logo

విజయీభవ.. దిగ్విజయీభవ!

‘‘క్షేత్రంలో మెరుపు వేగంతో కదలండి.. తెదేపా, జనసేన, భాజపా కూటమి ఓట్లు మార్పిడి జరిగేలా అత్యంత అప్రమత్తంగా మసలుకోండి. అందరూ సమన్వయంతో సాగి.. ప్రజల మనసులు గెలవండి.

Updated : 22 Apr 2024 06:13 IST

బి-ఫారాలు అందుకున్న తెదేపా అభ్యర్థులు
తెలుగుదేశం శ్రేణుల్లో సమరోత్సాహం

ఈనాడు - అమరావతి: ‘‘క్షేత్రంలో మెరుపు వేగంతో కదలండి.. తెదేపా, జనసేన, భాజపా కూటమి ఓట్లు మార్పిడి జరిగేలా అత్యంత అప్రమత్తంగా మసలుకోండి. అందరూ సమన్వయంతో సాగి.. ప్రజల మనసులు గెలవండి. కూటమిని విజయపథాన నడపండని’’ తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం తరఫున సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవనున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో బీ-ఫారాలు అందజేసి.. దిశానిర్దేశం చేశారు.

తగ్గేదే లేదంతే..

కృష్ణా జిల్లా నుంచి అభ్యర్థులు బోడే ప్రసాద్‌ (పెనమలూరు), వర్ల కుమార్‌రాజా (పామర్రు), వెనిగండ్ల రాము (గుడివాడ), కొల్లు రవీంద్ర (బందరు), యార్లగడ్డ వెంకట్రావు (గన్నవరం), కాగిత కృష్ణప్రసాద్‌ (పెడన) బీ-ఫారాలు తీసుకున్నారు. గుడివాడలో నామినేషన్ల ఘట్టం వేడెక్కింది. వాస్తవానికి సోమవారం నామినేషన్లు దాఖలు చేయాలని తెదేపా నిర్ణయించుకోగా.. అదే రోజు వైకాపా కూడా నామినేషన్లను వేస్తామని ప్రకటించడంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. దీంతో తేదీలను మార్చుకున్నట్లు తెలిసింది. ఈనెల 23న తెదేపా, 25న వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారని తెలిసింది.

ప్రచారంలో ఉరకలు...

తెదేపా, భాజపా, జనసేన కూటమి.. నియోజకవర్గ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థి.. నియోజకవర్గాల అభ్యర్థుల సమన్వయంతో ప్రచారం చేస్తున్నారు. తూర్పు, సెంట్రల్‌, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటల్లో ప్రచారాలు ఊపందుకున్నాయి. పశ్చిమలో తెదేపా, భాజపా నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగారు. బందరు పరిధిలోనూ ఇప్పటికే అధినేత రెండుసార్లు పర్యటించారు. పామర్రు, ఉయ్యూరులలో చంద్రబాబు సభలు జరిగాయి. పెడన, బందరులో పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు ఉమ్మడి సభలు నిర్వహించారు. గుడివాడలో ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. పెడన, అవనిగడ్డల్లో ఉత్సాహంతో.. జనసేన, తెదేపా కార్యకర్తలు ఉరకలేస్తున్నారు.


వసంత, ఉమా ఐక్యతారాగం

ప్పటికే కొందరు నామినేషన్లు దాఖలు చేయగా మరికొందరు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితోపాటు అసెంబ్లీ అభ్యర్థులు బొండా ఉమా (సెంట్రల్‌), తంగిరాల సౌమ్య (నందిగామ) శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), కొలికపూడి శ్రీనివాసరావు (తిరువూరు), వసంత కృష్ణప్రసాద్‌ (మైలవరం) అధినేత చేతుల మీదుగా బీఫారాలు అందుకున్నారు. మైలవరంలో తెదేపా కూటమి అభ్యర్థిగా వసంతకృష్ణప్రసాద్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈసందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమాను ఆయన నివాసంలో కలిసి మద్దతు కోరారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని