logo

పేదల కష్టం కనపడలేదా?

‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మధురానగర్‌ ఆర్‌యూబీ పూర్తి చేస్తాం. వాంబేకాలనీ వాసులకు ఉపయోగపడేలా దేవీనగర్‌-వాంబేకాలనీ మధ్య ఆర్‌వోబీ రెండేళ్లలో కట్టేస్తాం.’ 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గ ప్రజలకు వైకాపా గుప్పించిన హామీలివి.

Updated : 22 Apr 2024 07:51 IST

పట్టించుకోని వైకాపా ప్రజాప్రతినిధులు
మధురానగర్‌, న్యూస్‌టుడే

‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మధురానగర్‌ ఆర్‌యూబీ పూర్తి చేస్తాం. వాంబేకాలనీ వాసులకు ఉపయోగపడేలా దేవీనగర్‌-వాంబేకాలనీ మధ్య ఆర్‌వోబీ రెండేళ్లలో కట్టేస్తాం.’ 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గ ప్రజలకు వైకాపా గుప్పించిన హామీలివి. అధికారంలోకి వచ్చి.. అయిదేళ్లు అవుతున్నా మధురానగర్‌ ఆర్‌యూబీనే పూర్తి చేయలేకపోయారు. మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. దేవీనగర్‌-వాంబేకాలనీ మధ్య రెండేళ్లలో కట్టేస్తామన్న ఆర్‌వోబీ ఊసే మరిచిపోయారు. వేలాది మంది నిరుపేద వాంబేకాలనీ వాసుల కష్టాలు తీర్చే.. ఈ ఆర్‌వోబీ నిర్మాణంపై విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అయిదేళ్లలో కనీసం ప్రతిపాదనే చేయలేదు. ఫలితంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక నిత్యం వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ట్రాక్‌ దాటుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చి మడమ తిప్పిన వైకాపా హామీ వైఫల్యంపై కథనం.

అజిత్‌సింగ్‌నగర్‌ వాంబేకాలనీలో అందరూ నిరుపేదలే ఉంటారు. దాని చుట్టుపక్కల దాదాపు 50 వేల మంది నివాసం ఉంటున్నారు. వీరిలో రోజు వారీ కూలీలు, ముఠా, తాపీ, మెకానిక్‌ పనులకు వెళ్లే వారే అధికం. ఆయా పనుల నిమిత్తం ఆటోనగర్‌ వంటి సుదూర ప్రాంతాలకు వెళుతుంటారు. వాంబేకాలనీ, డాబాకొట్లు రోడ్డు మీదుగా అజిత్‌సింగ్‌నగర్‌ పై వంతెన ద్వారా నగరంలోకి వెళతారు. అంత దూరం వెళ్లలేక.. దగ్గర దారిగా ఉన్న వాంబేకాలనీ-దేవీనగర్‌ మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖపట్నం రైల్వే ట్రాక్‌ ఎక్కి దిగి.. దేవీనగర్‌, మధురానగర్‌ మీదుగా నగరంలోకి సులువుగా చేరుకుంటున్నారు.

మార్గం తవ్వేశారు : ఈ రైల్వేట్రాక్‌ పక్కనే భారీ మురుగునీటి కాలువ ఉండేది. దేవీనగర్‌ వైపు వెళ్లేందుకు కాలువ దాటే చోట తూములు ఉండేవి. వీటి మీదుగా పాదచారులు, సైకిలిస్టులు వెళ్లే వారు. రైల్వే అధికారులు భద్రతా కారణాలు చూపుతూ తూములను తొలగించి మార్గాన్ని తవ్వేశారు. స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికార వైకాపా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. స్థానికుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో సిమెంటు కరెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు.


8 కిలోమీటర్లు దూరం  కలిసి వస్తుంది

వాంబేకాలనీ వాసులు.. దేవీనగర్‌ మీదుగా నగరంలోకి వెళితే సుమారు 8 కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. ఉదయం వేళల్లో అజిత్‌సింగ్‌నగర్‌ పైవంతెనపై విపరీతమైన రద్దీ ఉంటుంది. ఒక్కోసారి ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే.. సరైన సమయానికి కూలి పనులకు వెళ్లలేరు. అదే.. దేవీనగర్‌ మీదుగా వెళితే అజిత్‌సింగ్‌నగర్‌ పై వంతెన ఎక్కనవసరం లేదు. ఫలితంగా దూరం కలిసి రావడమే కాకుండా ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయి. అందుకే ఆర్‌వోబీ కట్టాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. వైకాపా నాయకులు.. రెండేళ్లలో కట్టేస్తామని 2019 ఎన్నికల్లో హామీలు ఇచ్చి విస్మరించారు. కనీసం ప్రతిపాదన చేయకుండా మొండి చెయ్యి చూపించిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


ఎర్రమట్టితో కట్ట నిర్మాణం : తాజాగా దేవీనగర్‌-వాంబేకాలనీ మధ్య రాకపోకల సాగించే మార్గం వద్ద రైల్వే అధికారులు ఎర్రమట్టి కుప్పలుగా పోశారు. ఈ మట్టితో రైల్వేట్రాక్‌ వద్ద కంకర జారిపోకుండా రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రమట్టి జారిపోకుండా ఉండేందుకు అటు వైపు రాకపోకలను నిషేధించే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఇదే జరిగితే.. మళ్లీ జనమంతా అజిత్‌సింగ్‌నగర్‌ పైవంతెనపై నుంచి వెళ్లాల్సిందే. దీని వల్ల సమయం వృథా, రవాణా ఖర్చుల భారం అవుతుందని వాంబేకాలనీ వాసులు భయపడుతున్నారు.


ఆటో ఖర్చు కలిసి వస్తుంది

- వాసుదేవరావు, తాపీ కూలి

వాంబేకాలనీలో ఉంటా. రోజూ ముఠా పనికి వెళతా. మాకు రైల్వే ట్రాక్‌ ఎక్కి దిగితే.. పనికి దగ్గరగా ఉంటుంది. రోజూ ఇలాగే వస్తున్నాం. రైలు వచ్చే సమయంలో భయమేస్తుంటుంది. అయినా తప్పదు. కంకరపై జారిపోతున్నా.. దగ్గరని ఇటు వైపే వెళతాం. సింగ్‌నగర్‌ పైవంతెన మీదుగా వెళితే ఆటో కోసం రూ.40లు ఖర్చు చేయాలి. దేవీనగర్‌ మీదుగా వెళితే ఆ ఖర్చు కలిసి వస్తుంది.  


సీతారాంపురంలో పనికి వెళుతుంటా

- పెద్ది శ్రీను, ముఠా కూలి

సీతారాంపురంలో ముఠా కూలిగా పనిచేస్తున్నా. ప్రతి రోజూ వాంబేకాలనీ నుంచి దేవీనగర్‌, మధునానగర్‌ మీదుగా వెళుతుంటా. దీని వల్ల చాలా దూరం కలిసి వస్తుంది. నేను గతంలో చాలా సార్లు అజిత్‌సింగ్‌నగర్‌ పైవంతెనపై ట్రాఫిక్‌ జాంలో ఇరుక్కున్నా. అందుకే దేవీనగర్‌ మీదుగా వెళుతున్నా. మాకు ఇక్కడ ఆర్‌వోబీ కడతామని చెప్పారు. ఇప్పటికీ కట్టలేదు. రోజూ మాకు ఇబ్బందులు తప్పడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని