరిశ్రమ స్థాపించాలని దరఖాస్తు చేశా. అనూహ్యంగా ఎకరాకు రూ.89.50 లక్షలు ధర చెల్లించాలని ఏపీఐఐసీ అధికార్లు చెప్పారు. తెదేపా హయాంలో ఎకరా ధర రూ.16.50 లక్షలు నిర్ణయించగా, వైకాపా పాలనలో దాదాపు అయిదు రెట్లు పెంచేశారు. దీంతో యూనిట్‌ ఏర్పాటు ఆలోచన విరమించుకున్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని