logo

మహా మాయగాళ్లు..!

‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.

Updated : 20 Apr 2024 06:20 IST

అవసరం తీరాక గాలికొదిలేసిన వైనం
రూపాయి రిజిస్ట్రేషన్లంటూ టిడ్కో లబ్ధిదారులకు వల

ఈనాడు, అమరావతి : ‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేయించేసి.. నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చేస్తా. రుణం లేకుండా విముక్తి చేస్తా. అవసరమైతే వన్‌ టైం సెటిల్మెంట్‌ చేస్తా.’

2018లో ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్రలో గుడివాడకు వచ్చినప్పుడు ఇచ్చిన అనేక హామీల్లో ఇది ఒకటి.


గద్దెనెక్కాక.. ఏం చేశారో తెలుసా?

కల్లబొల్లి మాటలను నమ్మిన జనం ఓట్లేసి జగన్‌ను గద్దెనెక్కిస్తే... ఆయనేమో ఇచ్చిన మాటలను తూచ్‌ అని పక్కన పెట్టేశారు. గుడివాడ మల్లాయపాలెంలో గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే 77 ఎకరాల్లో 220 బ్లాకులుగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని 80 శాతం పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించి.. లబ్ధిదారులకిచ్చేందుకు కేవలం మూడునాలుగు నెలలకు మించి పట్టదు. కానీ.. 2019 జూన్‌లో అధికారంలోకొచ్చిన జగన్‌ 2023 జూన్‌ వరకూ టిడ్కో ఇళ్లను గాలికొదిలేయడంతో అవి శిథిలస్థితికి చేరాయి.

మళ్లీ ఎన్నికలొచ్చాయని జగనొచ్చి..!

మళ్లీ సార్వత్రిక ఎన్నికలొస్తున్నాయని జనం గుర్తొచ్చినట్టున్నారు. తొమ్మిది నెలల కిందట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కళ్లు తెరిచారు. చంద్రబాబు కట్టిన ఇళ్లకు హడావుడిగా వైకాపా రంగులేసేసి.. ముఖ్యమంత్రి జగన్‌ను తీసుకొచ్చి పంపిణీ చేసేశారు. కనీసం డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్తులాంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ఆనందంగా ఇళ్లల్లోకి దిగిన లబ్ధిదారులు అక్కడి పరిస్థితి చూసి షాక్‌ తిన్నారు. ఇవేం ఇళ్లు.. ఇదేం సర్కారంటూ గగ్గోలు పెట్టారు. చాలామంది ఇళ్లను ఖాళీ చేసి వెనక్కి వచ్చేశారు. దీనికి కారకులైన.. ముఖ్యమంత్రి జగన్‌, ఎమ్మెల్యే కొడాలి నాని తీరును నిరసిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జగన్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు గుడివాడలోని పది ప్రాంతాల్లో లబ్ధిదారులు ఆందోళనలు చేశారంటే వారి ఆవేదనను అర్థం చేసుకోవచ్చు.

మల్లాయపాలెంలో టిడ్కో ఇళ్లు

డబ్బులు కట్టినోళ్లనూ తప్పించేసి..

గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకు ఎంపికై.. డబ్బులు కట్టిన చాలామంది లబ్ధిదారులను కొడాలి నాని, ఆయన అనుచరుల నేతృత్వంలో తప్పించేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యుత్తు బిల్లులు అధికంగా వచ్చాయని, కారుందని, సిబిల్‌ స్కోర్‌ సరిగా లేదంటూ ఏవేవో సాకులను చూపించి తెదేపా సానుభూతిపరులు, రాజకీయాలతో సంబంధం లేని నిరుపేదల పేర్లను జాబితా నుంచి తప్పించేశారు. గత ప్రభుత్వంలో ఫ్లాట్లు దక్కించుకుని, తాళాలు తీసుకున్న వాళ్లను సైతం అన్యాయంగా తప్పించేశారు.

వడ్డీతో కట్టిస్తున్నారు..

  •  గత తెదేపా ప్రభుత్వ హయాంలో గుడివాడ మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో 220 బ్లాకులను జీ ప్లస్‌ త్రీ నమూనాలో 8,912 ఇళ్లను నిర్మించారు. వీటిని సుమారు 7 వేల మందికి కేటాయించారు.
  •  365 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ. 7.55 లక్షలు, 430 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ. 8.50 లక్షలను లబ్ధిదారులు కట్టాలి.
  •  ప్రస్తుతం 365 చ.అడుగుల ఫ్లాట్‌ల లబ్ధిదారులు నెలకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేలు, 430 చ.అడుగుల ఫ్లాట్‌ల లబ్ధిదారులు నెలకు రూ. 5 వేల నుంచి రూ. 5,700 మధ్యలో బ్యాంకులకు వాయిదాలు కట్టాల్సి వస్తోంది.

ఇంత మోసమా

‘మాట తప్పను.. మడమ తిప్పను.., ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్తా..’ లాంటి సినిమా డైలాగులను వేదికలపై చదివే సీఎం జగన్‌.. వాస్తవంలో తన అసలు రూపం చూపించారు. తాను హామీ ఇచ్చాననే మాట కూడా మరచిపోవటం గమనార్హం. తొమ్మిది నెలల కిందట జగన్‌ స్వయంగా టిడ్కో ఇళ్ల పత్రాలను ఇవ్వడంతో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రుణభారం ఉండదని లబ్ధిదారులు భావించారు. కానీ.. రూపాయికే రిజిస్ట్రేషన్‌ హామీ.. ఉత్తుత్తినే జగన్‌ చెప్పారన్నట్టుగా.. కొడాలి నాని తప్పించుకు తిరుగుతున్నారు. ఇదేంటని ఆయన్ను లబ్ధిదారులు నిలదీస్తే.. ముఖ్యమంత్రితో మాట్లాడి చేయిస్తానంటూ చెప్పి మాయమవుతున్నారంటూ లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 430 చ.అడుగుల ఫ్లాట్ల లబ్ధిదారులు 6,336 మంది. వీరు బ్యాంకుకు కట్టాల్సిన రుణ మొత్తం రూ. 541.72 కోట్లు.
  •  365 చ.అడుగుల ఇళ్ల లబ్ధిదారులు 992 మంది. వీరు బ్యాంకులకు కట్టాల్సిన మొత్తం రూ. 74.69 కోట్లు.
  •  మొత్తం రూ. 616.41 కోట్లను లబ్ధిదారులు కట్టక్కర్లేకుండా చేస్తానంటూ చెప్పిన జగన్‌... ఇపుడు మొహం చాటేశారు.
  •  గత తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఇళ్లు మంజూరవడంతో లబ్ధిదారులు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకూ అప్పులు చేసి ముందుగా చెల్లించారు. ఆ డబ్బులూ ఇవ్వకుండానే చాలామందిని వైకాపా అధికారంలోకొచ్చాక తప్పించేశారు. కనీసం తమ డబ్బులైనా వెనక్కి ఇవ్వాలంటూ వారంతా గత అయిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఈ ఇళ్లను ఉచితంగా ఇస్తానన్న సీఎం జగన్‌, ఎమ్మెల్యే కొడాలి నాని పత్తా లేరు.

అవస్థలమయంగా ఉన్న ఇళ్లల్లో ఎలా ఉండాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులకు కట్టే డబ్బులతో గుడివాడలోనే మంచి ఇళ్లల్లో ఉండొచ్చని టిడ్కో ఇళ్ల అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ, లబ్ధిదారులు ఎం.దుర్గ, గౌస్‌ఫీరా, సలీమున్నిషా, శివరామ్‌ప్రసాద్‌, సత్యనారాయణ, దుర్గారావు, సంగమ్మ చెబుతున్నారు. తమను ఈ ప్రభుత్వం నరక కూపంలోకి నెట్టేసి.. చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఈ భారీ టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద.. పాఠశాల, ఆసుపత్రి, పార్కులు, సామాజిక భవనం, పోలీసుస్టేషన్‌ సహా అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఏమీ చేయలేదు. కనీసం వీధి దీపాలు, డ్రైనేజీ, మంచినీరు వంటివి  గగనమైపోతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు