logo

రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి

గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి..

Updated : 25 Apr 2024 07:48 IST

ఈనాడు, అమరావతి: గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ జనం నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక.. వారిపై దాడులకు తెగబడుతున్నారు. మొన్న నీటి కోసం గుడివాడ పట్టణ ప్రజలు నిలదీస్తే.. నేడు రహదారులు ఎందుకు వేయలేదంటూ గ్రామీణ ప్రాంతాల యువత నిలదీస్తున్నారు. దీన్ని తట్టుకోలేక నాని వర్గం దాడులకు దిగుతుంది. తాజాగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం కూరాడలో ఇలాంటి ఘటనే జరగ్గా.. దానిని బయటకు రాకుండా కొడాలి వర్గం వారిని బెదిరించారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి 10 గంటలు దాటాక.. కొడాలి నాని తన అనుచరులతో కలిసి కూరాడ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. అదే సమయంలో కొందరు యువకులు కలిసి.. గత ఎన్నికల ముందు ఇలాగే వచ్చి.. గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి వెళ్లే ప్రధాన రహదారిని బాగు చేస్తానంటూ నాని హామీ ఇచ్చారని, కానీ.. తర్వాత పట్టించుకోలేదంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేనే నిలదీస్తారా.. అంటూ ఆ యువకులను బూతులు తిడుతూ.. వైకాపా మూకలు నెట్టేసి కొట్టినట్లు తెలుస్తోంది. అయినా సదరు యువకులు ఏమాత్రం భయపడకుండా.. ‘ఎన్నిసార్లు ఇలా ఓట్ల కోసం వచ్చి మమ్మల్ని మోసం చేస్తారు.? గత ఐదేళ్లలో ఎమ్మెల్యే తమ గ్రామానికి చేసిందేం లేదు. అడిగితే తప్పా?’ అంటూ నిలదీసినట్టు తెలుస్తోంది.

కేసు పెట్టకుండా బెదిరింపులు

ప్రజా సమస్యలపై నిలదీస్తే తమను కొట్టడంపై సదరు యువకులు పోలీసు కేసు పెట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం. కానీ.. వారిని బెదిరించి కొడాలి నాని వర్గంతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కట్టడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన బయటకు రాకుండా దాచి ఉంచేందుకు ప్రయత్నించడం గమనార్హం. బుధవారం రాత్రి వరకూ ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.


ఒక్క రోడ్డూ వేయలేకపోయిన కొడాలి..

తెదేపా ప్రభుత్వ హయాంలోనే.. కేంద్ర, రాష్ట్రాలు కలిసి గ్రామాలన్నింటిలో 95 శాతానికి పైగా రహదారులను వేసేశాయి. మిగిలిన అరకొర దారులనూ వేయలేక వైకాపా సర్కారు చేతులెత్తేసింది. కొడాలి నాని ఐదేళ్ల కిందట మాట ఇచ్చి కూడా.. గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి వెళ్లే ప్రధాన రహదారిని వేయలేదు. ఎన్నికలొస్తున్నాయని ఇటీవల గుంతలు మాత్రం పూడ్చారు. అదికూడా.. ఫ్లైయాష్‌, రబ్బీస్‌ గుంతల్లో పోసి వదిలేశారు. దీంతో అవి రాళ్లు తేలి, దుమ్ము ధూళితో మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ.. వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారి గురించే కూరాడ యువకులు కొడాలి నానిని నిలదీశారు. కానీ.. వారికి సమాధానం చెప్పలేక.. దౌర్జన్యానికి దిగడంపై.. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత ఐదేళ్లు ఎమ్మెల్యేగా నాని ఏ అభివృద్ధీ చేయకపోయినా.. ఓట్లు అడగడానికి రాగానే హారతులిచ్చి, పూలదండలు వేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని