logo

మండుటెండలో సమరోత్సాహం

కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్‌ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 05:43 IST

తెదేపా ఎంపీ అభ్యర్థి చిన్ని నామపత్రం దాఖలు
బెజవాడకు వెల్లువలా తరలివచ్చిన కూటమి శ్రేణులు

ఈనాడు - అమరావతి: కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్‌ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనం తరలివచ్చి చిన్నిని ఆశీర్వదించారు. అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొని విజయబావుటాకు నాంది పలికారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో శివనాథ్‌ తన నామినేషన్‌ కలెక్టర్‌ డిల్లీరావుకు అందించారు. చిన్ని సతీమణి జానకిలక్ష్మి, తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న  సమక్షంలో నామినేషన్‌ సమర్పించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, నాయకులు కొలికపూడి శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య, పట్టాభి, అడ్డూరి శ్రీరామ్‌ విచ్చేశారు. బందరు రోడ్డు పసుపుమయం: చిన్ని నామినేషన్‌ సందర్భంగా బందరు రోడ్డు పసుపుమయంగా మారింది. పసుపు బనియన్లు ధరించిన కార్యకర్తలు ర్యాలీలో అగ్రభాగాన ద్విచక్ర వాహనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీసు కంట్రోల్‌ రూం నుంచి మ్యూజియం రోడ్డు భారీగా జనంతో నిండిపోయింది. ఎన్నికల అధికారులు ర్యాలీ మొత్తాన్ని వీడియో చిత్రీకరింపజేశారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి సామాన్యులు వెళ్లేందుకు ఆంక్షలు విధించారు. ఇతరులకు కలెక్టరేట్‌లోకి అనుమతి లేదని నిరాకరించారు. మీడియాను రోడ్డుమీదనే నిలిపివేయగా పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేవలం ఐఅండ్‌ పీఆర్‌ ఇచ్చిన సమాచారమే ప్రసారం చేసుకోవాలని పోలీసులు సూచించడం గమనార్హం.

 

నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న కేశినేని చిన్ని. పక్కన బుద్దా వెంకన్న, నెట్టెం రఘురాం, జలీల్‌ఖాన్‌

ఈ ఎన్నికలు లాంఛనమే..: కేశినేని చిన్ని

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌: తాము ఇప్పటికే గెలిచామనీ, ప్రస్తుత ఎన్నికలు లాంఛనమేనని ఎన్డీయే కూటమి విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. నామినేషన్‌ వేయడానికి ముందు నగరంలో వినాయకుడి గుడిలోకి వెళ్లేందుకు తనకు అరగంట సమయం పట్టిందనీ, కార్యకర్తలు భారీగా నూతనోత్సాహంతో తరలిరావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉరిమే ఉత్సాహం వెనుక కోపం.. కసి.. బాధ.. దాగి ఉన్నాయని విశదీకరీంచారు. విజయవాడ ఎంపీతోపాటు.. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపు తమదేనన్నారు. తమ పట్ల చంద్రబాబు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు.

నామపత్ర సంరంభానికి పోటెత్తిన కూటమి శ్రేణులు

రక్తికట్టని గులకరాయి నాటకం..: విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి అని వైకాపా నేతలు డ్రామాలు ఆడారనీ, తీరా గులకరాయి నాటకం రక్తికట్టక.. అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని చిన్ని దుయ్యబట్టారు. జగన్‌ ఓ పిట్టల దొర.. ఆయన చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. చంద్రబాబు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. సాగునీటి రంగం అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణం.. బాబుతోనే సాధ్యమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అనుగుణంగా తమ మ్యానిఫెస్టో ఉండబోతుందని చెప్పారు.

గుర్తుంచుకోండి .. మనది సైకిల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని