logo

జగన్‌.. ఇదేం ఖర్మకాండ..?

విశ్వవిఖ్యాత కూచిపూడి గ్రామంలో దశాబ్దాలుగా భీమనది డ్రెయిన్‌ గట్టుపై దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు ఆ గట్టుపైనే షెడ్డు నిర్మించుకున్నారు. అది కూడా శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి.

Published : 22 Apr 2024 05:27 IST

అంతిమ సంస్కారాలకు అవస్థలే 
రవేరని ముఖ్యమంత్రి హామీ
న్యూస్‌టుడే, కూచిపూడి, మోపిదేవి, ఘంటసాల

నాడు..జగన్‌మోహన్‌రెడ్డి 2018లో పాదయాత్ర సమయంలో పామర్రు వచ్చినప్పుడు స్థానికులు మరుభూమి లేక ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం అందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో భూములు కొనుగోలు చేసి కులాలవారీగా శ్మశానవాటికలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

నేడు.. అయిదేళ్లు దాటినా ఆ హామీ నేటికీ నెరవేరలేదు. దీంతో గ్రామాల్లో శ్మశానవాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విశ్వవిఖ్యాత కూచిపూడి గ్రామంలో దశాబ్దాలుగా భీమనది డ్రెయిన్‌ గట్టుపై దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు ఆ గట్టుపైనే షెడ్డు నిర్మించుకున్నారు. అది కూడా శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి. మరి కొందరు వ్యయప్రయాసలకోర్చి 20 కిలోమీటర్ల దూరాన గల శ్రీకాకుళంలోని కృష్ణా నది గట్టుపై కర్మకాండలు ముగించుకుంటున్నారు.

కూచిపూడి జంట గ్రామాల్లో ఒకటైన పెదపూడిలో కూడా భీమనది గట్టే మరుభూమిగా వాడుకుంటున్నారు. ఆ ప్రాంతంలోనే పంచాయతీ చెత్త పారబోస్తుండగా మరికొంత స్థలంలో క్రైస్తవులు శవాలను పూడ్చిపెడుతున్నారు. భూమి లేక దహన సంస్కారాలు చేసిన చోటే వేరొకర్ని పూడ్చిపెడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నిర్మించిన షెడ్డు శిథిలమై పిచ్చి మొక్కలతో నిండింది.


మోపిదేవి మండలంలో 12 పంచాయతీలకు రుద్రభూముల పనులు కేటాయించారు. ఒక్కటన్నా పూర్తిచేసిన దాఖలాలు లేవు. 2019లో తెదేపా అధికారంలో ఉండగా ఉపాధి హామీ పథకం, పంచాయతీ నిధులతో అప్పటి సర్పంచులు బాధ్యత తీసుకొని 50 శాతానికి పైగా పనులు చేసి పురోగతి సాధించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించడంతో శ్మశానవాటికల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి. పిచ్చిమొక్కలతో నిండి విషసర్పాలకు నిలయాలుగా మారాయి. మృతదేహాలను ఖననం చేయాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోందని బాధితులు పేర్కొన్నారు.


వందేళ్ల నుంచి 15 సెంట్లలోనే..

ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరువానిగూడెంకు అరకిలోమీటరు దూరాన పొలాల్లో రోడ్డు పక్కన ప్రేమల కోడు మురుగుకాల్వ ఒడ్డున 15 సెంట్ల భూమిని రూ.లక్షతో రెండేళ్ల క్రితం మెరక చేసుకున్నారు. వందేళ్ల నుంచి ఇదే స్థలాన్ని వినియోగిస్తున్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రామానికి సమీపంలో గ్రామకంఠం, మురుగు కోడు వద్ద బంజరు భూమి ఉంది. వాటిలో ఎక్కడైనా స్థలం ఇప్పించాలని కోరుతున్నారు.


ఎన్నో సార్లు అడిగాము

- బండారు రమేష్‌బాబు

కూచిపూడిలో శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద మొర పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కాల్వగట్టుపై సరైన స్థలం లేక వర్షం వస్తే అవస్థలు పడుతున్నాం. మా భూముల మధ్య దహన సంస్కారాలు చేయొద్దని చెబుతున్నా గత్యంతరం లేక అక్కడే చేయాల్సి వస్తోంది.


జగన్‌ ఇచ్చిన హామీ ఏమైంది?

- పి.బాలశ్రీనివాస్‌

స్థలాలు కొనుగోలు చేసి ఇస్తామని పాదయాత్రలో జగన్‌ చెప్పారు. ఇంతవరకూ అమలు కాలేదు. దీంతో భీమనది గట్టునే శ్మశానవాటికగా వాడుకుంటున్నాం. ఈ సమస్య పరిష్కారానికి సర్పంచులు కూడా ఆలోచన చేయడం లేదు. ప్రజల ఇబ్బందులు ఎవరికీ పట్టడం లేదు.


అవస్థలు పడుతున్నాం

 - కుంపటి ఏడుకొండలు, ఈపూరువానిగూడెం

ఈ గ్రామంలో 400 మందికి పైగా జనం ఉన్నారు. శ్మశాన స్థలం ఇబ్బందులపై గ్రామసభలు, స్పందనలో అర్జీలిచ్చినా స్థలం కేటాయించలేదు. వందేళ్లుగా పూడ్చిన చోటే మళ్లీ ఖననం చేస్తుండడంతో ఇబ్బందిగా ఉంటోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని