logo

భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం

భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

Published : 20 Apr 2024 05:56 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టపర్తి శ్రీకాంత్‌ పోరంకి వసంత్‌నగర్‌ కాలనీ నివాసి. ఇతను భవన నిర్మాణదారుడిగా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తుంటారు. ఇటీవల ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యారు. విడతల వారీగా తన బ్యాంకు ఖాతాల నుంచి రూ.35 లక్షలు యాప్‌లోని ఖాతాకు బదిలీ చేశారు. ఇతనికి నగదు అవసరమై ఈ నెల 2వ తేదీన ట్రేడింగ్‌ యాప్‌ నుంచి నగదు డ్రా చేసుకోవడానికి ప్రయత్నించారు. యాప్‌ నిర్వాహకులు రెండు రోజుల్లో నగదు తిరిగి ఖాతాకు జమ అవుతాయంటూ నమ్మబలికారు. రెండు రోజుల తర్వాత ఇతను నగదు డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ఫలించలేదు. పైగా నిర్వాహకులు ఇతడిని తమ యాప్‌ నుంచి తొలగించారు. మోసపోయినట్లు గుర్తించిన శ్రీకాంత్‌ పెనమలూరు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వడ్డీ వ్యాపారి వేధింపులతోనే ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: వడ్డీ వ్యాపారి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆలస్యంగా వెలుగు చూసిన ఓ సెల్ఫీ వీడియో నగరంలో కలకలం రేకెత్తించింది. బాధితుల వివరాల మేరకు సర్కిల్‌పేటకు చెందిన ఖాదర్‌ఖాన్‌ ఈనెల 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేముందు అతను ఓసెల్ఫీ వీడియో తీశారు. శుక్రవారం కుటుంబ సభ్యులు దాన్ని చూడడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీ నగరానికి చెందిన వడ్డీ వ్యాపారి కొల్లిపర శివకుమార్‌ దగ్గర కొంత కాలం కిత్రం ఖాదర్‌ఖాన్‌ రూ.70,000 అప్పుగా తీసుకున్నారు. కొంత మొత్తం చెల్లించినా వడ్డీలు, చక్రవడ్డీలు వేసి రూ.10.50 లక్షలు చెల్లించాలంటూ కోర్టులో కేసు వేయడంతో పాటు ఇంటి ముందు టముకా వేయించాడు. కుటుంబ సభ్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పోలీసులు, పెద్దలను ఆశ్రయించినా న్యాయం దక్కే పరిస్థితి లేకపోవడంతో వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియోలో స్పష్టం చేశాడు. ఇదే మరణ వాంగ్మూలంగా తీసుకుని వడ్డీ వ్యాపారిపై తగు చర్యలు తీసుకోవాలని, తన కటుంబానికి రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నాడు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


కారుపై యాసిడ్‌ పోసిన అపార్ట్‌మెంట్‌ వాసులపై కేసు

పెనమలూరు, న్యూస్‌టుడే: అపార్ట్‌మెంట్‌ కొనుగోలులో కమిషన్‌ ఇవ్వలేదనే ఆగ్రహంతో మహిళకు చెందిన కారుపై యాసిడ్‌ పోసి భయాందోళనలకు గురిచేసిన నలుగురిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. పొన్నం పావని కానూరు కృష్ణనగర్‌లోని ఎస్‌ఎస్‌ రెసిడెన్సీ నివాసి. ఈమెకు అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ఎన్‌.ఆంజనేయులుతో అపార్ట్‌మెంట్‌ కొనుగోలులో కమిషన్‌పై వివాదం ఉంది. తనకు కమిషన్‌ ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆంజనేయులు సునీతతో పాటు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. తమకు పార్కింగ్‌ సమస్య ఉందని సమస్యను పరిష్కరిస్తేనే కమిషన్‌ ఇస్తామంటూ సునీత తెలుపుతూ వస్తోంది. ఇటీవల ఈమె కారు పార్కింగ్‌కు ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టడం, కమిషన్‌ కోసం వేధించడం చేస్తున్నాడు. గురువారం ఈమె బయటకు వెళ్లడానికి కారు వద్దకు రాగా అప్పటికే కారుపై యాసిడ్‌ పోసి ఉండడం కారు రంగు మారిపోవడాన్ని గుర్తించింది. భయాందోళనలకు గురైన ఈమె పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కారుపై యాసిడ్‌ పోయడంతో పాటు బెదిరిస్తున్న ఆంజనేయులు, ఆనందరావు, శ్రీహరి, వాచ్‌మెన్‌ ఏడుకొండలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


క్వారీలో ప్రమాదం.. లారీడ్రైవర్‌ అనుమానాస్పద మృతి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం ముస్తాబాద క్వారీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అతడు మృతి చెందాడు. కంకిపాడు మండలం కోలవెన్నుకు చెందిన వేముల వీరబాబు(45) లారీ డ్రైవర్‌ కాగా.. గత రెండేళ్లుగా జాస్తి సునీల్‌ వద్ద పనిచేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ యథావిధిగా వీరబాబు పని నిమిత్తం ఇంటి నుంచి ఉదయం బయలుదేరి వచ్చారు. రాత్రి పది గంటల సమయంలో క్వారీలో లారీ బోల్తా కొట్టిందని, వీరబాబు తలకు బలమైన గాయమవడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించామని తోటి డ్రైవర్‌.. వీరబాబు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. మాట్లాడలేని స్థితిలో ఉన్న వీరబాబు చూసి భోరుమన్నారు. ఒంటిపై ఎటువంటి దెబ్బలు లేని వీరబాబు చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు అమ్మాయిలు సంతానం.

 ప్రాణాలతో చెలగాటం..: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా గన్నవరం పరిసరాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వెదురుపావులూరు, ముస్తాబాద, గొల్లనపల్లి, కొండపావులూరులో నిత్యం వందల లారీల మట్టిని తరలిస్తున్నారు. లారీలను ప్రమాదకరంగా కొండల పైకి ఎక్కిస్తూ ఓ పక్క డ్రైవర్లతో.. రోడ్లను నాశనం చేస్తూ దుమ్ము, ధూళితో నివాసితుల ప్రాణాలతో క్వారీ నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. క్వారీలో నిత్యం ఏదో ప్రమాదం జరుగుతున్నా.. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అటు నిర్వాహకులు, ఇటు పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కారు ఢీకొని మరొకరు..

కురుమద్దాలి(పామర్రుగ్రామీణం), న్యూస్‌టుడే: కురుమద్దాలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ తాడిగడపకు చెందిన పరిశె రఘురామయ్య(59) ద్విచక్రవాహనంపై మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ ప్రయాణిస్తుండగా..కురుమద్దాలి ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించి విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య నాంచారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని